ఇక హారన్ల గోల ఉండదు.. వాటి స్థానంలో తబలా, ఫ్లూట్.. కేంద్రం సూపర్ ప్లాన్!

దేశంలో పెరుగుతున్న శబ్ధ కాలుష్యం ఒక పెద్ద సమస్యగా మారుతోంది. ముఖ్యంగా వాహనాల హారన్ల మోతతో నగరాలు, పట్టణాలు నిత్యం హోరెత్తిపోతున్నాయి.;

Update: 2025-04-22 09:24 GMT

దేశంలో పెరుగుతున్న శబ్ధ కాలుష్యం ఒక పెద్ద సమస్యగా మారుతోంది. ముఖ్యంగా వాహనాల హారన్ల మోతతో నగరాలు, పట్టణాలు నిత్యం హోరెత్తిపోతున్నాయి. ఈ బాధ నుంచి ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు కేంద్ర ప్రభుత్వం ఓ వినూత్నమైన నిర్ణయం తీసుకుంది. త్వరలోనే ఆచరణలోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది. ఇకపై రోడ్లపై హారన్ల స్థానంలో తబలా, ఫ్లూట్, వయోలిన్ వంటి సంగీత వాయిద్యాల శబ్దాలు వినిపించేందుకు ప్రభుత్వం సిద్ధం అవుతుంది. ఇది నిజంగా జరిగితే, ట్రాఫిక్ జామ్‌లో కూడా మన చెవులు సంగీతంతో నిండిపోతాయి.

కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తాజాగా ఈ ఆసక్తికర ప్రతిపాదనను ప్రకటించారు. వాహన హారన్‌లుగా భారతీయ సంగీత వాయిద్యాల శబ్దాలను తప్పనిసరి చేస్తూ ఒక చట్టాన్ని ప్రవేశపెట్టే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఫ్లూట్, తబలా, వయోలిన్, హార్మోనియం వంటి శబ్దాలను ఉపయోగించడం ద్వారా వాహన హారన్‌లను మరింత ఆహ్లాదకరంగా మార్చడమే తమ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.

మంత్రి గడ్కరీ మాట్లాడుతూ.. దేశంలోని వాయు కాలుష్యానికి రవాణా రంగం 40శాతం కారణమని ఆయన అంగీకరించారు. దీనిని తగ్గించడానికి ప్రభుత్వం ఇప్పటికే పర్యావరణ అనుకూల వాహనాల వినియోగాన్ని ప్రోత్సహిస్తోంది. ఇప్పుడు శబ్ద కాలుష్యంపై దృష్టి సారించి, ఈ కొత్త ఆలోచనను అమలు చేయడానికి ప్రయత్నాలు చేస్తోంది. ఒకసారి ఇది అమల్లోకి వస్తే, రోడ్లపై విసుగు కలిగించే హారన్ల గోలకు స్వస్తి చెప్పవచ్చు.

అంతేకాకుండా, భారతీయ ఆటోమొబైల్ రంగం వృద్ధిని కూడా గడ్కరీ ప్రస్తావించారు. ద్విచక్ర వాహనాలు, కార్ల ఎగుమతుల ద్వారా దేశం భారీగా ఆదాయం పొందుతోందని, 2014లో రూ.14 లక్షల కోట్లుగా ఉన్న ఈ పరిశ్రమ ఇప్పుడు రూ. 22 లక్షల కోట్లకు పెరిగిందని ఆయన గుర్తు చేశారు. అంతేకాకుండా, భారత్ జపాన్‌ను అధిగమించి ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద ఆటోమొబైల్ మార్కెట్‌గా అవతరించిందని ఆయన గర్వంగా చెప్పారు. మొత్తానికి, వాహనాల హారన్ల స్థానంలో సంగీతం వినిపించే రోజు ఎంతో దూరంలో లేదు.

Tags:    

Similar News