స్టేట్ మారాక వాహన రీరిజిస్ట్రేషన్ చేయకుంటే అంత డేంజర్
చిన్న విషయాలుగా అనుకుంటారు. పట్టించుకోరు. కానీ.. సమస్య దగ్గరకు వచ్చిన తర్వాత నోట మాట రాదు. ఇంత పెద్ద సమస్యా? అనుకుంటారు.;
చిన్న విషయాలుగా అనుకుంటారు. పట్టించుకోరు. కానీ.. సమస్య దగ్గరకు వచ్చిన తర్వాత నోట మాట రాదు. ఇంత పెద్ద సమస్యా? అనుకుంటారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏరోజు ఎక్కడ జాబ్ ఉంటుందో? ఎక్కడ ఉంటామో స్థిరంగా చెప్పే పరిస్థితి లేదు. ఇలాంటి వేళలో అన్ని విషయాల్లో కాకున్నా.. కొన్ని విషయాల్లో మాత్రం కాస్తంత అప్రమత్తంగా ఉండాలి. లేదంటే.. అడ్డంగా బుక్ కావటమే కాదు.. భారీగా డబ్బులు వదిలించుకోవాల్సి ఉంటుంది.
ఇంతకూ విషయం ఏమంటే.. మీ కారును జాబ్ లో భాగంగా కానీ.. లేదైనా ఇతర వ్యక్తిగత కారణాలతో వేరే రాష్ట్రానికి తీసుకెళితే ఏం చేయాలో మీకు తెలుసా? దీనికి సంబంధించిన నిబంధనలు ఎంత కఠినంగా ఉంటాయో అవగాహన ఉందా? పొరపాటున అధికారుల తనిఖీలో దొరికితే ఎంత భారీగా ఫైన్ వేస్తారో ఐడియా ఉందా? అంటే.. చాలామంది నో అనే చెప్పేస్తారు. అదే సమయంలో సరైన అవగాహన లేక.. ఉన్న అవకాశాల్ని చెడగొట్టుకుంటారు.
రెండు.. మూడు ఉదాహరణలో విషయం ఇట్టే అర్థమయ్యేలా చెప్పటమే కాదు.. ఈ అంశంపై పూర్తి అవగాహన కలిగేలా చేస్తాం. ఏపీకి చెందిన వర్మ కొత్త కారు కొన్నాడు. నిబంధనల ప్రకారం సదరు కారుకు రూ.1.50లక్షలు లైఫ్ ట్యాక్స్ కింద కట్టాడు. ఆర్నెల్లు కాలేదు.. విశాఖ నుంచి హైదరాబాద్ కు బదిలీ అయ్యింది. కారునుఅక్కడకు తీసుకెళ్లాడు. మొన్నటి వరకు ఒకటే రాష్ట్రం కదా? అని లైట్ తీసుకోలేదు. రూల్ గురించి తెలుసుకొని.. తన కారును తెలంగాణ నిబంధనలకు అనుగుణంగా రీరిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు.
ఈ సందర్భంగా అతనికి కొన్ని కొత్త విషయాలు తెలిశాయి. కొత్త రాష్ట్రంలో రీరిజిస్ట్రేషన్ చేయించుకున్న తర్వాత.. అంతకు ముందు ఏపీలోరిజిస్ట్రేషన్ చేయించుకున్న మొత్తాన్ని తిరిగి పొందొచ్చన్న విషయాన్ని తెలుసుకొని.. అందుకు తగ్గట్లు వెహికిల్ అసెస్ మెంట్ చేయించుకొని రీఫండ్ పొందాడు. ఒకవేళ అతను ఆ పని చేయకపోతే.. తనిఖీల్లో భాగంగా పట్టుబడితే.. కారును స్వాధీనం చేసుకోవటంతో పాటు.. భారీ ఫైన్ విధించే ప్రమాదాన్ని తప్పించుకున్నాడు.
చాలామంది వ్యక్తిగత కారణాల కోసం కారును వేరే రాష్ట్రానికి తీసుకెళతారు. తామేమీ పర్మినెంట్ గా ఆ రాష్ట్రంలో ఉండన్నప్పుడు వాహనాన్ని రీరిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సిన అవసరం లేదని భావిస్తారు.కానీ.. వాహన చట్టం ప్రకారం ఒక రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ అయిన వాహనాన్ని.. నెల రోజులకు మించి వేరే రాష్ట్రంలో ఉంచకూడదు. అలా చేస్తే.. భారీగా ఫైన్ వేసే ప్రమాదం పొంచి ఉంటుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో కుటుంబ సభ్యులు.. దగ్గర బంధువులు.. ఆసుపత్రిలో చికిత్స కోసం వేరే రాష్ట్రాల్లో వాహనాల్ని ఉంచాల్సిన పరిస్థితి. ఇలాంటి వేళలో.. వాహనాన్ని నిబంధనలకు తగ్గట్లు చేయాల్సిన పనులు ఉంటాయి.వీటి మీద అవగాహన లేకుంటే.. భారీగా నష్టపోతారు జరిమానాల రూపంలో.
ఒకవేళ వేరే రాష్ట్రంలో మూడు నెలలు ఉండాల్సిన పరిస్థితే వచ్చి..ఆ మాత్రం దానికి మళ్లీ రీరిజిస్ట్రేషన్ అంటే కష్టం కదా? అని అనుకోవచ్చు. అలాంటప్పుడు కనీసం నెలలో ఒకసారైనా సొంత రాష్ట్రానికి వెళ్లి వచ్చి.. దానికి సంబంధించిన రశీదులు చూపిస్తే..భారీ జరిమానా నుంచి తప్పించుకునే వీలు ఉంటుంది. నిబంధనలకు విరుద్ధంగా ఒక రాష్ట్రం కారును మరో రాష్ట్రంలో తిప్పితే.. తక్కువలో తక్కువ రూ.లక్షకు పైనే జరిమానా విధించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఉండదు. ఇలా వాహనాన్ని వేరే రాష్ట్రానికి తీసుకెళ్లినప్పుడు..అక్కడే నెలకు మించి ఉంచాల్సినప్పుడు మాత్రం నిబంధనల్ని తూచా తప్పకుండా పాటించాలి. ఈ విషయంలో జరిగే పొరపాటుతో భారీగా మూల్యాన్నిచెల్లించాల్సి ఉంటుందన్న విషయాన్ని మర్చిపోకూడదు.