ఇన్స్టాలో కొత్త రూల్.. అలా చేస్తే జైలుకే!

మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో ఎవరికైనా మెసేజ్ చేస్తున్నారా? అయితే కాస్త జాగ్రత్త! ఇప్పటివరకు మీ మెసేజ్‌లు ప్రైవేట్‌గా ఉండేవని అనుకున్నారేమో, కానీ ఇకపై సీన్ మారుతోంది.;

Update: 2026-05-08 16:30 GMT

మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో ఎవరికైనా మెసేజ్ చేస్తున్నారా? అయితే కాస్త జాగ్రత్త! ఇప్పటివరకు మీ మెసేజ్‌లు ప్రైవేట్‌గా ఉండేవని అనుకున్నారేమో, కానీ ఇకపై సీన్ మారుతోంది. మెటా సంస్థ తన ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ విధానానికి స్వస్తి పలుకుతూ సంచలన నిర్ణయం తీసుకుంది. మీరు పంపే ప్రతి మెసేజ్‌పై ఇప్పుడు నిఘా ఉంటుంది. పొరపాటున కూడా చట్టవిరుద్ధమైన పనులు చేస్తే ఆ మెసేజ్‌లే మిమ్మల్ని జైలు ఊచలు లెక్కపెట్టేలా చేస్తాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం..

ఏమిటీ ఎన్‌క్రిప్షన్ కథ?:

నిన్నటి వరకు ఇన్‌స్టాలో మనం పంపే మెసేజ్‌లు కేవలం పంపిన వారికి, అందుకున్న వారికి మాత్రమే కనిపించేవి. దీనినే 'ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్' అంటారు. అంటే మధ్యలో కంపెనీ కూడా మీ చాటింగ్‌ను చూడలేదు. కానీ, ఈ ఫీచర్‌ను అడ్డం పెట్టుకుని కొందరు అరాచకాలు సృష్టిస్తున్నారు. ఇక వేధింపులు, అసభ్యకర సందేశాలు పెరిగిపోవడంతో మెటా ఈ రక్షణ కవచాన్ని తొలగించాలని నిర్ణయించుకుంది.

నిఘా ఎందుకు పెంచారు?:

చాలామంది ఫేక్ అకౌంట్లతో ఇతరులను వేధించడం, అసభ్యకర ఫోటోలు పంపడం వంటివి చేస్తున్నారు. ముఖ్యంగా పిల్లలపై లైంగిక వేధింపులు, ఉగ్రవాద కార్యకలాపాలు, డ్రగ్స్ వంటి చట్టవిరుద్ధమైన పనులకు ఇన్స్టా వేదికగా మారుతోంది అనే వాదన వుంది. ఇక వీటిని అరికట్టాలంటే మెసేజ్‌లను మానిటర్ చేయడం తప్పనిసరని కంపెనీ భావించింది. అందుకే ఇకపై సెక్యూరిటీ పేరుతో మీ ప్రైవేట్ చాట్‌లను కంపెనీ స్కాన్ చేస్తుంది.

పోలీసులకు సమాచారం :

ఇక మీరు చేసే మెసేజ్‌లలో ఏదైనా అనుమానాస్పదంగా ఉన్నా లేదా హానికరం అని అనిపించినా, వెంటనే కంపెనీ ఆ సమాచారాన్ని దర్యాప్తు సంస్థలకు అందజేస్తుంది. ఉదాహరణకు, ఎవరైనా అమ్మాయిని వేధించినా లేదా సంఘవిద్రోహ చర్యలకు పాల్పడినా.. ఆ చాట్ హిస్టరీ మొత్తం పోలీసుల చేతికి వెళ్తుంది. అంటే ఒక్క తప్పుడు మెసేజ్ మీ కెరీర్‌ను నాశనం చేసి జైలుకు పంపగలదన్నమాట.

నెటిజన్ల రియాక్షన్ ఏంటి?:

మెటా తీసుకున్న ఈ నిర్ణయంపై నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. కొంతమంది 'ప్రైవసీ' పోతుందని బాధపడుతున్నా, మెజారిటీ ప్రజలు మాత్రం దీన్ని స్వాగతిస్తున్నారు. సోషల్ మీడియాలో వేధింపులకు గురవుతున్న వారికి ఇది ఒక పెద్ద ఊరట అని, దీనివల్ల ఆకతాయిలకు భయం పుడుతుందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. అడ్డూఅదుపు లేని మెసేజ్‌లకు ఇక చెక్ పడినట్టే అని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.

సాంకేతికత ఎంత పెరిగినా దాన్ని వాడే విధానంపైనే మన భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ఇన్‌స్టాగ్రామ్ తీసుకొచ్చిన ఈ కొత్త నిబంధన కేవలం నేరాలను అరికట్టడానికే. ఎవరైనా నిజాయితీగా, పద్ధతిగా చాట్ చేస్తే భయపడాల్సిన పనిలేదు. కానీ, సరదాకో లేక కక్షతోనో పరిధి దాటి ప్రవర్తిస్తే మాత్రం చట్టం తన పని తాను చేసుకుపోతుంది.

Tags:    

Similar News