త్వరలో ఎలక్ట్రానిక్ టోల్ ప్లాజా.. అదే మొదటి లక్ష్యం!

ప్రస్తుతం ప్రభుత్వం ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ (ANPR) ను FASTag తో అనుసంధానించబోతోందని వర్గాలు కూడా చెబుతున్నాయి..;

Update: 2025-12-05 06:43 GMT

కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గురువారం లోక్ సభలో మాట్లాడుతూ ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్ని తెలిపారు. ప్రస్తుత టోల్ వసూల్ వ్యవస్థ ఒక సంవత్సరం లోపు ముగిసి దాని స్థానంలో ఎలక్ట్రానిక్ వ్యవస్థ వస్తుందని,ఇది హైవే వినియోగదారులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉంటుందని తెలియజేశారు. ఇప్పటికే ఈ కొత్త వ్యవస్థను 10 చోట్ల ప్రవేశపెట్టామని, ఒక సంవత్సరం లోపు దేశవ్యాప్తంగా విస్తరిస్తామని కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ లోక్ సభలో ప్రశ్నోత్తరాల సమయంలో ఈ విషయాన్ని తెలిపారు..

నితిన్ గడ్కరీ మాట్లాడుతూ.. "మరో సంవత్సరంలో ఈ టోల్ వ్యవస్థ ముగుస్తుంది. టోల్ పేరుతో మిమ్మల్ని ఆపడానికి ఎవరూ ఉండరు. ఒక సంవత్సరంలోపు దేశవ్యాప్తంగా ఎలక్ట్రానిక్ టోల్ వసూళ్లను అమలు చేస్తాం. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 10 లక్షల కోట్ల విలువైన 4,500 హైవే ప్రాజెక్టులు కొనసాగుతున్నాయి" అంటూ నితిన్ గడ్కరీ తెలియజేశారు. ఇటీవల విడుదల చేసిన అధికారిక ప్రకటన ప్రకారం చూసుకుంటే.. భారత దేశ రహదారులు అంతటా టోల్ వసూళ్లను క్రమబద్ధీకరించడానికి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(NPCI) నేషనల్ ఎలక్ట్రానిక్ టోల్ వసూళ్ల(NETC) ను ప్రోగ్రామ్ గా అభివృద్ధి చేసింది. ఇది ఎలక్ట్రానిక్ టోల్ చెల్లింపుల కోసం ఏకీకృత ప్లాట్ఫామ్..

ప్రస్తుతం ప్రభుత్వం ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ (ANPR) ను FASTag తో అనుసంధానించబోతోందని వర్గాలు కూడా చెబుతున్నాయి..నేషనల్ ఎలక్ట్రానిక్ టోల్ వసూళ్ల యొక్క ప్రధాన అంశం కూడా FASTag ను అమలుపరచడమే.. ఇది వాహనం యొక్క విండ్ స్క్రీన్ కు అతికించబడిన రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ (RFID) ఆధారిత పరికరం. ఇది టోల్ ప్లాజా వద్ద ఆగకుండా వినియోగదారు లింక్ చేయబడిన ఖాతా నుండి టోల్ చెల్లింపులను స్వయంచాలకంగా చేయడానికి అనుమతిస్తుంది. దీంతో టోల్ ప్లాజా వద్ద వాహనాలు ఆగాల్సిన అవసరం లేదని,చెల్లుబాటు అయ్యే FASTag లేనివారు ఈ- చలాన్ ల ద్వారా జరిమానాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.

ఈ కొత్త వ్యవస్థ అమల్లోకి వచ్చిన తర్వాత వాహనాలు ఆగి టోల్ చార్జీలు చెల్లించడానికి ఎక్కువసేపు క్యూలైన్లలో వేచి ఉండే సమయం ఉండదు. హైవేలపై సుదీర్ఘ ప్రయాణాలు చేసేటప్పుడు ఎలాంటి అడ్డంకులు లేని అనుభవాన్ని అందించడానికి ఇది ఒక మంచి పని అని చాలామంది కేంద్ర ప్రభుత్వం తీసుకువస్తున్న కొత్త విధానాన్ని మెచ్చుకుంటున్నారు. ఏది ఏమైనా ఈ ఎలక్ట్రానిక్ టోల్ ప్లాజా వల్ల సమయం ఆదా అవుతుందని చెప్పవచ్చు. ప్రయాణికుడి సమయాన్ని ఆదా చేయడమే లక్ష్యంగా వస్తున్న ఈ ఎలక్ట్రానిక్ టోల్ ప్లాజా ఏ విధంగా పనిచేస్తుంది అనే విషయం తెలియాలి అంటే ఇంకొన్ని రోజులు ఎదురు చూడాల్సిందే..

Tags:    

Similar News