జగన్ కోటరీ అంటూ పీవీ సునీల్ కుమార్ సంచలన వ్యాఖ్యలు
ఇక వైసీపీ అధినేత మాజీ సీఎం గురించి చెబుతూ ఆయన మంచివారే కానీ చుట్టూ ఉన్న కోటీరీతోనే ఇబ్బంది అని పీవీ సునీల్ కుమార్ అసలు విషయం చెప్పారు.;
వైసీపీ అధినేత వైఎస్ జగన్ గురించి ఎవరు మాట్లాడినా లేక విమర్శ చేసినా ఆయన కోటరీనే ముందుగా చెబుతారు. వైసీపీ నుంచి బయటకు వెళ్ళిపోయిన వారు కూడా అదే మాట అన్నారు. తాజాగా ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్ ఒక యూట్యూబ్ చానల్ కి ఇంటర్వ్యూ ఇస్తూ జగన్ మీద చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. వైసీపీ ప్రభుత్వంలో కూడా తనను జగన్ పక్కన పెట్టారు అని సునీల్ కుమార్ ఆరోపించారు. ఇది ఆయన ఇప్పటిదాకా ఎక్కడా చెప్పకపోవడమే కాదు ఆయన వైసీపీ మనిషి అంటూ విమర్శలు చేసేవారికి కొత్త సందేశంగా ఈ వ్యాఖ్యలు ఉన్నాయని అంటున్నారు.
బాబు అరెస్ట్ ని వ్యతిరేకించా :
అప్పట్లో అంటే 2023 సెప్టెంబర్ 9న నాటి మాజీ సీఎం టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుని తాను వ్యతిరేకించాను అని మరో కొత్త విషయాన్ని ఆయన చెప్పారు. తాను కొన్ని విధానపరమైన విషయాల్లో వైసీపీని వ్యతిరేకించడం వల్లనే తనను వైసీపీ ప్రభుత్వంలో కూడా పక్కన పెట్టారు అన్నారు. తన మీద వైసీపీ ముద్ర ఉండడం తగదని తనకు వైసీపీ ప్రభుత్వంలోనూ ప్రాధాన్యత పెద్దగా దక్కలేదని ఆయన చెప్పారు. వైసీపీ హయాంలో తనకు అప్రధానమైన పోస్టింగ్ ఇచ్చారని గుర్తు చేశారు.
జగన్ మంచివారే కానీ :
ఇక వైసీపీ అధినేత మాజీ సీఎం గురించి చెబుతూ ఆయన మంచివారే కానీ చుట్టూ ఉన్న కోటీరీతోనే ఇబ్బంది అని పీవీ సునీల్ కుమార్ అసలు విషయం చెప్పారు. పర్సనల్ గా చూస్తే ఆయన ఎంతో కూల్ అని సునీల్ కుమార్ చెప్పారు. ఎవరైనా తనతో విభేదించినా ప్రశాంతంగా వారు చెప్పేవి వినే మంచి మనిషి జగన్ అని సునీల్ కుమార్ అన్నారు. అయితే ఆయన చుట్టూ కనిపించని కంచె ఉందని అన్నారు. దానిని కోటరీ అనొచ్చు అన్నారు. వారితోనే అసలైన సమస్యలు వచ్చాయని ఆరోపించారు. తాము చెప్పే మాటలను వినని వారిని జగన్ కి వారి మీద వ్యతిరేకంగా చెప్పి మరీ దూరం చేయడం కోటరీ చేసే పని అన్నారు.
బాబు సైతం :
ఇదిలా ఉంటే తాను మొత్తం మూడు దశాబ్దాల పాటు పోలీసు సర్వీస్ చేశాను అన్నారు. అందులో అత్యధికంగా 15 ఏళ్ళ పాటు చంద్రబాబు హయాంలోనే చేశాను అని గుర్తు చేసుకున్నారు. ఇక బాబు సీఎం గా ఉండగానే జిల్లాలో ఎస్పీగా పనిచేసిన అనుభవంతోనే ఉన్న తనను హైదరాబాద్‌లో కీలకమైన డీసీపీ ఈస్ట్ జోన్ లో నియమించి కీలకమైన పదవీ బాధ్యతలు అప్పగించారని గుర్తు చేసుకున్నారు. సీఎం గా బాబు పాలన గురించి మాట్లాడుతూ ఆయనకు చట్టాలు, నిబంధనల గురించి బాగా అవగాహన ఉందని వాటిని అయన అనుసరిస్తారు అని చెప్పారు ఆయన అనవసరంగా ఏ అధికారిని అయినా లేదా రాజకీయ నేతను అయినా వేధించేది ఉండదని చెప్పారు. ఈ విధంగా బాబు మీద మంచి ప్రశంసలే కురిపించారు. అయితే బాబు సైతం తనకు ఇపుడు పక్కనే పెట్టారు అని ఆవేదన వ్యక్తం చేశారు.
లోకేష్ డైనమిక్ లీడర్ :
ఇక టీడీపీలో భావి నాయకుడిగా ఉన్న నారా లోకేష్ డైనమిక్ లీడర్ అని పీవీ సునీల్ కుమార్ పొగడడం మరో విశేషం. ఆయన మంగళగిరిలో ఓడిన చోటనే తిరిగి గెలిచి చూపించడం నాయకత్వ ప్రతిభకు నిదర్శననం అన్నారు. లోకేష్ భవిష్యత్తులో ఏపీ సీఎం అయ్యే అవకాశాలు ఉన్నాయని కూడా జోస్యం చెప్పారు. ఇక ఉప సభాపతి రఘురామ క్రిష్ణం రాజు కస్టోడియల్ టార్చర్ కేసు ఆరోపణలను పీవీ సునీల్ కుమార్ పూర్తిగా ఖండించారు. చీకటి గదిలో తనను కొడుతూంటే జగన్ వీడియో లింక్ చూశారని చెప్పారని చీకటి గదిలో వీడియో ఎలా తీస్తారని ఈ లాజిక్ ఆయన ఎలా మిస్ అయ్యారని ప్రశ్నించారు తాను రానున్న కాలంలో దళితుల అభ్యున్నతి కోసం వారి జీవితాల్లో వెలుగు కోసం పనిచేస్తాను అని పీవీ సునీల్ కుమార్ చెప్పుకొచ్చారు.