అమెరికా భారీ సుంకాల మధ్య నిలకడగా భారత ఆర్థిక వ్యవస్థ
అమెరికా విధించిన అత్యధిక వాణిజ్య సుంకాల మధ్య కూడా భారత ఆర్థిక వ్యవస్థ తన బలాన్ని కోల్పోలేదని, నిలకడగా కొనసాగుతోందని కేంద్ర ప్రధాన ఆర్థిక సలహాదారువి;
అమెరికా విధించిన అత్యధిక వాణిజ్య సుంకాల మధ్య కూడా భారత ఆర్థిక వ్యవస్థ తన బలాన్ని కోల్పోలేదని, నిలకడగా కొనసాగుతోందని కేంద్ర ప్రధాన ఆర్థిక సలహాదారువి. అనంత నాగేశ్వరన్ స్పష్టం చేశారు. ముంబైలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ తయారీ రంగం ఉత్పత్తి, జీఎస్టీ వసూళ్లు, రుణాల వృద్ధి వంటి ముఖ్యమైన ఆర్థిక సూచీలు దేశీయ ఆర్థిక కార్యకలాపాలు స్థిరంగా ఉన్నాయని చూపిస్తున్నాయని తెలిపారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల భారతీయ ఉత్పత్తులపై 50 శాతం సుంకం, రష్యా చమురు దిగుమతులపై అదనంగా 25 శాతం పన్ను విధిస్తామని ప్రకటించిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఈ కొత్త సుంకాలు ఆగస్టు 27 నుంచి అమల్లోకి రానున్నాయి.
నాగేశ్వరన్ ప్రకారం.. ఇటువంటి చర్యలు సవాళ్లను సృష్టించినప్పటికీ, భారత ఆర్థిక వ్యవస్థ దాని విస్తృత ఉత్పత్తి, సేవా రంగాలు, బలమైన దేశీయ డిమాండ్ కారణంగా ఇలాంటి బాహ్య ఒత్తిళ్లను తట్టుకునే సామర్థ్యం కలిగి ఉంది. “మా వృద్ధి పథం పట్ల మాకు పూర్తి నమ్మకం ఉంది” అని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
ప్రస్తుతం అమెరికా భారతదేశానికి అతిపెద్ద ఎగుమతి మార్కెట్లలో ఒకటి. గత ఏడాది రెండు దేశాల మధ్య వాణిజ్య విలువ $120 బిలియన్లకు పైగా ఉంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఈ సుంకాలు ఎక్కువ కాలం కొనసాగితే వస్త్రాలు, ఔషధాలు, ఇంజనీరింగ్ వస్తువుల వంటి రంగాలపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంది.
అయితే, ఆగ్నేయాసియా, ఆఫ్రికా, మధ్యప్రాచ్యం వంటి కొత్త మార్కెట్లలో వాణిజ్యాన్ని విస్తరించడంపై భారత ప్రభుత్వం దృష్టి సారించడం వల్ల అమెరికా సుంకాల ప్రభావం కొంతవరకు తగ్గే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
ఈ పరిణామాలపై మార్కెట్ స్పందన మిశ్రమంగా ఉంది. బీఎస్ఈ సెన్సెక్స్ స్వల్ప లాభాలతో ముగిసినప్పటికీ, ఎగుమతులపై ఎక్కువగా ఆధారపడిన కంపెనీల షేర్లు మాత్రం ఒత్తిడికి లోనయ్యాయి. రాబోయే నెలల్లో ప్రపంచ వాణిజ్య పరిస్థితులకు అనుగుణంగా మారడంలో భారతదేశానికి ఇది ఒక పరీక్షగా ఉంటుందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే, భారత ఆర్థిక వ్యవస్థ పూర్తి వేగంతో ముందుకు సాగుతోందని ప్రభుత్వం సంకేతాలు స్పష్టంగా ఇస్తోంది.