సముద్ర గర్భంలో కలిసిన కలలు: అమాయక భారతీయ నావికుల మృతి వెనుక అసలు నిజమెవరు చెప్తారు?

కుటుంబాల ఉజ్వల భవిష్యత్తు కోసం కనుపాపల్లాంటి పిల్లల చదువుల కోసం.. ముసలి తల్లిదండ్రుల వైద్యం కోసం... ఆ ముగ్గురు భారతీయ నావికులు అలల ఉధృతిని లెక్కచేయకుండా సముద్ర ప్రయాణం సాగించారు.

Update: 2026-06-14 16:43 GMT

కుటుంబాల ఉజ్వల భవిష్యత్తు కోసం కనుపాపల్లాంటి పిల్లల చదువుల కోసం.. ముసలి తల్లిదండ్రుల వైద్యం కోసం... ఆ ముగ్గురు భారతీయ నావికులు అలల ఉధృతిని లెక్కచేయకుండా సముద్ర ప్రయాణం సాగించారు. కానీ అంతర్జాతీయ రాజకీయాల చదరంగంలో వారు కేవలం పావులుగా మారి ప్రాణాలు కోల్పోతారని ఆ కుటుంబాలు ఊహించలేదు. ఒమన్ తీరంలో జరిగిన ఈ ఘోర విషాదం ఇప్పుడు యావత్ భారతదేశాన్ని కన్నీరు పెట్టిస్తోంది. కేవలం కన్నీళ్లే కాదు.. ప్రతి భారతీయుడి గుండెల్లో ఒకే ఒక ప్రశ్న రగులుతోంది... "అసలు మా అమాయక నావికులను చంపిందెవరు?"

ఆరోపణలు.. ప్రత్యారోపణల మధ్య నలిగిపోతున్న సత్యం

తొలుత వినవచ్చిన కథనాల ప్రకారం... ప్రపంచంలోనే అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధి సమీపంలో ప్రయాణిస్తున్న ఒక వాణిజ్య నౌకపై అమెరికా దళాలు దాడి చేశాయని, ఆ దాడిలోనే ముగ్గురు భారతీయులు మరణించారని వార్తలు వచ్చాయి. నిరపరాధులైన తమ పౌరుల మృతిపై భారతదేశం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.

అయితే అంతర్జాతీయ వేదికపై ఈ అంశం చర్చనీయాంశంగా మారిన తరుణంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఈ వ్యవహారాన్ని మరింత గందరగోళంలోకి నెట్టాయి. ఈ దాడి వెనుక అమెరికా లేదని ఇరాన్ దళాల చర్యల వల్లే ఈ విషాదం చోటుచేసుకుందని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రకటనతో సత్యం ఏంటో తెలియక ప్రపంచం తలపట్టుకుంది. కానీ కథ అక్కడితో ముగిసిపోలేదు. కొద్దిరోజులకే అమెరికా విదేశాంగ శాఖ చేసిన ఒక ప్రకటన ఈ అనుమానాలకు మరింత బలాన్ని చేకూర్చింది. "హార్ముజ్ జలసంధిలో అమెరికా భద్రతా ఆదేశాలను ఎవరైనా ఉల్లంఘిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయి" అంటూ వారు చేసిన హెచ్చరికలు... పరోక్షంగా ఆ దాడిలో అమెరికా పాత్ర ఉందనే అనుమానాలకు తావిచ్చాయి.

కన్నీటి సముద్రంలో బాధితుల కుటుంబాలు

పెద్ద పెద్ద దేశాలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ కాలం వెళ్లదీస్తుంటే... అక్కడ ఆ ముగ్గురు నావికుల ఇళ్లల్లో మాత్రం దీపాలు ఆరిపోయాయి. తమ ఇంటికి ఆధారమైన కొడుకు, భర్త, తండ్రి ఇక లేరనే నిజాన్ని ఆ కుటుంబాలు జీర్ణించుకోలేకపోతున్నాయి. వారి మరణవార్త విని రోజులు గడుస్తున్నా, కనీసం వారు ఎలా చనిపోయారో చెప్పే నాథుడే కరువయ్యాడు. అంతర్జాతీయ రాజకీయాల ముసుగులో నిజం సమాధి అయిపోతుందా అనే భయం వారిని వెంటాడుతోంది. ఇది కేవలం ముగ్గురు వ్యక్తుల ప్రాణాలకు సంబంధించిన విషయం కాదు. విదేశీ జలాల్లో ప్రాణాలకు తెగించి రాత్రింబగళ్లు పనిచేస్తున్న వేలాది మంది భారతీయ నావికుల భద్రతకు సంబంధించిన పెను సవాల్.

భారతదేశం డిమాండ్.. నిజాన్ని దాచలేరు

ప్రస్తుతం భారత్ ఈ ఘటనపై అంతర్జాతీయ స్థాయిలో పూర్తి స్థాయి, పారదర్శకమైన దర్యాప్తును కోరుతోంది. బాంబుల మోతలకు, భౌగోళిక రాజకీయాల ప్రతీకారాలకు అమాయక శ్రామికులు బలికావాల్సిందేనా? అని ప్రశ్నిస్తున్నారు.

రాజకీయ ప్రయోజనాల కోసం నిజాలను ఎంత కాలం దాచగలరు?

దేశాలు మారవచ్చు.. ఆరోపణలు మారవచ్చు.. కానీ ఆ ముగ్గురు నావికుల ఇళ్లల్లో వినిపిస్తున్న కన్నీటి ఆక్రందన మాత్రం ఒక్కటే... "మా వాళ్లను చంపిందెవరు?" ఈ ప్రశ్నకు సమాధానం దొరికే వరకు బాధ్యులకు శిక్ష పడే వరకు భారతదేశం విశ్రమించకూడదు. ఎందుకంటే ప్రతి భారతీయుడి ప్రాణం ఎంతో విలువైనది..

Tags:    

Similar News