పాక్ కుట్రలు.. నిషేధం ఉన్నా భారత్‌లోకి వస్తువులు పంపేందుకు ప్రయత్నాలు!

పహల్గాంలో జరిగిన ఉగ్రదాడితో దేశం మొత్తం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ నేపథ్యంలో భారత్ పాకిస్థాన్‌కు గట్టిగా బుద్ధి చెప్పేందుకు రెడీ అయింది.;

Update: 2025-05-05 12:30 GMT

పహల్గాంలో జరిగిన ఉగ్రదాడితో దేశం మొత్తం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ నేపథ్యంలో భారత్ పాకిస్థాన్‌కు గట్టిగా బుద్ధి చెప్పేందుకు రెడీ అయింది. ఇప్పటికే పాక్ నుంచి వచ్చే అన్ని రకాల దిగుమతులపై పూర్తి నిషేధం విధించిన సంగతి తెలిసిందే. అయితే, పాకిస్థాన్ మాత్రం తమ ఉత్పత్తులను ఎలాగైనా భారత మార్కెట్‌లోకి చొప్పించేందుకు కుటిల ప్రయత్నాలు చేస్తోంది. యూఏఈ, సింగపూర్, ఇండోనేషియా, శ్రీలంక వంటి ఇతర దేశాల ద్వారా లేబుళ్లు మార్చి, రీప్యాకేజ్ చేసి మన మార్కెట్లోకి పంపాలని చూస్తోంది.

దీంతో భారత కస్టమ్స్ అధికారులు అప్రమత్తమయ్యారు. దేశ భద్రత, ఆర్థిక ప్రయోజనాలను కాపాడేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. దాదాపు 500 మిలియన్ డాలర్ల విలువైన పాకిస్థానీ ఉత్పత్తులైన పండ్లు, ఎండు ఖర్జూరాలు, వస్త్రాలు, రాక్ సాల్ట్, తోలు వస్తువులు మొదలైన వాటిని మూడో దేశాల ద్వారా భారత్‌లోకి తరలించేందుకు పాక్ ప్రయత్నిస్తోంది.

కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు పాకిస్తాన్ లో తయారైన ఏ ఒక్క వస్తువు కూడా ఏ మార్గం ద్వారా భారత్‌లోకి రాకుండా నిరోధించడానికి కస్టమ్స్ అధికారులు నిరంతరం నిఘా ఉంచుతున్నారు. సరిహద్దుల్లోనూ, ఓడరేవుల్లోనూ ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నారు. అనుమానాస్పదంగా ఉన్న కంటైనర్‌లను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఇదిలా ఉండగా, భారత్ పాకిస్థాన్‌కు మరో పెద్ద షాక్ ఇచ్చింది. బగలిహార్ ప్రాజెక్ట్ నుంచి నీటిని నిలిపివేసింది. ఉగ్రవాదానికి మద్దతు ఇస్తున్న పాక్‌పై ఆర్థికంగా ఒత్తిడి పెంచేందుకు భారత్ తీసుకుంటున్న చర్యల్లో ఇది కూడా ఓ భాగంగా చెప్పుకోవచ్చు.

వాస్తవానికి, అధికారిక మార్గాల ద్వారా పాక్ నుంచి భారత్‌కు జరిగే దిగుమతుల విలువ చాలా తక్కువ. కానీ, అనధికారిక మార్గాల ద్వారా, మూడో దేశాల ద్వారా పెద్ద మొత్తంలో పాకిస్థానీ ఉత్పత్తులు భారత మార్కెట్‌లోకి వస్తున్నట్లు అధికారులు గుర్తించారు. అందుకే, ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ పాక్ నుంచి వచ్చే అన్ని దిగుమతులను మే 2 నుంచి పూర్తిగా నిషేధిస్తూ కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

2019లో పుల్వామా ఉగ్రదాడి తర్వాత భారత్ పాకిస్థాన్‌తో వాణిజ్య సంబంధాలను గణనీయంగా తగ్గించుకుంది. పాక్‌కు ఇచ్చిన ‘మోస్ట్ ఫేవర్డ్ నేషన్’ హోదాను రద్దు చేయడంతో పాటు, పాకిస్థానీ ఉత్పత్తులపై 200 శాతం దిగుమతి సుంకం విధించింది. గణాంకాలను పరిశీలిస్తే, 2024-25 ఆర్థిక సంవత్సరంలో భారత్ పాక్‌కు 447.65 మిలియన్ డాలర్ల విలువైన వస్తువులను ఎగుమతి చేయగా, కేవలం 0.42 మిలియన్ డాలర్ల విలువైన ఉత్పత్తులను మాత్రమే దిగుమతి చేసుకుంది. ఈ వాణిజ్యం విలువ పరంగా స్వల్పమైనప్పటికీ, పాక్‌లోని కొన్ని పరిశ్రమలు మాత్రం భారత్‌కు చేసే ఎగుమతులపైనే ఎక్కువగా ఆధారపడి ఉన్నాయి. తాజా నిషేధంతో ఆ పరిశ్రమలు మరింత కుదేలయ్యే అవకాశం ఉంది.

భారత్ తీసుకుంటున్న ఈ కఠిన చర్యలు పాకిస్థాన్‌కు ఆర్థికంగా పెద్ద దెబ్బ తీయడమే కాకుండా, ఉగ్రవాదానికి మద్దతు ఇస్తే ఎలాంటి పరిణామాలు ఉంటాయో స్పష్టంగా తెలియజేస్తున్నాయి. భారత ప్రభుత్వం తన దేశ భద్రత, ఆర్థిక ప్రయోజనాల విషయంలో రాజీపడేది లేదని ఈ చర్యలతో మరోసారి రుజువైంది.

Tags:    

Similar News