హెచ్-1బీ వీసా ప్రోగ్రామ్ లో మోసాలు.. భారత్ లో అమెరికా దౌత్యవేత్త అనుభవాలు!
అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ రెండోసారి ప్రెసిడెంట్ గా బాధ్యతలు తీసుకున్న తర్వాత హెచ్-1బీ వీసాలపై చర్చ విపరీతంగా జరుగుతున్న సంగతి తెలిసిందే.;
అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ రెండోసారి ప్రెసిడెంట్ గా బాధ్యతలు తీసుకున్న తర్వాత హెచ్-1బీ వీసాలపై చర్చ విపరీతంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో భారతీయ – అమెరికన్ అమెరికా దౌత్యవేత్త మహవాష్ సిద్ధిఖీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా... హెచ్-1బీ వీసా కార్యక్రమంలో విస్తృతమైన, క్రమబద్ధమైన మోసం జరిగిందని ఆరోపించారు.
అవును.. 2005 - 2007 మధ్య చెన్నై కాన్సులేట్ లో పనిచేసిన మహవాష్ సిద్ధిఖీ తాజాగా ఓ పాడ్ కాస్ట్ లో పాల్గొన్న సందర్బంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా... హెచ్-1బీ వీసా ప్రోగ్రామ్ లో మోసం జరిగిందని.. భారతీయులకు జారీ చేయబడిన వర్కింగ్ వీసాలలో ఎక్కువ భాగం మోసపూరితంగా పొందబడ్డాయని చెబుతూ.. తన ప్రత్యక్ష అనుభవాలు పంచుకున్నారు.
ప్రపంచంలోనే అతిపెద్ద హెచ్-1బీ వీసా ప్రాసెసింగ్ పోస్టులలో ఒకటైన చెన్నై లో కాన్సులర్ అధికారిగా పనిచేసిన సమయంలో అక్కడ యూఎస్ అధికారులు 2024లోనే 2,20,000 హెచ్-1బీ లు.. 1,40,000 హెచ్-4 వీసాలతో సహా వేలాది వలసేతర వీసాలను నిర్ణయించారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా తాను దౌత్యవేత్తగా కాకుండా వ్యక్తిగత హోదాలో మాట్లాడుతున్నట్లు తెలిపారు.
ఇదే సమయంలో... ఆ సమయంలో భారతీయులకు జారీ చేయబడిన వీసాల్లో ఎక్కువ భాగం హెచ్-1బీ వీసాలు.. నకిలీ డిగ్రీలు, అర్హత సాధించడానికి తగినంత నైపుణ్యం లేని దరఖాస్తుదారులకు మోసపూరితంగా లభించాయని సిద్ధిఖీ ఆరోపించారు! ఈ క్రమంలో తాను చెన్నైలో కాన్సులర్ అధికారిగా ఉన్న సమయంలో మోసాన్ని గుర్తించి, విదేశాంగ కార్యదర్శికి సమాచారం అందించినట్లు తెలిపారు.
అయితే... రాజకీయ ఒత్తిడి కారణంగా ఎటువంటి చర్య తీసుకోలేదని ఆమె పేర్కొన్నారు. ఈ మోసంలో అనేక మంది రాజకీయ నాయకులు పాల్గొన్నారని.. ఈ మోసంపై దర్యాప్తు చేయకూడదని వారిపైనా గణనీయమైన ఒత్తిడి ఉందని ఆమె ఆరోపించారు. ఈ క్రమంలో... భారతీయ రాజకీయ నాయకులను సంతృప్తి పరచడానికి ఇది జరిగిందని ఆమె పేర్కొన్నారు.
వాస్తవానికి.. ఒక భారతీయ అమెరికన్ గా తాను ఇలా చెప్పడానికి ఇష్టపడను అని చెబుతూ... భారత్ లో మోసం, లంచం రొటీన్ గా మారిపోయాయని ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఈ ఆరోపణలు సంచలనంగా మారాయి.