శత్రు డ్రోన్ దుర్భేద్యం.. మన ‘ఇందజ్రాల్ రేంజర్’.. ప్రత్యేకతలివీ

మొన్నటి పాకిస్తాన్ తో ఆపరేషన్ సింధూర్ యుద్ధంలో మనం అన్ని రంగాల్లో మెరుగైనా పాకిస్తాన్ దాడి చేసిన డ్రోన్ల దాడి తర్వాత భారత ఆర్మీ ఈ రంగంలో స్వయం శక్తి సాధించాలని ప్రయత్నాలు ప్రారంభించింది.;

Update: 2025-11-28 07:03 GMT

మొన్నటి పాకిస్తాన్ తో ఆపరేషన్ సింధూర్ యుద్ధంలో మనం అన్ని రంగాల్లో మెరుగైనా పాకిస్తాన్ దాడి చేసిన డ్రోన్ల దాడి తర్వాత భారత ఆర్మీ ఈ రంగంలో స్వయం శక్తి సాధించాలని ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ క్రమంలోనే దేశ రక్షణ రంగంలో హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఇంద్రజాల్‌ డ్రోన్‌ డిఫెన్స్‌ కంపెనీ ఓ కీలక మైలురాయిని అధిగమించింది. దేశంలోనే మొట్టమొదటి యాంటీ డ్రోన్‌ నిఘా వాహనం 'ఇంద్రజాల్‌ రేంజర్‌'ను ఈ సంస్థ ఆవిష్కరించింది. ఈ అత్యాధునిక వాహనం ఏఐ ఆధారంగా పనిచేస్తూ దేశ భద్రతకు అపూర్వమైన రక్షణ కవచాన్ని అందిస్తోంది.

కదులుతూనే డ్రోన్లను కూల్చే సామర్థ్యం

ఇప్పటివరకు అందుబాటులో ఉన్న యాంటీ డ్రోన్‌ వ్యవస్థలు ఒక చోట స్థిరంగా ఉన్నప్పుడే పనిచేయగలవు. కానీ ఇంద్రజాల్‌ రేంజర్‌ వాటికి భిన్నంగా రూపొందించబడింది. ఇది కదులుతూనే ఆకాశంలో ఎగురుతున్న శత్రు డ్రోన్లను పసిగట్టగలదు. వాటి గమనాన్ని పరిశీలించి మట్టుపెట్టగలదు. ఈ వాహనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో ప్రమాదాన్ని అంచనా వేస్తుంది. అవసరమైన సందర్భాల్లో డ్రోన్లను అడ్డుకుని, కూల్చేయగల స్వతంత్రంగా పనిచేయగల వ్యవస్థ దీని సొంతం. దశాబ్దకాలం పరిశోధనల ఫలితంగా ఏఐ, రోబోటిక్స్, అటానమస్‌ వ్యవస్థల కలయికతో రూపొందించిన ప్రత్యేకమైన అటానమీ ఇంజిన్‌ 'స్కైఓఎస్‌'ను ఇందులో అభివృద్ధి చేశారు.

*సరిహద్దు భద్రత, మాదకద్రవ్యాల అక్రమ రవాణా అరికట్టడంలో కీలకం

ఇంద్రజాల్‌ రేంజర్‌ వాహనాలు దేశ సరిహద్దుల రక్షణలో అత్యంత కీలక పాత్ర పోషించనున్నాయి. ముఖ్యంగా పాకిస్తాన్‌ నిఘా సంస్థ ఐఎస్‌ఐ వంటి అంతర్జాతీయ నేర నెట్‌వర్క్‌లు డ్రోన్ల సాయంతో ఆయుధాలు, మాదకద్రవ్యాల అక్రమ రవాణాను భారత్‌లోకి సరఫరా చేస్తున్న నేపథ్యంలో ఈ వాహనాలకు ప్రాధాన్యం పెరిగింది. సరిహద్దు భద్రతా దళాలు ఇప్పటికే వీటి సాయంతో 255 పాకిస్తానీ డ్రోన్లను కూల్చివేయడం విశేషం. ఇంద్రజాల్‌ రేంజర్‌ స్వతంత్రంగా పనిచేయగలగడం వలన భద్రతా దళాలపై పనిభారం తగ్గుతుందని సంస్థ సీఈఓ కిరణ్‌ రాజు తెలిపారు.

భవిష్యత్తుకు రక్షణ కవచం

ఇంద్రజాల్‌ రేంజర్‌ ఆవిష్కరణ సందర్భంగా ఆర్మీ వార్‌ కాలేజీ మాజీ కమాండెంట్‌, రిటైర్డ్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ దేవేంద్ర ప్రతాప్‌ పాండే మాట్లాడుతూ.. ఈ వాహనాలు కేవలం టెక్నాలజీ యంత్రాలు మాత్రమే కాదని, యువతకు సురక్షితమైన దేశం అందించడానికి, మన పిల్లలు, రైతులు, భవిష్యత్తుకు రక్షణ కవచాలుగా నిలుస్తాయని పేర్కొన్నారు. శత్రు డ్రోన్‌లను కూల్చే ప్రతి చర్య దేశ అంతర్గత భద్రతను బలపరుస్తుందని, ప్రజల ప్రాణాలను కాపాడుతుందని ఇంద్రజాల్‌ డ్రోన్‌ డిఫెన్స్‌ కంపెనీ ఆశాభావం వ్యక్తం చేసింది.

దేశ రక్షణ రంగంలో స్వదేశీ టెక్నాలజీతో కూడిన ఇంద్రజాల్‌ రేంజర్‌ ప్రవేశం, భద్రతా సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కోవడంలో ఒక బలమైన ముందడుగుగా నిలుస్తోంది.

Tags:    

Similar News