ఇండిగో ఫ్లైట్స్ రద్దు.. ఆకాశాన్ని తాకుతున్న టికెట్ ధరలు.. అసలు కారణం ఏంటంటే?
సరిగ్గా ఇప్పుడు ఇండిగో విమానయాన సంస్థ చేస్తున్న పనికి ప్రయాణికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.;
మనం ఏదైనా గమ్యానికి త్వరగా చేరుకోవాలి అంటే ఎక్కువగా ఫ్లైట్స్ పైన ఆధారపడుతున్న విషయం తెలిసిందే. సకాలంలో అత్యంత జాగ్రత్తగా ప్రయాణికులను చేరవేయడంలో ఈ విమాన సర్వీసులు చాలా సమర్థవంతంగా పనిచేస్తున్నాయి. అయితే ఈ మధ్య సాంకేతిక లోపాలు, పైలెట్లకు సరైన విశ్రాంతి లేకపోవడం లాంటి కారణాలవల్ల విమాన ప్రమాదాలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి అని పలువురు నిపుణులు కూడా తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.. ఇదిలా ఉండగా మరొకవైపు ఒక ప్రాంతానికి వెళ్లాలనుకున్నప్పుడు ముందుగానే టికెట్టు కూడా బుక్ చేసుకుంటాం. తీరా బయల్దేరాల్సిన సమయంలో అనుకోకుండా ఫ్లైట్ రద్దు అని తెలిస్తే ఆ ప్రయాణికుడి బాధ ఏ రేంజ్ లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.
సరిగ్గా ఇప్పుడు ఇండిగో విమానయాన సంస్థ చేస్తున్న పనికి ప్రయాణికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు కేంద్ర మంత్రులను, ప్రధానమంత్రిని ట్యాగ్ చేస్తూ సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్నారు. ముఖ్యంగా ఒక్క రోజులోనే ఇండిగో 550 ఫ్లైట్లను రద్దు చేసింది. అనుకోకుండా టికెట్ ధరలను కూడా భారీగా పెంచేసి అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. అయితే ఇండిగో ఇలా ఉన్నట్టుండి ఫ్లైట్లను రద్దు చేయడం ఏంటి? ధరలు పెంచడం ఏంటి? అనే విషయాలు వైరల్ గా మారుతున్నాయి.
దేశంలో అతిపెద్ద ఎయిర్లైన్స్ ఇండిగో పరిస్థితి ప్రస్తుతం అత్యంత దారుణంగా మారిపోయింది. ఒక్కరోజులోనే దాదాపు 550కి పైగా విమానాలు రద్దవడంతో లక్షలాది ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. హైదరాబాదులో 79.. ముంబైలో 118.. ఢిల్లీలో 172.. బెంగళూరులో 100.. కోల్కతాలో 35.. చెన్నైలో 26.. గోవాలో 11.. విమాన సర్వీసులు రద్దయ్యాయి.సరైన సమయానికి ఎయిర్ పోర్ట్ కి వచ్చి తీరా చెకింగ్ పూర్తయ్యి.. లోపలికి వెళ్ళాక ఫ్లైట్ రద్దని తెలియడంతో చాలామంది ప్రయాణికులు నిరాశ వ్యక్తం చేశారు. కొంతమంది అయితే ఉదయం 10:00 నుండి సాయంత్రం 4గంటల వరకు విమానాశ్రయంలోనే వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఇక మరికొన్ని విమానాలు 10 గంటల వరకు ఆలస్యమయ్యాయి. దీంతో ఇండిగో స్పందిస్తూ ముందు కూడా విమానాలు ఆలస్యం కావచ్చు. 2026 ఫిబ్రవరి 10 వరకు ఈ పరిస్థితి కొనసాగుతుంది. అప్పటికి చక్కబడుతుంది అంటూ ప్రకటించింది. ఇకపోతే విమానాల రద్దుతో టికెట్ ధరలు కూడా ఆకాశాన్ని తాకుతున్నాయి. ఢిల్లీ - బెంగళూరు వన్వే ఎకనామి క్లాస్ టికెట్ రూ.11 వేల నుంచి రూ.43 వేలకు పెరిగింది. ఢిల్లీ - లండన్ టికెట్ ధర రూ.25 వేలు ఉంటే ఢిల్లీ - కొచ్చి టికెట్ ధర ఫెయిర్ ఏకంగా 40 వేలకు పెంచేశారు. సాధారణంగా ఇది 5 వేల నుంచి 10వేల మధ్య ఉంటుంది. అలాంటిది ఇప్పుడు ఏకంగా 40 వేలు అంటే ఏ రేంజ్ లో ధరలు పెంచారో అర్థం చేసుకోవచ్చు. ఢిల్లీ - ముంబై టికెట్ ధర రూ.40,452 కు ఎగబాకింది. అత్యవసరంగా గమ్యాలకు చేరుకోవాల్సిన ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అటు రేట్లు పెంచవద్దని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినా.. ఇండిగో మాత్రం ఈ స్థాయిలో ధరలు పెంచడంపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇకపోతే ఫ్లైట్స్ ఉన్నట్టుండి ఇలా రద్దు కావడానికి గల కారణం ఏమిటంటే.. ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్ నిబంధనలు నవంబర్ నుంచి అమలులోకి రావడంతో పైలట్లకు ఎక్కువ విశ్రాంతి ఇవ్వాల్సి వస్తోంది. ఒక పైలట్ రోజులో రాత్రి 12 నుంచి ఉదయం 6 మధ్య రెండు ల్యాండింగ్స్ మాత్రమే చేయాలి. అలాగే వారంలో కనీసం 36 గంటలు రెస్ట్ ఇవ్వాలి. నైట్ డ్యూటీ తర్వాత 12 గంటల విరామం తప్పనిసరి. అలాగే పైలెట్ లతో పాటు ఇతర సిబ్బంది సంఖ్య సైతం పూర్తిగా తగ్గింది. చిన్నపాటి సాంకేతిక సమస్యలు, సాఫ్ట్వేర్ లోపం లో కూడా అంతరాయాలు ఏర్పడినట్లు ఇండిగో తెలిపింది. దీనికి తోడు శీతాకాలం, ప్రతికూల వాతావరణ పరిస్థితులు, ప్రయాణికుల రద్దీ ఎక్కువ కావడం వల్లే ఫ్లైట్లను నిలిపివేసినట్లు ఇండిగో స్పష్టం చేసింది. ఇక వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు కూడా ఇండిగో ఎయిర్ లైన్స్ లో ఇదే పరిస్థితి కొనసాగవచ్చు అని స్పష్టం చేసింది.