ప్రభుత్వం పిలక సైన్యం చేతిలో...సైన్యం పిలక ఉగ్రవాదుల చేతిలో !

ఇక అత్యంత శక్తివంతమైనది పాక్ సైన్యం అని చెబుతున్న వేళ వారి కంటే పాకిస్థాన్ లో ఉగ్రవాదులు ఇంకా శక్తిమంతులుగా ఉన్నారు.;

Update: 2025-05-11 08:30 GMT

పాకిస్థాన్ ని ఒక దేశంగా చూడవచ్చా. గుర్తించి గౌరవించవచ్చా అన్న ప్రశ్నలు మేధావులు నిపుణుల నుంచి వస్తున్నాయి. పాకిస్థాన్ ని అంతర్జాతీయ సమాజం ఈ రోజుకీ ఒక దేశంగా చూస్తోంది. అందుకే చర్చలు శాంతి అని చెబుతోంది. రుణాలు కూడా ఇస్తోంది. తాజాగా దాదాపుగా 9 వేల కోట్ల పై చిలుకు రుణాలను పాకిస్థాన్ కి అంతర్జాతీయ ద్రవ్య నిధి మంజూరు చేసింది. దీంతో పాక్ తాత్కాలికంగా గండం గట్టెక్కినట్టే.

ఇక చూస్తే కనుక పాకిస్థాన్ లో పేరుకు ప్రజాస్వామ్య ప్రభుత్వం నడుస్తోంది. అది బయటకు ఒక ముసుగు తప్ప మరేమీ కాదని అంతర్జాతీయ రాజకీయ విశ్లేషకులు చెబుతారు. సైన్యం మొత్తం అంతా తెర వెనక నుంచి నడిపిస్తోంది అని అంటారు. సైన్యానికి కోపం వస్తే చాలు ప్రధాని మారిపోతారు. ప్రభుత్వాలూ కూలిపోతాయి. మామూలుగా చూస్తే ప్రజాస్వామ్య దేశంలో ప్రజలు ఎన్నుకున్న పాలకులే అత్యంత శక్తిమంతులు గా ఉంటారు.

వారే వివిధ శాఖలలో నియామకాలను చేపడతారు. కానీ ఉల్టా సీదాగా పాక్ లో మాత్రం సైన్యం ప్రభుత్వాధినేతను ఎంపిక చేస్తుంది. తమ చెప్పుచేతలలో ఉండేవారినే తెచ్చి కీలుబొమ్మగా పీఠం మీద కూర్చోబెడుతుంది. ఎక్కడ తమ మాట వినరు అన్న సందేహం వచ్చినా వెంటనే ఆ బొమ్మను దించేస్తారు. మార్చి అవతల పెట్టేస్తారు.

ఇక సైన్యం పాకిస్థాన్ లో అత్యంత బలమైంది. ఎన్నోసార్లు ప్రజా ప్రభుత్వాలను కూల్చేసి సైన్యాధ్యక్షులే దేశాన్ని నడిపిన చరిత్ర ఉంది. అంతే కాదు ప్రజాకర్షణ కలిగిన రాజకీయ నాయకులు తమకు గిట్టని వారు సొంత ఇమేజ్ ఉన్న వారు అధికారంలోకి ప్రజల మద్దతుతో వస్తారు అనుకుంటే అనూహ్యంగా వారి హత్యలు జరిగిపోతాయి.

1970 దశకంలో భుట్టో, అలాగే 2007న ఆయన కుమార్తె మాజీ ప్రధాని బెనజీర్ భుట్టో ఇలాగే హత్య గావించబడ్డారు. అంతే కాదు పాక్ కి ప్రధానిగా చేసిన మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ లాంటి వారు జైలులో మగ్గుతున్నారు. ఇమ్రాన్ కి అత్యంత ప్రజాదరణ ఉంది. ఆయన మీద సరైన ఆధారాలు లేకుండా చిన్నపాటి ఆరోపణలతోనే జైలు పాలు చేశారు అన్న విమర్శలు ఉన్నాయి.

ఇక అత్యంత శక్తివంతమైనది పాక్ సైన్యం అని చెబుతున్న వేళ వారి కంటే పాకిస్థాన్ లో ఉగ్రవాదులు ఇంకా శక్తిమంతులుగా ఉన్నారు. వారు చెప్పినట్లుగా సైన్యం అక్కడ అంతా చేయాల్సి ఉంటుంది. ఉగ్రవాదులు అంటే అరాచకమే తప్ప మరోటి ఉండదు. వారు అనుకున్నది చేస్తారు. జీహాదీ పేరుతో అమాయకులను చంపుతూంటారు.

వారు సైన్యాన్ని తమ చెప్పుచేతలలో ఉంచుకుని ఆటాడిస్తూంటారు అని అంటారు. తాజాగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ లో ఉగ్రవాద పోస్టులు అనేకం ద్వంశం అయ్యాయి. అలా చనిపోయిన ఉగ్రవాదులకు పాక్ సైన్యం ఘనమైన నివాళి అర్పించడం ప్రపంచం అంతా చూసింది. చాలా మంది ఉగ్రవాదులు గాయాలపాలు అయి ఆసుపత్రులలో ఉంటే వారిని పరామర్శించడానికి సైనిక అధికారులు వెళ్ళడమూ అంతా చూశారు.

ఈ విధంగా ఒక బలమైన బంధం సైన్యం ఉగ్రవాదుల మధ్య పెనవేసుకుని పోయిన చోట ప్రభుత్వాలు నామమాత్రం అయిన చోట భారత్ లాంటి ప్రజాస్వామిక దేశాలు చర్చలు ఎవరితో జరపాలి అన్నది అంతర్జాతీయ దౌత్య నిపుణుల ప్రశ్న. నిజమే యుద్ధం అనివార్యం కాదు. ఎవరూ కోరుకోరు. శాంతి అందరికీ కావాలి. కానీ ఉగ్రవాదుల మాటే పూర్తిగా చెల్లుబాటు అయ్యే వాతావరణంలో ఉన్న పాక్ తో శాంతి చర్చలు అంటే చెవిటి వాడి ముందు శంఖం ఊదినట్లే అని అంటున్నారు.

జీహాదీలకు శాంతి వచనాలు రుచించవు అంటారు. అన్నీ తెగించి బరితెగించిన వారికి చట్టాలు సరిహద్దులు కాల్పుల విరమణను పాటించడాలు అంతకంటే తెలియవు. వారికి తెలిసింది అన్నా జీహాదీ పేరుతో యుద్ధం. తాము చేస్తున్నది కరెక్ట్ అన్న ఉన్మాదంలో వారు ఉన్నారు. వారే ఇపుడు పాకిస్థాన్ అనబడే ఒక దేశాన్ని నియంత్రిస్తున్నారు. ఈ సంగతి అంతర్జాతీయ సమాజానికి తెలిసిన తమ అవసరాల కోసం పాక్ తో దోస్తీ చేస్తూ భారత్ ని చర్చలకు సిద్ధం కమ్మంటున్నాయి.

ఇటువంటి పరిస్థితుల మధ్య ఈ రోజు ఉన్న భారత్ పాక్ విషయంలో తేల్చుకోవాల్సింది చివరికి తానే అన్నది అర్థం అయింది. అందుకే ఆపరేషన్ సింధూర్ పేరుతో ఉగ్ర మూకలను ఏరేసింది. ఇపుడు కాల్పుల విరమణ విషయంలో తేడా వస్తే కూడా తడాఖా చూపించడానికి సిద్ధంగానే ఉంది.

Tags:    

Similar News