చైనా-భారత్‌ సంబంధాల్లో కొత్త పరిణామాలు!

ఈ క్రమంలో చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌యీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఆయన భారత విదేశాంగ మంత్రి ఎస్‌. జైశంకర్‌తో సమావేశమై పలు కీలక అంశాలపై చర్చించారు.;

Update: 2025-08-19 11:58 GMT

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రారంభించిన వాణిజ్యయుద్ధం ప్రభావంతో భౌగోళిక రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఈ పరిణామాల మధ్య న్యూదిల్లీ–బీజింగ్‌ సంబంధాలు కొత్త మలుపు తిరుగుతున్నాయి. ఇరుదేశాల మధ్య ఉన్న వైరాన్ని పక్కనబెట్టి, పరస్పర సమస్యల పరిష్కారంపై దృష్టిపెట్టే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి.

ఈ క్రమంలో చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌యీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఆయన భారత విదేశాంగ మంత్రి ఎస్‌. జైశంకర్‌తో సమావేశమై పలు కీలక అంశాలపై చర్చించారు. భారత్‌కు అత్యవసరంగా కావలసిన ఎరువులు, టన్నెల్‌ బోరింగ్‌ యంత్ర పరికరాలు (TBM), రేర్‌ఎర్త్‌ ఖనిజాల సరఫరాకు చైనా అంగీకరించడం ఈ భేటీ ముఖ్యఫలితంగా నిలిచింది.

-ఎరువుల సరఫరాలో చైనాపై ఆధారపడుతున్న భారత్‌

గత కొన్ని నెలలుగా భారత్‌కు చైనా ప్రత్యేక ఎరువుల ఎగుమతులను నిలిపివేసింది. అయితే ఇతర దేశాలకు మాత్రం అవే ఎరువులను సరఫరా చేయడం గమనార్హం. పండ్లు, కూరగాయలు, ధాన్య పంటల దిగుబడిని పెంచడంలో ఈ ఎరువులు కీలక పాత్ర పోషిస్తాయి. వీటి ఉత్పత్తి సామర్థ్యం భారత్‌లో పరిమితంగానే ఉండటం వల్ల 80 శాతం అవసరాలను చైనాపైనే ఆధారపడాల్సి వస్తోంది.

2023లో భారత్‌కు రావాల్సిన యూరియాను కూడా చైనాకు చెందిన రెండు పెద్ద కంపెనీలు నిలిపివేశాయి. దీంతో రైతాంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది. తాజాగా వాంగ్‌యీ పర్యటనలో ఎరువుల సరఫరా సమస్యపై జైశంకర్‌ ప్రస్తావించగా, చైనా ప్రభుత్వం సహకరించేందుకు సిద్ధమని తెలిపింది.

- తైవాన్‌పై భారత వైఖరి స్పష్టత

తైవాన్‌ విషయంలో భారత వైఖరిలో ఎలాంటి మార్పు లేదని జైశంకర్‌ స్పష్టం చేశారు. తైపీలో భారత ప్రతినిధులు కేవలం ఆర్థిక, సాంస్కృతిక సంబంధాల కోసం మాత్రమే ఉన్నారని ఆయన వాంగ్‌యీకి వివరించారు.

- రాబోయే సమావేశాల ప్రాధాన్యత

నేడు సరిహద్దు సమస్యలపై ప్రత్యేక ప్రతినిధుల 24వ సమావేశం జరుగనుంది. జాతీయ భద్రతా సలహాదారు అజీత్‌ డోభాల్‌తో వాంగ్‌యీ ఉదయం 11 గంటలకు భేటీ అయ్యారు.. ఈరోజు సాయంత్రం ప్రధాని నరేంద్ర మోదీతో కూడా ఆయన సమావేశమవుతారు.

- ద్వైపాక్షిక సంబంధాలకు ఊపు

ఇరుదేశాల మధ్య ఏర్పడిన కొత్త అవగాహన ఒప్పందాలు, గత చర్చల్లో తీసుకున్న నిర్ణయాలను అమలు చేయడమే వాంగ్‌యీ పర్యటన ప్రధాన ఉద్దేశమని చైనా వెల్లడించింది. ముఖ్యంగా ఎరువులు, రేర్‌ఎర్త్‌ మినరల్స్‌ వంటి కీలక వనరుల సరఫరా పునరుద్ధరణతో భారత్–చైనా సంబంధాలు మళ్లీ సాధారణ స్థితికి చేరుకోవచ్చనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి.

Tags:    

Similar News