చాట్‌జీపీటీలో విప్లవాత్మక మార్పు.. ఇకపై ఒక్క ప్రాంప్ట్‌తోనే షాపింగ్, UPI చెల్లింపులు!
ఈ అత్యాధునిక చెల్లింపుల వ్యవస్థకు Razorpay, తన బ్యాంకింగ్ భాగస్వాములైన యాక్సిస్ బ్యాంక్ , ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ ద్వారా మద్దతు ఇస్తుంది.;
టెక్ ప్రపంచంలో మరో విప్లవాత్మక మార్పుకు రంగం సిద్ధమైంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) దిగ్గజం OpenAI సంస్థ, భారత్‌లోని ప్రముఖ ఫిన్‌టెక్ సంస్థ రేజర్‌పే (Razorpay).. దేశీయ డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) తో కలిసి ఒక చరిత్రాత్మక భాగస్వామ్యాన్ని ప్రకటించాయి.
ఈ ముగ్గురి కలయికతో ChatGPTలో నేరుగా యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) ద్వారా చెల్లింపులు జరిపే సరికొత్త సదుపాయం "అజ్నెటిక్ పేమెంట్స్" ను పైలట్ ప్రాజెక్ట్‌గా ప్రారంభించారు. భారతదేశంలో AI ఆధారిత కమ్యూనికేషనల్ కామర్స్‌కు ఇది తొలి అడుగు.
*"అజ్నెటిక్ పేమెంట్స్" అంటే ఏమిటి?
"అజ్నెటిక్ పేమెంట్స్" అనేది AI అసిస్టెంట్ ద్వారా సంభాషణలో భాగంగానే (In-Chat) వస్తువులను కొనుగోలు చేసి, చెల్లింపులను పూర్తి చేసే వ్యవస్థ. ఇది వినియోగదారుడికి అడుగడుగునా యాప్ లేదా వెబ్‌సైట్‌లలోకి మళ్లించకుండా.. ఒకే చాట్ ఇంటర్‌ఫేస్‌లోనే షాపింగ్ అనుభవాన్ని అందిస్తుంది.
ఒకే ప్రాంప్ట్‌తో చెల్లింపు
యూజర్ "Order my usual groceries from BigBasket" లేదా "నలుగురికి సరిపడా థాయ్ కర్రీ ఇంగ్రీడియెంట్స్ ఆర్డర్ చేయి" అని చాట్‌జీపీటీకి చెబితే, AI వెంటనే అవసరమైన వస్తువులను ఎంపిక చేసి, బిల్లును రూపొందించి Razorpay ద్వారా UPI చెల్లింపు కోసం అడుగుతుంది. ఇది కేవలం ఒక డిస్కవరీ టూల్ నుండి పూర్తిస్థాయి షాపింగ్ ఏజెంట్‌గా చాట్‌జీపీటీని మారుస్తుంది.
* ప్రారంభ భాగస్వామ్యం – BigBasket
ప్రస్తుత పైలట్ దశలో ఈ AI-ఆధారిత షాపింగ్ అనుభవాన్ని అందించడానికి టాటా గ్రూప్‌కు చెందిన ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ BigBasket మొదటి మర్చెంట్‌గా ఇంటిగ్రేట్ అయింది. వినియోగదారులు BigBasket నుండి తమకు కావలసిన గ్రోసరీలను నేరుగా చాట్‌జీపీటీ ద్వారా ఆర్డర్ చేసి, UPI తో చెల్లించవచ్చు.
*బ్యాంకింగ్, టెక్నాలజీ మద్దతు
ఈ అత్యాధునిక చెల్లింపుల వ్యవస్థకు Razorpay, తన బ్యాంకింగ్ భాగస్వాములైన యాక్సిస్ బ్యాంక్ , ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ ద్వారా మద్దతు ఇస్తుంది. అంతేకాకుండా UPI సర్కిల్ , UPI రిజర్వ్ పే వంటి NPCI యొక్క కొత్త UPI ఆవిష్కరణలను ఈ ప్రాజెక్ట్ వినియోగించుకుంటుంది.
OpenAI ఇంటర్నేషనల్ స్ట్రాటజీ మేనేజింగ్ డైరెక్టర్ ఒలివర్ జే మాట్లాడుతూ "ప్రపంచంలో అత్యంత విశ్వసనీయమైన రియల్-టైమ్ పేమెంట్ నెట్‌వర్క్‌లలో ఒకటైన UPIతో అధునాతన AIని ఎలా మిళితం చేయవచ్చో తెలుసుకోవడానికి మేము ఉత్సాహంగా ఉన్నాము. ఇది సురక్షితమైన.. సులభతరమైన వాణిజ్య యుగానికి తెర తీస్తుంది" అని అన్నారు.
* భవిష్యత్తు - గోప్యతా అంశాలు
ఈ భాగస్వామ్యం భారతదేశంలో డిజిటల్ చెల్లింపులు, ఆన్‌లైన్ షాపింగ్‌ను పూర్తి ఆటోమేషన్ దిశగా తీసుకెళ్లేందుకు బలమైన పునాది వేస్తుంది. భవిష్యత్తులో మరిన్ని ఈ-కామర్స్ , సర్వీస్ ప్లాట్‌ఫామ్‌లు చాట్‌జీపీటీతో ఇంటిగ్రేట్ అయ్యే అవకాశం ఉంది.
అయితే ఫైనాన్షియల్ లావాదేవీలకు సంబంధించిన డేటా సెక్యూరిటీ, గోప్యత , ఏదైనా పొరపాటు జరిగితే బాధ్యత ఎవరిది అనే అంశాలపై మరింత స్పష్టత, పారదర్శకత అవసరమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
మొత్తంమీద భారతీయుల డిజిటల్ అనుభవాన్ని మరింత మెరుగుపరిచేందుకు ఈ కొత్త ఫీచర్ ఒక కీలకమైన మైలురాయి.