షేక్ హసీనాకు ఉరి...భారత్ ఏమి చేస్తుంది ?
బంగ్లా మాజీ ప్రధాన మంత్రి షేక్ హసీనా గడచిన ఏణ్ణర్ధం కాలంగా భారత్ లోనే ఉంటున్నారు.;
బంగ్లా మాజీ ప్రధాన మంత్రి షేక్ హసీనా గడచిన ఏణ్ణర్ధం కాలంగా భారత్ లోనే ఉంటున్నారు. ఆమెకు భారత్ లో ఆశ్రయం కల్పించింది కేంద్ర ప్రభుత్వం. గత ఏడాది మధ్యలో బంగ్లాదేశ్ లో జరిగిన తిరుగుబాటు నేపధ్యంలో ఎకాఎకీన షేక్ హసీనా భారత్ కి విమానం రెక్కలు పట్టుకుని వచ్చేశారు. కట్టుబట్టలతో ఆమె భారత్ లోకి దిగిపోయారు. భారత్ లో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆమెకు ఎంతో గౌరవం ఇచ్చి భారత్ లో ఆశ్రయం కల్పించింది ఆనాటి నుంచి ఆమె ఇక్కడే నివాసం ఏర్పాటు చేసుకుని ఉంటున్నారు. భారత్ తనను ఎంతగానో ఆదరిస్తోంది అని ఆమె ఈ మధ్యనే చెప్పుకొచ్చారు.
ఉరి శిక్షతో :
ఇక మాజీ ప్రధానిగా ఉన్న షేక్ హసీనాకు ఉరి శిక్షను అంతర్జాతీయ క్రైమ్స్ ట్రైబ్యునల్ కోర్టు విధించింది. గత ఏడాది దేశంలో చోటు చేసుకున్న గొడవలు అల్లర్లు తిరుగుబాట్లకు మాజీ ప్రధాని కారణం అని ఈ తీర్పులో పేర్కొనారు. అంతే కాదు ఈ అల్లర్ల సమయమో వాటికి సంబంధించిన కేసులలో షేక్ హసీనాతో పాటు మాజీ హోం మంత్రి సదుజ్జమాన్ ఖాన్ కమల్, మాజీ ఇన్స్‌పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ చౌదరి అబ్దుల్లా ఆల్‌మామున్ వంటి వారు అంతా దారుణంగ ప్రవర్తించారు అని కోర్టు తీర్పులో పేర్కొంది. ఇవన్నీ మానవత్వానికి వ్యతిరేకంగా చేసిన నేరాలుగా పరిగణిస్తూ ఈ మేరకు కోర్టు తీర్పులో వెల్లడించింది.
తీవ్రమైన నేరాలుగా :
ఆ సమయంలో పాలన చేస్తున్న షేక్ హసీనా కానీ ఇతర ప్రభుత్వ పెద్దలు కానీ అమానవీయ చర్యలకు పాల్పడ్డారు అని కూడా కోర్టు పేర్కొంది. దీంతో వారి మీద హత్యలు అలాగే హింసా కాండ వంటి వాటిని ప్రేరేపించినట్లుగా పేర్కొంటూ కోర్టు తీర్పు చెప్పింది. దాంతో ఈ తీర్పు మీద బంగ్లాదేశ్ లో భిన్నాభిప్రాయాలు వినిపించాయి. కొంతమంది స్వాగతిస్తే మరికొంతమంది కోర్టు హాలు వెలుపల కంటతడి పెట్టడం జరిగింది.
ఆమెను అప్పగించాల్సిందే :
ఈ నేపధ్యంలో షేక్ హసీనా విషయంలో కోర్టు తీర్పుని బంగ్లాదేశ్ తాత్కాలిక అధినేత మహ్మద్ యూనస్ స్వాగతించారు. అందరికీ చట్టం ఒక్కటే అని ఆయన అన్నారు. ఇక్కడ అధికారంలో ఉన్న వారు పలుకుబడి కలిగిన వారు అన్న ప్రశ్న ఉండదని ఆయన షేక్ హసీనా విషయంలో వ్యాఖ్యానించారు. మరో వైపు భారత్ లో ఉన్న హసీనాను తమ దేశానికి అప్పగించాలని ఆయన భారత ప్రభుత్వాన్ని కోరారు భారత్ బంగ్లాదేశ్ మధ్య ఉన్న అప్పగింత ఒప్పందం ప్రకారం షేక్ హసీనా ఆమెతో పాటు అసదుజ్జమాన్ ఖాన్‌లను తమకు అప్పగించాలని భారత ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు రాయిటర్స్ వార్తా సంస్థ ఒక కథనాన్ని ప్రచురించింది.
విదేశాంగ శాఖ చాలా జాగ్రత్తగా :
ఇదిలా ఉంటే గతంలో కూడా షేక్ హసీనాను తమ దేశానికి అప్పగించాలని బంగ్లాదేశ్ కోరినా భారత్ నుంచి ఏమీ స్పందన లేదు. ఈసారి కూడా భారత్ ఎలా రియాక్ట్ అవుతుంది అన్నది చర్చనీయాంశంగా ఉంది. అయితే తాజా పరిణామంపై భారత విదేశాంగ శాఖ చాలా జాగ్రత్తగా స్పందించింది. బంగ్లాదేశ్ అంతర్జాతీయ నేరాల ట్రైబ్యునల్ ఇచ్చిన తీర్పును పరిగణనలోకి తీసుకున్నట్టుగా ఒక ప్రకటనలో పేర్కొంది. అదే సమయంలో బంగ్లాదేశ్ తమ పొరుగు దేశంగా ఉందని అక్కడ ప్రజల ప్రయోజనాలకు భారత్ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని వెల్లడించింది. ఆ దేశంలో శాంతి, ప్రజాస్వామ్యం, సుస్థిరత నెలకొనాలని కోరుకుంటున్నామని వెల్లడించింది. ఆ విధమైన పరిస్థితుల కోసం అక్కడ అన్ని వర్గాలతో నిర్మాణాత్మకంగా వ్యవహరిస్తామని విదేశాంగ శాఖ తెలిపింది. దీంతో భారత్ చేసిన ఈ ప్రకటన అర్ధమేంటి అన్న చర్చ సాగుతోంది. షేక్ హసీనా పక్షం ఉందా లేక అక్కడ ప్రభుత్వం వైపు ఉందా అన్నది కూడా ఒక చర్చగా ఉంది.
కీలుబొమ్మ సర్కార్ తీర్పు :
మాజీ ప్రధాని షేక్ హసీనా అయితే ఈ తీర్పు మీద తీవ్రంగా స్పందించారు. ఇది రాజకీయంతో కూడిన తీర్పు అన్నారు. కీలుబొమ్మ ప్రభుత్వం ప్రోత్సాహంతో ఇచ్చిన తీర్పు అని మండిపడ్డారు. కోర్టులో తన వాదనలు వినిపించే అవకాశం ఏదీ అని ఆమె ప్రశ్నించారు. పక్షపాత రహితంగా విచారణ జరగలేదు అన్నారు. తాను దేనికీ భయపడేది లేదని ఆమె స్పష్టం చేశారు. ఇక షేక్ హసీనాను భారత్ అప్పగిస్తుందా లేదా అన్నది మాత్రం సస్పెన్స్ గానే ఉంది.