ఔను.. 4 వేల టన్నుల బొగ్గు.. వర్షం తినేసింది: ప్రభుత్వం
కుంభకోణాలకు పాల్పడడం.. వాటిని తీరిగ్గా సమర్ధించుకోవడం.. కొన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వాలకు అలవాటు గా మారింది.;
కుంభకోణాలకు పాల్పడడం.. వాటిని తీరిగ్గా సమర్ధించుకోవడం.. కొన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వాలకు అలవాటు గా మారింది. ఇటీవల 2 వేల కిలోల గంజాయిని పట్టుకున్న బీహార్ పోలీసులు.. కోర్టుకు 2 కిలోల గంజాయిని పొట్లం కట్టి అప్పగించారు. ''అదేంటి.. మీరు మీడియాకు చెప్పిన జాబితాలో 2 వేల కిలోల గంజాయి పట్టుకున్నట్టు ఉందికదా?. పైగా సీఎం నుంచి సన్మానాలు కూడా పొందారు కదా!'' అని కోర్టు ప్రశ్నించగా.. నిజమేనని డీజీపీ ఒప్పుకొన్నారు. కానీ, గంజాయిని ఓ బంకర్‌లో దాచామని.. అక్కడ ఎలుకలు దానిని తినేశాయని చెప్పుకొచ్చారు.
ఇక, తెలంగాణలోని జగిత్యాలలో రెండు మాసాల కిందట పేకాట రాయుళ్ల నుంచి 20 లక్షల రూపాయలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చివరకు.. స్థానిక కోర్టుకు 2 లక్షల 16 రూపాయలను అప్పగించి చేతులు దులుపుకొన్నారు. ఇదేంటని ప్రశ్నిస్తే.. నగదు స్టేషన్‌లో పెట్టామని.. కానీ.. మాయమైందని వ్యాఖ్యానించారు. దీనిపై కేసు నమోదు చేశామని.. పాత దొంగలే ఇలా చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నామన్నారు.
ఇలా.. ఓవైపు పోలీసులు, రెవెన్యూ వర్గాలు.. వ్యవహరిస్తుంటే.. ప్రభుత్వం మాత్రం తక్కువ తిందా? అన్నట్టుగా మేఘాలయ ప్రభుత్వం తాజాగా 4 వేల టన్నుల బొగ్గు.. కుంభకోణంపై కోర్టుకు ఆసక్తికర అఫిడవిట్ దాఖలు చేసింది. మేఘాలయలో బొగ్గుకుంభకోణం వ్యవహారం.. గత ఆరుమాసాల నుంచి దుమారం రేపుతోంది. అధికార పార్టీ మంత్రి, ఎమ్మెల్యే ఈ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దీనిపై హైకోర్టు సుమోటోగా విచారణ చేస్తోంది. ఈ క్రమంలో తాజాగా హైకోర్టుకు మంత్రి కైర్ మెన్ షిల్లా అఫిడవిట్ దాఖలు చేశారు.
దీనిలో ఆయన.. ''నిజమే. 4 వేల టన్నుల బొగ్గు మాయమైంది. ఇది కుంభకోణం కాదు. రాష్ట్రంలో వరదలు, వర్షాలు రావడంతో అవి బొగ్గును నంజేసుకున్నాయి. దీనిలో ప్రభుత్వ పాత్ర కానీ.. వ్యక్తుల పాత్ర కానీ.. లేదు. ప్రకృతి చేసిన బీభత్సానికి ప్రకృతి సంపద హరించుకుపోయింది. భవిష్యత్తులో ఇలాంటివి జరగ కుండా చూస్తాం'' అని వివరించారు. ఇదే విషయాన్ని నిర్భయంగా.. మీడియా ముందు కూడా ఆయన చెప్పుకొచ్చారు. దీంతో హైకోర్టు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. విచారణను వాయిదా వేసింది. ఇదీ.. మన దేశంలో సంగతి!!.