ఈ -వాహనానికి సౌండ్ తప్పనిసరి.. తాజా రూల్ ఎందుకంటే?
అవును... రోడ్లపై ఎలక్ట్రిక్ వాహనాలు సైలంట్ గా వెళ్లిపోతాయి కాబట్టి వెనక నుంచి ఏదైనా వాహనం వస్తున్నా గుర్తించడం కష్టం అవుతుంది!;
సాధారణంగా వాహనాలు రోడ్డుపై వెళ్తున్నప్పుడు వాటి ఇంజిన్ సౌండ్ వల్ల హారన్ కొట్టకపోయినా వెనుక వాహనం ఉందని సులభంగా గుర్తించవచ్చు. అదే ఎలక్ట్రిక్ వాహనాల విషయానికొస్తే.. అవి బ్యాటరీ, మోటార్ సాయంతో పనిచేయడం వల్ల వాటి నుంచి సౌండ్ వినిపించదు. దీంతో.. అవి సైలంట్ గా పక్క నుంచి వెళ్లిపోతుంటాయి, వెనుక ఉన్నప్పటికీ గ్రహించలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో సర్కార్ ఓ కీలక నిర్ణయం తీసుకుంది!
అవును... రోడ్లపై ఎలక్ట్రిక్ వాహనాలు సైలంట్ గా వెళ్లిపోతాయి కాబట్టి వెనక నుంచి ఏదైనా వాహనం వస్తున్నా గుర్తించడం కష్టం అవుతుంది! దీంతో ప్రమాదాలకు ఆస్కారం ఉంటుందని భావించిన కేంద్రం.. ఈ ఎలక్ట్రిక్ వాహనాల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా... ఎలక్ట్రిక్ వాహనాలకు అకౌస్టిక్ వెహికల్ అలర్ట్ సిస్టమ్ (ఏవీఏఎస్) తప్పనిసరి చేసింది. ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఈ ముసాయిదా నోటిఫికేషన్ ప్రకారం... 2027 అక్టోబర్ 1 నుంచి అన్ని ఎలక్ట్రిక్ కార్లు, బస్సులు, ట్రక్కులకు ఏవీఏస్ తప్పనిసరి అని రోడ్డు రవాణా, రహదారి మంత్రిత్వశాఖ స్పష్టం చేసింది. రోడ్డు భద్రతను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఈ క్రమంలో... 2026 అక్టోబర్ 1 తర్వాత తయారయ్యే కొత్త ఎలక్ట్రిక్ ప్యాసింజర్, గూడ్స్ వాహనాలన్నీ అలర్ట్ సిస్టమ్ సదుపాయంతోనే రోడ్లపైకి రావాలని పేర్కొంది.
అక్టోబర్ 2026 తర్వాత తయారు చేయబడిన ‘ఎమ్’, ‘ఎన్’ కేటగిరీల అన్ని కొత్త మోడళ్ల ఎలక్ట్రిక్ వాహనాలకు ఈ ఫీచర్ ను తప్పనిసరి చేయాలని మంత్రిత్వ శాఖ తెలిపింది! వీటిలో కేటగిరీ ‘ఎమ్’ లో ప్రయాణీకుల రవాణా కోసం రూపొందించిన కార్లు, బస్సులు ఉంటాయి. కేటగిరీ ‘ఎన్’ లో ట్రక్కులు, వస్తువుల వాహనాలు ఉంటాయి. ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు, త్రిచక్ర వాహనాలు ఈ ఆదేశం పరిధిలోకి రాలేదని నివేదించబడింది.
ఏమిటీ ఏవీఏస్?:
వాహనాలు కదిలే సమయలో కృత్రిమ శబ్దాన్ని విడుదల చేసేలా దోహదపడేదే ఈ ఏవీఏఎస్. దీనివల్ల రోడ్డుపై ఉన్న ఇతర ప్రయాణికులు, పాదచారులు వాహనం వస్తుందని ముందుగానే గుర్తించొచ్చు. ఏఐఎస్-173 ప్రమాణాల ప్రకారం వినిపించే స్థాయిలతో ఈ సౌండ్ సిస్టమ్ అమర్చాలని ప్రభుత్వం నోటిఫికేషన్ లో స్పష్టం చేసింది. ఇప్పటికే చాలా దేశాలు హైబ్రిడ్ వాహనాలకు ఏవీఏస్ వినియోగాన్ని తప్పనిసరి చేశాయి.