భారతీయ గృహిణులపై గోల్డ్ కౌన్సిల్ సీఈఓ ఆసక్తికర వ్యాఖ్యలు!
ఇదే సమయంలో... బంగారం అనేది ఒక శాశ్వత ఆర్థిక నిధి అని.. ప్రపంచంలో అనిశ్చితి నెలకొన్న అనేక సమయాల్లో ఇది అద్భుతమైన పని తీరు కనబరిచిందని ప్రశంసించిన సచిన్ జైన్.;
వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ సీఈఓ సచిన్ జైన్ భారతీయ గృహిణులను ప్రశంసించారు. వారిని ప్రపంచంలోని అత్యంత తెలివైన పెట్టుబడిదారులుగా అభివర్ణించారు. శతాబ్దాలుగా, భారతీయ మహిళలు వ్యక్తిగత అలంకరణ.. కుటుంబ సంపద కోసం చిన్న మొత్తంలో బంగారాన్ని సేకరించడమే కాకుండా, అలా చేయడం ద్వారా దేశ ఆర్థిక బలానికి కూడా దోహదపడ్డారని అన్నారు.
అవును... భారతీయ మహిళలకు, బంగారానికి ఉన ప్రత్యేక సంబంధం గురించి తెలిసిందే. వారికి బంగారంపై అమితమైన ఆసక్తి ఉంటుంది. ఇక అక్షయ తృతియ వచ్చిందంటే చెప్పే పనే లేదు.. భారతదేశంలోని బంగారం దుకాణాలన్నీ మహిళలతో నిండిపోతుంటాయి! అయితే వారి ఆసక్తి వారి కుటుంబానికే కాకుండా.. దేశ ఆర్థిక బలానికీ దోహదపడుతుందని సచిన్ జైన్ తెలిపారు.
'ది టైమ్ లెస్ హెడ్జ్: గోల్డ్ ఇన్ ది ఏజ్ ఆఫ్ ఫ్లక్స్' అనే అంశంపై ఎన్డీటీవీ వరల్డ్ సమ్మిట్ లో ప్రసంగిస్తూ సచిన్ జైన్ ఈ వ్యాఖ్యలు చేశారు. "ఒక గృహిణిని ప్రపంచంలోనే అత్యంత తెలివైన పెట్టుబడిదారురాలిగా సులభంగా గుర్తించవచ్చు.. ఎందుకంటే, ఒక భారతీయ గృహిణి తన జీవితకాలంలో చిన్న చిన్న పరిమాణాలలో బంగారాన్ని సేకరించి, ఆమె కుటుంబానికే కాకుండా మన దేశానికి సంపదను సృష్టించింది" అని అన్నారు.
ఇదే సమయంలో... బంగారం అనేది ఒక శాశ్వత ఆర్థిక నిధి అని.. ప్రపంచంలో అనిశ్చితి నెలకొన్న అనేక సమయాల్లో ఇది అద్భుతమైన పని తీరు కనబరిచిందని ప్రశంసించిన సచిన్ జైన్.. భారతదేశ చారిత్రక, సామాజిక నిర్మాణంలో బంగారం ఓ భాగంగా మారిపోయిందని అన్నారు. దేశ చరిత్రలో రాజ్యాలు, ఖజానాలు, దేవాలయాలలో బంగారు ఆభరణాలు రాసులుగా ఉండేవని విన్నామని తెలిపారు.
ప్రస్తుత కాలంలో బంగారు మార్కెట్లోని పరిణామాలపై స్పందించిన జైన్.. నేడు బంగారంలో జరుగుతున్నది అపూర్వమైనదని.. ఇది మనం ఇంతకు ముందు ఎన్నడూ చూడలేదని.. అది నిజంగా భౌగోళిక రాజకీయాల కొత్త మారిన ప్రపంచానికి సమాధానమని తెలిపారు. ఇది ఆర్థిక సంక్షోభం, డీ-డాలరైజేషన్ కొత్త మారిన ప్రపంచం అని చెబుతూ... గత ఒకటిన్నర సంవత్సరాలలో బంగారం ధరలో ఊహించని మార్పును చూశామని అన్నారు.