భారతీయ సంతతికి చెందిన నవనీతం 'నవి' పిళ్లైకి 2026 నోబెల్ శాంతి బహుమతి

భారతీయ సంతతికి చెందిన ప్రముఖ దక్షిణాఫ్రికా న్యాయమూర్తి, అంతర్జాతీయ మానవ హక్కుల పరిరక్షకురాలు నవనీతం `నవి` పిళ్లై ప్రతిష్టాత్మకమైన 2026 నోబెల్ శాంతి బహుమతిని గెలుచుకున్నారు.

Update: 2026-10-09 11:03 GMT

భారతీయ సంతతికి చెందిన ప్రముఖ దక్షిణాఫ్రికా న్యాయమూర్తి, అంతర్జాతీయ మానవ హక్కుల పరిరక్షకురాలు నవనీతం `నవి` పిళ్లై ప్రతిష్టాత్మకమైన 2026 నోబెల్ శాంతి బహుమతిని గెలుచుకున్నారు. అంతర్జాతీయ చట్టాలను బలోపేతం చేయడంలో ప్రపంచవ్యాప్తంగా శాంతి స్థాపన కోసం ఈ అంత‌ర్జాతీయ ప్ర‌ముఖురాలు చేసిన విశేష కృషిని గుర్తిస్తూ నార్వేజియన్ నోబెల్ కమిటీ ఈ పురస్కారాన్ని ప్రకటించింది.

దక్షిణాఫ్రికాలో జన్మించిన నవి పిళ్లై వర్ణవివక్ష కాలంలో అణగారిన ప్రజల తరపున పోరాడి ప్రముఖ న్యాయవాదిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు (ఐసీసీ) న్యాయమూర్తిగా, యునైటెడ్ నేషన్స్ (యుఎన్‌) మానవ హక్కుల హై కమిషనర్‌గా అత్యంత బాధ్యతాయుతమైన పదవులను అధిష్టించారు. తన సుదీర్ఘ కెరీర్‌లో ఎన్నో క్లిష్టమైన కేసులను ధైర్యంగా విచారించి న్యాయ సూత్రాలకు పెద్దపీట వేశారు.

యుద్ధ సమయంలో మహిళలపై జరిగే అకృత్యాలు, ముఖ్యంగా సామూహిక అత్యాచారాలను కేవలం యుద్ధపు బహుమతులుగా కాకుండా `యుద్ధ నేరాలు`గా పరిగణించాలనే చారిత్రాత్మక తీర్పు వెనుక నవి పిళ్లై కృషి ఎంతో ఉంది. 1994 రువాండా మారణహోమం కేసుల్లో ఆమె ఇచ్చిన తీర్పులు అంతర్జాతీయ క్రిమినల్ న్యాయశాస్త్రంలో మైలురాళ్లుగా నిలిచాయి.

ప్రస్తుత ప్రపంచ పరిస్థితులలో అంతర్జాతీయ చట్టాలు బలహీనపడుతున్నాయని.. ప‌వ‌ర్ పాలిటిక్స్ చట్టబద్ధతను ప్రభావితం చేస్తున్నాయని నోబెల్ కమిటీ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ తరుణంలో నవి పిళ్లైకి నోబెల్ శాంతి బహుమతి లభించడం ద్వారా న్యాయం, మానవ హక్కుల పరిరక్షణ ప్రాముఖ్యత ప్రపంచానికి మరోసారి చాటి చెప్పింది.

భారతీయ మూలాలున్న ఓ మహిళ అంతర్జాతీయ స్థాయిలో న్యాయం కోసం పోరాడి ప్రపంచ అత్యున్నత శాంతి పురస్కారాన్ని అందుకోవడంపై ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు కురుస్తున్నాయి. ఈ గుర్తింపు భవిష్యత్తులో మరింత‌గా వాయిస్ వినిపించేందుకు.. మానవ హక్కుల కార్యకర్తలకు ఎంతో స్ఫూర్తినిస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Tags:    

Similar News