ఎన్నికల సంఘం సంచలనం.. మీ మొబైల్‌లోనే మీ ఓటు..!
అప్పటి వరకు సాధారణ జీవితం గడిపిన పౌరుడు కూడా.. ఓటరు మహాశయుడిగా, ఓటరు దేవుడిగా మారిపోతాడు.;
ఎన్నికలు అనగానే ఓటర్లకు, ఓట్లకు కూడా ప్రాధాన్యం ఉన్న విషయం అంతా ఇంతాకాదు. అప్పటి వరకు సాధారణ జీవితం గడిపిన పౌరుడు కూడా.. ఓటరు మహాశయుడిగా, ఓటరు దేవుడిగా మారిపోతాడు. అది ప్రజాస్వామ్య దేశాల్లో ముఖ్యంగా భారత్ వంటి అతి పెద్ద దేశాల్లో ఓటుకు ఉన్న వాల్యూ. ఇక, ఓటు హక్కు వినియోగించుకునే విధానాల్లోనూ మార్పులు వస్తున్న విషయం తెలిసిందే. అధునాతన సాంకేతికతను అందిపుచ్చుకుని కేంద్ర ఎన్నికల సంఘం ఓటు హక్కును వినియోగించుకునే ప్రక్రియను ఇప్పటికి రెండు సార్లు మార్చింది. దీనిలో ఒకప్పుడు బ్యాలెట్ ఓటు ప్రక్రియ ఉండేది.
దీనిలో స్లిప్పులపై ఉన్న ఎన్నికల గుర్తుపై ముద్ర వేసి బ్యాలెట్ బాక్సులో వేసే విధానం. పంచాయతీల్లో ఇప్పటికీ ఈ విధానం అమలు అవుతున్నా.. సార్వత్రిక, అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం లేదు. దీని స్థానంలో ఈవీఎంలను తీసుకువచ్చారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల ద్వారా.. మిషన్‌పై ఉన్న బటన్‌లలో ఒక దానిని నొక్కి ఓటరు తమకు నచ్చిన నాయకుడిని ఎన్నుకునే విధానం. ప్రస్తుతం ఇదే దేశవ్యాప్తంగా అమలవుతోంది. అయితే..దీనిపై అనేక సందేహాలు, అనుమానాలు వస్తూనే ఉన్నాయి. కానీ.. ఎన్నికల సంఘం మాత్రం ఈవీఎంలలో ఎలాంటి దోషం లేదని చెబుతోంది. పైగా ఈవీఎంలను ఎవరూ హ్యాక్ చేయడం సాధ్యంకాదని ఇటీవల కొన్ని మాసాలకు ముందు సుప్రీంకోర్టుకు కూడా వివరించింది.
అయినప్పటికీ.. అధికారం కోల్పోయిన వారు.. అధికారంలోకి వస్తామని ఆశలు పెట్టుకున్నవారు మాత్రం తరచుగా ఈవీఎంలపై నే విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలో మరిన్ని మార్పుల దిశగా కేంద్ర ఎన్నికల సంఘం అడుగులు వేస్తోంది. ఓటు బేసే ప్రక్రియలో మరో మార్పు దిశగా అడుగులు వేసింది. ప్రస్తుతం రూపొందించిన ప్రత్యేకయాప్ ద్వారా ఓటర్లు తమ మొబైల్ ఫోన్ల నుంచే ఓటు హక్కు వినియోగించుకునేందుకు అవకాశం కల్పిస్తోంది. ప్రత్యక యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని.. దానిలో వివరాలు నమోదు చేయడం ద్వారా ఓటర్లుతమ ఓటు వేసే అవకాశం అందుబాటులోకి రానుంది.
ప్రస్తుతానికి పరిమితంగా..
తాజాగా ఎన్నిక లసంఘం రూపొందించిన ప్రత్యేక యాప్‌ను ఈ ఏడాది జరిగే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి ప్రవేశ పెట్టనున్నారు. ఈ-ఓటింగ్‌లో పాల్గొనాలనుకునే వారికోసం e-SECBHR యాప్‌ను రూపొందించారు. ఓటర్ ఐడీ, ఫోన్ నంబర్ సాయంతో ముందుగా ఇందులో రిజిస్టర్ చేసుకోవాలి. పోలింగ్ జరిగే రోజు నిర్దేశించిన సమయంలో ఎప్పుడైనా ఈ యాప్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకోవచ్చు. సీ-డాక్ సంస్థ అభివృద్ధి చేసిన ఈ యాప్ అందుబాటులోకి వచ్చింది. కాగా.. ఒక మొబైల్ ఫోన్ నుంచి కేవలం ఇద్దరు ఈ-ఓటర్లు మాత్రమే ఓటు వేసే వీలుంటుందని బీహార్ అధికారులు తెలిపారు. ఈ ప్రక్రియ సక్సెస్ అయితే.. వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి.. లేదా ఈ లోగా జరిగే పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లోనూ మొబైల్ ఓటింగ్ విధానం అందుబాటులోకి తీసుకువస్తారు. ఓటు వేసిన తర్వాత..ఎవరికి ఓటు వేశారనేది పీడీఎఫ్ రూపంలో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.