డల్లాస్ కు వెళ్లాల్సినోళ్లను వదిలేసి వెళ్లిపోయిన ఇండిగో?

ఇటీవల కాలంలో విమానయాన సంస్థల తీరుతో విమాన ప్రయాణికులకు చుక్కలు కనిపిస్తున్నాయి.;

Update: 2025-08-25 04:59 GMT

ఇటీవల కాలంలో విమానయాన సంస్థల తీరుతో విమాన ప్రయాణికులకు చుక్కలు కనిపిస్తున్నాయి. అయితే.. సాంకేతిక అంశాలు.. లేదంటే నిర్వహణ లోపాలతో తరచూ ఏదో ఒక సమస్యను ఎదుర్కొంటున్నారు విమాన ప్రయాణికులు. తాజాగా అలాంటి ఉదంతమే హైదరాబాద్ నుంచి డల్లాస్ కు వెళ్లాల్సిన ప్రయాణికులకు ఎదురైంది. దీనికి సంబంధించి అధికారికంగా ఇండిగో స్పందించింది లేదు. అంతేకాదు.. పద్నాలుగు మంది ప్రయాణికులకు చుక్కలు చూపించిన ఇండిగో వ్యవహారంపై తమకు ఎలాంటి సమాచారం లేదని శంషాబాద్ ఎయిర్ పోర్టు నిర్వాహకులు చెప్పటం గమనార్హం. పలు మీడియా సంస్థల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. అసలేమైందంటే..

హైదరాబాద్ నుంచి డల్లాస్ కు వెళ్లాల్సిన 38 మంది మంది టర్కిష్ ఎయిర్ లైన్స్ ప్రయాణికుల్ని ముంబయి వరకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ఇండిగో మీద ఉంది. టర్కిస్ ఎయిర్ లైన్స్ - ఇండిగో టైఅప్ టికెట్లను ఆన్ లైన్ లో రూ.2 లక్షల చొప్పున కొనుగోలు చేసినట్లు చెబుతున్నారు. షెడ్యూల్ లో భాగంగా వీరు శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి శనివారం రాత్రి 11.40 గంటలకు ముంబయి వరకు వెళ్లి.. అక్కడి నుంచి డల్లాస్ కు వేరే విమానంలో వెళ్లాల్సి ఉంది.

శనివారం రాత్రి 38 మంది ప్రయాణికులు సకాలంలో శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకొని.. ఎయిర్ లైన్స్ సిబ్బందిని సంప్రదించారు. ఓవర్ బుకింగ్ కారణంగా ఇండిగో ఎయిర్ లైన్స్ సిబ్బంది కొందరు ప్రయాణికులకు వేరే సర్వీసు నెంబరును కేటాయిస్తూ వివరాలు అందించారు. సదరు విమానంలో 38 మందిలో 24 మందిని మాత్రమే ఎక్కించుకొని.. మిగిలిన ప్రయాణికుల్ని విమానంలోకి అనుమతించలేదని బాధితులు ఆరోపిస్తున్నారు.

దీంతో ఇండిగో ప్రతినిధుల్ని ప్రశ్నిస్తే.. పొంతన లేని సమాధానాలు ఇచ్చినట్లుచెబుతున్నారు. దాదాపు ఏడు గంటల పాటు ఎయిర్ పోర్టులో ఉన్న వారు చివరకు తిరిగి వెళ్లినట్లుగా చెబుతున్నారు. వీరికి సంబంధించిన వ్యవహారం తమ వరకు రాలేదని శంషాబాద్ జీఎంఆర్ ఎయిర్ పోర్టు ప్రతినిధులు చెబుతున్నారు. ఇలా ఎందుకు జరిగిందన్న అంశంపై వివరణ ఇవ్వాల్సిన బాధ్యత ఇండిగో మీద ఉందన్న డిమాండ్ వ్యక్తమవుతోంది.

Tags:    

Similar News