ఆరోగ్యమే మహాభాగ్యం: చైర్మన్ మూర్తి 70 గంటల పనికి ఇన్ఫోసిస్‌ వ్యతిరేకం

భారత ఐటీ రంగంలో అగ్రగామి సంస్థల్లో ఒకటైన ఇన్ఫోసిస్, ఉద్యోగుల పనితీరు, ఆరోగ్యం పట్ల తన విధానాన్ని మార్చుకుంటోంది.;

Update: 2025-07-02 04:49 GMT

భారత ఐటీ రంగంలో అగ్రగామి సంస్థల్లో ఒకటైన ఇన్ఫోసిస్, ఉద్యోగుల పనితీరు, ఆరోగ్యం పట్ల తన విధానాన్ని మార్చుకుంటోంది. సంస్థ సహ-వ్యవస్థాపకుడు ఎన్.ఆర్. నారాయణ మూర్తి గతంలో వారానికి 70 గంటలు పనిచేయాలనే సూచనకు భిన్నంగా ఇన్ఫోసిస్ ఇప్పుడు ఉద్యోగుల ఆరోగ్యం, వ్యక్తిగత సమతుల్యతకు ప్రాధాన్యత ఇస్తోంది. ఇది కంపెనీ అభివృద్ధి కంటే ముందు వ్యక్తిగత సంక్షేమానికే ప్రథమ స్థానం అనే సందేశాన్ని స్పష్టం చేస్తోంది.

- మూర్తి సూచన వివాదం

గతంలో నారాయణ మూర్తి మాట్లాడుతూ దేశంలో 800 మిలియన్ల మంది పేదరిక రేఖకు దిగువన ఉన్నారని, భారతదేశం అభివృద్ధి చెందాలంటే ప్రతి భారతీయుడు వారానికి 70 గంటలు కష్టపడాలని సూచించారు. "మనమే కష్టపడకపోతే మరెవరు కష్టపడతారు?" అని ఆయన ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలు అప్పట్లో దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. అధిక పని గంటలు మానవ సంబంధాలు, కుటుంబ జీవితం, వ్యక్తిగత ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతాయని పలువురు ఈ సూచనను వ్యతిరేకించారు.

-ఇన్ఫోసిస్ కొత్త దిశ

అయితే ప్రస్తుతం ఇన్ఫోసిస్ తన ఉద్యోగులకు కొత్త మార్గదర్శకాలను జారీ చేస్తోంది. ఓవర్ టైమ్ చేయవద్దని, సాధారణ పని గంటలకే పరిమితం కావాలని స్పష్టంగా సూచిస్తోంది. ముఖ్యంగా వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న ఉద్యోగుల పని గంటలపై హెచ్‌ఆర్ విభాగం నిఘా పెట్టింది. రోజుకు 9.15 గంటలకు పైగా పనిచేస్తున్న ఉద్యోగులకు సంస్థ వ్యక్తిగతంగా ఈమెయిళ్ళు పంపి, వారి ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలని సూచిస్తోంది.

ఒక ఆంగ్ల దినపత్రిక నివేదిక ప్రకారం.. సంస్థ తన 3.23 లక్షల మంది ఉద్యోగులకు పని గంటల గణాంకాలను పంపిస్తోంది. ఈ ఈమెయిల్స్‌లో వారు నెలలో ఎన్ని రోజులు రిమోట్‌గా పనిచేశారు, మొత్తం పనిచేసిన గంటలు, రోజువారీ సగటు గంటలు వంటి వివరాలు పొందుపరుస్తుంది. అంతేకాకుండా తగినంత విశ్రాంతి తీసుకోవాలని, పని ఒత్తిడి అధికమైతే మేనేజర్‌కు తెలియజేయాలని, పని గంటల అనంతరం పూర్తిగా డిస్‌కనెక్ట్ కావాలని సూచనలు అందిస్తున్నాయి.

-ఆరోగ్య సమస్యలు - ప్రధాన కారణం

ఈ చర్యలకు ప్రధాన కారణం ఉద్యోగుల్లో ఇటీవలి కాలంలో పెరుగుతున్న ఆరోగ్య సమస్యలు. హృదయ సంబంధిత సమస్యలు, నిద్రలేమి, భోజనాలలో అసమతుల్యత వంటివి ఉద్యోగుల్లో ఎక్కువగా గుర్తించినట్లు సంస్థ పేర్కొంది. 2023 నవంబర్ 20 నుంచి హైబ్రిడ్ మోడల్‌కు మారినప్పటి నుంచి ఇన్ఫోసిస్ ఈ చర్యలను మరింత పకడ్బందీగా అమలు చేస్తోంది.

- విభిన్న దృక్పథం

గమనించదగ్గ విషయం ఏమిటంటే.. చైర్మన్ నారాయణ మూర్తి గారు 1986లోనే భారతదేశంలో ఐదు రోజుల పని వారం ప్రవేశపెట్టడాన్ని వ్యతిరేకించారు. కానీ ఇప్పుడు ఇన్ఫోసిస్ సంస్థ ఆయన గత అభిప్రాయాలకు భిన్నంగా ఉద్యోగుల ఆరోగ్యాన్ని, శ్రేయస్సును ప్రధానంగా పరిగణనలోకి తీసుకుంటోంది.

ఈ పరిణామాలు, ఉద్యోగులు బలవంతంగా కాకుండా, సంతోషంగా పనిచేస్తేనే సుస్థిరమైన ప్రగతి సాధ్యమవుతుందని ఇన్ఫోసిస్ బలంగా విశ్వసిస్తోందని స్పష్టం చేస్తున్నాయి. కంపెనీ అభివృద్ధి కంటే ముందు వ్యక్తిగత ఆరోగ్యానికే ప్రాధాన్యం ఇవ్వడం, భవిష్యత్తులో ఇతర సంస్థలకు కూడా ఇది ఆదర్శంగా నిలుస్తుందని ఆశిద్దాం.

Tags:    

Similar News