ఆపరేషన్ సింధూర్ దెబ్బకు అమెరికా కాళ్లు పట్టుకొని పాకిస్తాన్ ఆపించిందా? సంచలన లీక్
పాక్ భూభాగంలోని ఉగ్రవాద శిబిరాలే లక్ష్యంగా భారత సైన్యం ఈ ఆపరేషన్‌ను చేపట్టింది. ఈ ఆపరేషన్ యొక్క ప్రత్యేకత ఏంటంటే.. ఒక్క పౌర ప్రాణం కూడా పోకుండా కేవలం ఉగ్రవాదుల స్థావరాలను మాత్రమే తుత్తునియలు చేసింది.;
సరిహద్దుల్లో కవ్వింపు చర్యలకు పాల్పడే పాకిస్థాన్‌కు భారత్ తనదైన శైలిలో బుద్ధి చెప్పింది. భారత సైన్యం అత్యంత రహస్యంగా వ్యూహాత్మకంగా చేపట్టిన 'ఆపరేషన్ సిందూర్' దెబ్బకు పాక్ విలవిలలాడిపోయింది. భారత్ దాడులను తట్టుకోలేక, అవి మరింత పెరగకుండా అడ్డుకోవాలని కోరుతూ పాకిస్థాన్ చివరకు అమెరికా కాళ్లు పట్టుకున్న ఉదంతం ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో సంచలనంగా మారింది.
పహల్గాం ఉదంతం.. భారత్‌ను కదిలించిన నరమేధం
గతేడాది జమ్మూ-కాశ్మీర్‌లోని పర్యాటక స్వర్గం పహల్గాంలో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు సామాన్య పౌరులపై జరిపిన కాల్పులు దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలను నింపాయి. ఈ దాడి వల్ల ప్రాణనష్టమే కాకుండా కాశ్మీర్ పర్యాటక రంగం ఒక్కసారిగా కుప్పకూలింది. ఉపాధి కోల్పోయిన స్థానికుల ఆవేదనను చూసి కేంద్ర ప్రభుత్వం ఒక కఠిన నిర్ణయానికి వచ్చింది. అదే 'ఆపరేషన్ సిందూర్'.
ఆపరేషన్ సిందూర్.. గురి తప్పని భారత్ వ్యూహం
పాక్ భూభాగంలోని ఉగ్రవాద శిబిరాలే లక్ష్యంగా భారత సైన్యం ఈ ఆపరేషన్‌ను చేపట్టింది. ఈ ఆపరేషన్ యొక్క ప్రత్యేకత ఏంటంటే.. ఒక్క పౌర ప్రాణం కూడా పోకుండా కేవలం ఉగ్రవాదుల స్థావరాలను మాత్రమే తుత్తునియలు చేసింది. భారత సైన్యం యొక్క ఖచ్చితత్వం చూసి పాక్ ఆర్మీ హడలిపోయింది. తమ కోటలు బద్దలవుతుంటే ఏం చేయాలో తెలియని స్థితిలోకి పాక్ వెళ్లిపోయింది.
అమెరికా చుట్టూ పాక్ ప్రదక్షిణలు
భారత్ చేపట్టిన దాడులు తన ఉనికికే ప్రమాదమని గ్రహించిన పాకిస్థాన్ హుటాహుటిన దౌత్యపరమైన లాబీయింగ్‌ను మొదలుపెట్టింది. ఎన్డీటీవీ కథనం ప్రకారం పాక్ రాయబారులు, రక్షణ శాఖ అధికారులు అమెరికాలో తిష్టవేసి ఏకంగా 50కి పైగా సమావేశాలు నిర్వహించారు.అమెరికా ప్రభుత్వ అధికారులు, కీలక చట్టసభ్యులు.. అంతర్జాతీయ మీడియా సంస్థలతో పాక్ బృందం చర్చలు జరిపింది. ఈ లాబీయింగ్ ఫలితంగానే డొనాల్డ్ ట్రంప్, పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ మధ్య భేటీ జరిగినట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
పాక్ ద్వంద్వ నీతి బయటపడింది!
బయటకు గాంభీర్యం ప్రదర్శిస్తున్నప్పటికీ లోలోపల పాకిస్థాన్ తీవ్ర ఆర్థిక, భద్రతా సంక్షోభంలో ఉన్నట్లు స్పష్టమవుతోంది. దాడుల్లో ధ్వంసమైన ఉగ్ర శిబిరాలకు పాక్ ప్రభుత్వం సొంత నిధులతో మరమ్మతులు చేయిస్తోందన్న వార్తలు ఆ దేశ ద్వంద్వ నీతిని ప్రపంచానికి మరోసారి చాటిచెప్పాయి. యుద్ధం చేసే సత్తా మాట పక్కన పెడితే భారత్ ఇచ్చే దెబ్బను తట్టుకునే కనీస సామర్థ్యం కూడా పాకిస్థాన్‌కు లేదని ఈ పరిణామాలు నిరూపించాయి అన్నది జాతీయ భద్రతా విశ్లేషకుల అభిప్రాయం..
ఆపరేషన్ సిందూర్ ద్వారా భారత్ కేవలం ఉగ్రవాదాన్ని ఏరిపారేయడమే కాకుండా తన సార్వభౌమాధికారాన్ని కాపాడుకోవడానికి ఎంతటి కఠిన నిర్ణయాలైనా తీసుకోగలదని ప్రపంచానికి సంకేతం ఇచ్చింది. మరోవైపు అగ్రరాజ్యం అమెరికా సాయం కోసం పాక్ పాకులాడటం చూస్తుంటే ఆ దేశం ఎంతటి బలహీన స్థితిలో ఉందో అర్థమవుతోంది.