ఐరన్ డోమ్.. అమెరికా , ఇజ్రాయెల్ తర్వాత భారత్.. గొప్ప ఖ్యాతి

శత్రు దేశాల నుంచి ఎదురయ్యే వైమానిక, క్షిపణి, సముద్ర ముప్పులను సమర్థవంతంగా ఎదుర్కొనే దిశగా భారత్‌ అత్యంత కీలకమైన ముందడుగు వేసింది.

Update: 2026-06-13 15:30 GMT

శత్రు దేశాల నుంచి ఎదురయ్యే వైమానిక, క్షిపణి, సముద్ర ముప్పులను సమర్థవంతంగా ఎదుర్కొనే దిశగా భారత్‌ అత్యంత కీలకమైన ముందడుగు వేసింది. అమెరికా, ఇజ్రాయెల్‌, రష్యా వంటి అగ్రరాజ్యాల సరసన నిలిచే అత్యాధునిక బాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్ వ్యవస్థ అభివృద్ధిలో భారత రక్షణ పరిశోధన సంస్థ (డీఆర్డీవో) మరో చారిత్రాత్మక మైలురాయిని చేరుకుంది. ఒడిశా తీరంలో నిర్వహించిన వరుస క్షిపణి పరీక్షలు విజయవంతం కావడంతో దేశ సమగ్ర రక్షణ సామర్థ్యం సరికొత్త శిఖరాలకు చేరింది. భవిష్యత్తులో ‘భారత ఐరన్ డోమ్’గా పిలవబడే స్వదేశీ రక్షణ కవచానికి ఈ విజయాలు బలమైన పునాదిగా మారాయి.

చాందీపూర్‌లో క్షిపణి గర్జన.. ఇంటర్‌సెప్టర్ల అద్భుత ప్రదర్శన

ఒడిశాలోని చాందీపూర్‌లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్‌ (ఐటీఆర్) నుంచి డీఆర్డీఓ రెండు అత్యాధునిక ఇంటర్‌సెప్టర్ క్షిపణులను విజయవంతంగా పరీక్షించింది. ఇవి ఇంటర్మీడియట్ రేంజ్ బాలిస్టిక్ మిస్సైల్‌ డిఫెన్స్‌ వ్యవస్థలో భాగంగా పూర్తిగా స్వదేశీ సాంకేతికతతో రూపొందించబడ్డాయి. 2,000 నుంచి 5,000 కిలోమీటర్ల సుదూర పరిధి నుంచి దూసుకొచ్చే శత్రు బాలిస్టిక్ క్షిపణులను ఇవి సమర్థవంతంగా అడ్డుకోగలవు. శత్రు క్షిపణుల కదలికలను ముందే గుర్తించి వాటిని నిరంతరం ట్రాక్ చేస్తూ లక్ష్యానికి చేరుకునేలోపే గాల్లోనే ముక్కలు ముక్కలు చేయడం వీటి ప్రత్యేకత.

అంతరిక్షంలోనూ రక్షణ కవచం.. ఎక్సో, ఎండో అట్మాస్ఫెరిక్ సామర్థ్యం

ఈ పరీక్షల్లో అత్యంత కీలకమైన అంశం ఏమిటంటే.. ఈ క్షిపణులు ఎండో-అట్మాస్ఫెరిక్‌ భూ వాతావరణం లోపల.. ఎక్సో-అట్మాస్ఫెరిక్‌ భూ వాతావరణం వెలుపల ప్రాంతాల్లోనూ సమానంగా పనిచేయగలవు. అంతరిక్షం నుంచి లేదా శత్రు దేశాల శాటిలైట్‌ ఆధారిత దాడుల ముప్పును కూడా ముందే తుడిచిపెట్టే అద్భుత సామర్థ్యం ఈ వ్యవస్థకు ఉన్నట్లు ఈ పరీక్షలు నిరూపించాయి. రెండు ఇంటర్‌సెప్టర్ క్షిపణులు తమ నిర్దేశిత లక్ష్యాలను 100% కచ్చితత్వంతో ఛేదించి భారత రక్షణ సాంకేతిక సత్తాను ప్రపంచానికి చాటాయి.

సముద్రంలోనూ తిరుగులేని శక్తి నావల్ యాంటీ షిప్ మిస్సైల్

మరోవైపు, భారత నౌకాదళ బలాన్ని రెట్టింపు చేస్తూ డీఆర్డీఓ నావల్ యాంటీ షిప్ మిస్సైల్ మీడియం రేంజ్ తొలి ఫ్లైట్ టెస్ట్‌ను కూడా అత్యంత విజయవంతంగా పూర్తి చేసింది. యుద్ధ నౌక నుంచి ప్రయోగించిన ఈ క్షిపణి సముద్ర మట్టానికి అత్యల్ప ఎత్తులో ప్రయాణిస్తూ శత్రువుల రాడార్లకు చిక్కకుండా వెళ్లి లక్ష్య నౌకను ఖచ్చితంగా ధ్వంసం చేసింది. హిందూ మహాసముద్రంలో చైనా, పాకిస్తాన్ల కదలికలను కట్టడి చేయడానికి శత్రు యుద్ధ నౌకలను సముద్ర గర్భంలోనే సమాధి చేయడానికి ఈ క్షిపణి దేశానికి పెద్ద ఆయుధంగా మారనుంది.

అగ్రరాజ్యాల సరసన భారత్

ప్రస్తుతం ప్రపంచంలో అమెరికా, రష్యా, ఇజ్రాయెల్‌ , నాటో కూటమి దేశాలకు మాత్రమే ఇటువంటి అత్యాధునిక, బహుళ అంచెల క్షిపణి రక్షణ వ్యవస్థలు ఉన్నాయి. తాజా విజయాలతో భారత్ కూడా ఆ ఎలైట్ క్లబ్‌లో గర్వంగా అడుగుపెట్టింది.

భూమి, ఆకాశం, అంతరిక్షం, సముద్రం.. ఇలా నాలుగు వైపుల నుంచి వచ్చే ఎలాంటి ముప్పునైనా అడ్డుకునేలా భారత్ అజేయమైన రక్షణ గోడను నిర్మిస్తోందని రక్షణ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దేశీయంగా తయారవుతున్న ఈ 'ఐరన్ డోమ్' భవిష్యత్తులో దేశ భద్రతకు ఒక తిరుగులేని వజ్రాయుధంగా మారబోతోంది.

Tags:    

Similar News