చైనా చెమటలు పట్టించే ప్లాన్.. సైబీరియా మంచులో భారత్ 'రేర్' వేట

ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో రష్యాపై అమెరికా సహా పాశ్చాత్య దేశాలు కఠినమైన ఆంక్షలు విధించాయి.

Update: 2026-06-16 22:30 GMT

ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ, గ్రీన్ ఎనర్జీ రంగాలు శరవేగంగా దూసుకుపోతున్నాయి. ఎలక్ట్రిక్ వాహనాలు , అత్యాధునిక రక్షణ వ్యవస్థలు, సెల్‌ఫోన్లు, విండ్ టర్బైన్లు... ఇలా దేనికైనా ఇప్పుడు అత్యంత కీలకంగా మారినవి రేర్ ఎర్త్ ఖనిజాలు. ఇప్పటివరకు ఈ ఖనిజాల మార్కెట్‌ను తన గుప్పిట్లో పెట్టుకుని ప్రపంచాన్ని శాసించిన చైనాకు, ఇప్పుడు భారత్ గట్టి పోటీ ఇచ్చేందుకు సిద్ధమైంది. రష్యాలోని సైబీరియా మంచు కొండల్లో దాగి ఉన్న ప్రపంచ ప్రఖ్యాత "టామ్‌టర్" నిక్షేపాలపై భారత్ కన్నేయడమే దీనికి ప్రధాన కారణం.

భారత ప్రభుత్వ రంగ సంస్థ ఐఆర్ఈఎల్ (ఇండియా రేర్ ఎర్త్స్ లిమిటెడ్), రష్యాకు చెందిన ఇంధన దిగ్గజం రోస్నెఫ్ట్ తో ఈ నిక్షేపాల విషయమై కీలక చర్చలు జరుపుతున్నట్లు అంతర్జాతీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. ప్రస్తుతం ఇది కేవలం శాంపిల్స్ సేకరించే ప్రక్రియే అని అధికారులు పైకి చెబుతున్నప్పటికీ దీని వెనుక ఉన్న వ్యూహాత్మక ప్రాధాన్యత చైనాకు ముచ్చెమటలు పట్టిస్తోంది.

చైనా 'సూపర్ స్టార్' ఇమేజ్‌కు బ్రేక్?

ప్రస్తుతం గ్లోబల్ రేర్ ఎర్త్ మార్కెట్‌లో చైనా ఆధిపత్యం దాదాపు 70% పైనే ఉంది. మిగిలిన దేశాలు టెక్నాలజీ కోసం చైనా వైపే చూడాల్సిన పరిస్థితి. అయితే ఈ రంగంలో భారత్ కేవలం ఒక దేశంగా కాకుండా గ్లోబల్ లీడర్‌గా ఎదగాలని గట్టి ప్లాన్ వేసింది.

ట్విస్ట్ ఏంటంటే... భారతదేశంలోనే ప్రపంచంలోనే మూడో అతిపెద్ద రేర్ ఎర్త్ నిల్వలు ఉన్నాయి. కానీ వాటిని మైనింగ్ చేసి పూర్తిగా శుద్ధి చేసి, అధునాతన మాగ్నెట్లుగా మార్చే 'ప్రాసెసింగ్ సాంకేతికత' మన దేశంలో ఇంకా పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాలేదు. అంటే ఇంట్లో బియ్యం ఉన్నా వండే నైపుణ్యం ఉన్న చెఫ్ కోసం వెతుకుతున్న చందంగా మారింది మన పరిస్థితి.

భారత్ గ్లోబల్ స్కెచ్.. మల్టీ-నేషన్ ప్లాన్

ఈ సాంకేతిక లోటును భర్తీ చేయడానికి భారత్ డబుల్ గేమ్ ఆడుతోంది. ఒకవైపు రష్యా నుంచి ముడి ఖనిజాన్ని సేకరిస్తూనే.. మరోవైపు ఆ ఖనిజాలను శుద్ధి చేసే అధునాతన సాంకేతికత కోసం జపాన్, దక్షిణ కొరియా వంటి దేశాల కంపెనీలతో చేతులు కలిపేందుకు చర్చలు జరుపుతోంది. భారత్ వ్యూహం కేవలం రష్యాతోనే ఆగలేదు. చైనాపై ఆధారపడటాన్ని పూర్తిగా తగ్గించుకోవడానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న అవకాశాలను అందిపుచ్చుకుంటోంది. ఆస్ట్రేలియాతో కీలక ఖనిజాల సరఫరా ఒప్పందాలు... అర్జెంటీనాలో లిథియం మైనింగ్ కోసం అడుగులు... ఆఫ్రికన్ దేశమైన మలావిలో ఖనిజ అన్వేషణ.

భౌగోళిక రాజకీయాల కొత్త మలుపు

ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో రష్యాపై అమెరికా సహా పాశ్చాత్య దేశాలు కఠినమైన ఆంక్షలు విధించాయి. ఇలాంటి ఉద్రిక్త సమయాల్లో భారత్ నేరుగా రష్యాతో రేర్ ఎర్త్ ఒప్పందాల వైపు అడుగులు వేయడం అంతర్జాతీయంగా తీవ్ర చర్చనీయాంశమైంది. వాషింగ్టన్ ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తూ కనుబొమ్మలు ఎగరేస్తుంటే ఆంక్షల నడుమ భారత్ వంటి నమ్మకమైన భాగస్వామి దొరకడంతో రష్యా సంతోషం వ్యక్తం చేస్తోంది.

సైబీరియాలోని -50 డిగ్రీల గడ్డకట్టే చలిలో భారత్ ప్రారంభించిన ఈ రేర్ ఎర్త్ వేట కేవలం సాధారణ మైనింగ్ ప్రాజెక్ట్ కాదు. ఇది భవిష్యత్తు గ్రీన్ ఎనర్జీ, ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ మరియు రక్షణ రంగ సమీకరణాలను మార్చేయగల గేమ్ ఛేంజర్. రేర్ ఎర్త్ విభాగంలో భారత్ ఇక ఎంతమాత్రం 'రేర్ ప్లేయర్' కాదు.. చైనాకు సవాల్ విసిరే అత్యంత 'సీరియస్ ప్లేయర్' అని ప్రపంచానికి స్పష్టమైన సంకేతాలు వెళ్లాయి.

Tags:    

Similar News