పాక్ తో భారత్ యుద్ధం....నష్టం ఎవరికి ?
భారత్ పాక్ నడ్డి విరవాలీ అంటే కత్తులతో కాదు కంటి చూపుతోనే చంపేసే శక్తిని సాధించాలి. అందుకే కేంద్రం కూడా ఆచీ తూచీ అడుగులు వేస్తోంది అని అంటున్నారు.;
పాకిస్థాన్ తో భారత్ యుద్ధం అని ఇపుడు జాతీయంగా అంతర్జాతీయంగా కూడా ప్రచారంలో ఉన్న విషయంగా మారింది. భారత్ లో ఉగ్రదాడి వెనకాల పాక్ ఉందని కచ్చితంగా రూఢీ అయిన నేపథ్యంలో ప్రతీ భారతీయుని హృదయం రగిలిపోతోంది. మరో వైపు చూస్తే దీనికి తగిన ప్రతీకారం తీర్చుకోవాలని కూడా భారత్ పౌరులు అంతా ముక్త కంఠంతో కోరుతున్నారు.
కేంద్రంలో బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం కూడా పాక్ కి తిరుగులేని గుణపాఠం చెబుతామని స్పష్టం చేస్తోంది. ప్రధాని నరేంద్ర మోడీ నుంచి కేంద్ర మంత్రులు అంతా పాకిస్థాన్ ని దారికి తేవడం ఎలా అన్న దాని మీద తీవ్రంగా కసరత్తు చేస్తున్నారు.
దాంతో యుద్ధ మేఘాలు బలంగా కమ్ముకుంటున్నాయన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ నేపధ్యంలో పాకిస్థాన్ తో భారత్ యుద్ధానికి అవకాశాలు ఎంత మేరకు ఉన్నాయి. నిజంగా యుద్ధం జరిగితే కనుక అది ఏ దేశానికి ఎంత వరకూ నష్టం కలిగిస్తుంది అన్న చర్చ అయితే జోరుగా సాగుతోంది.
సాధారణంగా యుద్ధం అంటే రెండు వైపులా నష్టం ఉంటుంది అన్నది నిజం. ఎంతటి బలవంతుడు అయినా ఆ వైపు కూడా భారీ నష్టం ఉంటుంది. ఇక చూస్తే పాకిస్థాన్ అన్ని విధాలుగా దెబ్బ తిని ఉంది. ఆ దేశం ఆర్థికంగా పతనం అంచుల మీద ఉంది. అదేదో సామెత చెప్పినట్లుగా ఇక పాకిస్థాన్ కి పోయేది ఏమీ లేదు.
కొత్తగా జరిగే నష్టమూ లేదు. కానీ ప్రపంచంలో బలమైన ఆర్ధిక వ్యవస్థ గా ఉంటూ ప్రస్తుతం టాప్ ఫైవ్ లో ఉన్న భారత్ అటు నుంచి మూడవ నంబర్ కి ఎగబాకేందుకు చూస్తోంది. అంతటి పటిష్టమైన ఆర్ధిక వ్యవస్థగా ఉన్న భారత్ ఇపుడు పాక్ తో యుద్ధం అంటూ తెగబడితే దారుణమైన ఆర్ధిక నష్టం ఉంటుందని అంటున్నారు. ఈ ఆర్ధిక నష్టాలు కష్టాలు దశాబ్దాల పాటు పట్టి పీడిస్తాయని అంటున్నారు.
పోనీ ఈ యుద్ధం వల్ల పాక్ కి ఇప్పటికిపుడు బుద్ధి ఏమైనా వచ్చేస్తుందని ఆ విధంగా ఆ దేశం దారికి వచ్చేసి ఇక మీద రాముడు మంచి బాలుడు అన్నట్లుగా ఉంటుంది అనుకుంటే పొరపాటే అంటున్నారు. ఇప్పటికి నాలుగు యుద్ధాలను భారత్ పాక్ తో చేసింది. అన్ని యుద్ధాలలో భారత్ దే ఘన విజయం. ఇక 1971లో చూస్తే ఏకంగా 93 వేల మందికి పైగా పాక్ సైనికులు భారత్ కి బంధీలుగా చిక్కారు.
భారత్ సైనికులు లాహోర్ దాకా వెళ్ళి అక్కడిదాకా ఆక్రమించారు కూడా. ఆ తరువాత చర్చల సందర్భంగా తిరిగి వెనక్కి వచ్చేశారు. ఇంతలా భారత్ విజయాలు అందుకున్నా పాక్ వంకర బుద్ధి అయితే ఏ మాత్రం మారలేదు. పాకిస్థాన్ ఎపుడూ భారత్ తో అదే అక్కసుతోనే ఉంటూ ఉగ్ర భూతాన్ని ఎగదోస్తూనే ఉంది.
ఈ నేపధ్యంలో మరోసారి యుద్ధం అంటే వినాశనమే తప్ప మరేదీ ఉండదని అంటున్నారు అందువల్ల తాము కసి కందకుండా పాక్ బక్కచిక్కేలా చేయాలన్నదే అసలైన యుద్ధ తంత్రం అని అంటున్నారు. అలా చేయాలీ అంటే దానికి దౌత్య నీతి రాజనీతి చాలా ముఖ్యమని అంటున్నారు.
భారత్ పాక్ నడ్డి విరవాలీ అంటే కత్తులతో కాదు కంటి చూపుతోనే చంపేసే శక్తిని సాధించాలి. అందుకే కేంద్రం కూడా ఆచీ తూచీ అడుగులు వేస్తోంది అని అంటున్నారు. పాక్ కి సింధు జలాలు బంద్ చేయడం అందులో భాగమే అని అంటున్నారు. దీని వల్ల పాక్ ఆర్ధిక వ్యవస్థ చితికిపోతుంది. సగానికి సగం దేశం ఎడారిగా మారుతుంది. అంతే కాదు పాక్ మరింతగా బీదగా మారి బక్కచిక్కుతుంది.
అది చివరికి ఆ దేశంలో అశాంతి అంతర్యుద్ధానికి దారి తీసి అక్కడి పౌరులే అ ఆ దేశ పాలకుల మీద తిరగబడేందుకు ఆస్కారం ఉంటుంది. అలగే పాక్ లో ఉన్న రాష్ట్రాలు కానీ ప్రావిన్సెస్ కానీ తిరుగుబాటలో కొన్ని ఉన్నాయి. అవి కనుక విడిపోతే కనుక పాక్ ముక్క చెక్కలు అవుతుంది. అపుడు దారుణంగా చితికిపోయి ఉనికి కోల్పోతుంది.
ఇలా పాక్ విషయంలో అనేక రకాలుగా వేధించి సాధించవచ్చు అన్న లెక్కలు ఉన్నాయి. అందుకే యుద్ధం కోరి తెచ్చుకుని భారత్ తాను కూడా నష్టపోవడం కంటే తన చేతికి మట్టి అంటించుకోకుండా తన పౌరులను ఇబ్బంది పెట్టకుండా పాక్ ని సర్వ నాశనం చేసే ఉపాయం కోసం చూస్తోంది అని అంటున్నారు. సో ఇదే బెటర్ వ్యూహం కూడా అని అంతా అంటున్నారు.