కొత్త మిత్రుల కోసం ఇండియా కూటమి ఫోకస్ !

కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే ప్రభుత్వాన్ని ధీటుగా ఎదుర్కొనేందుకు ఇండియా కూటమి సర్వ శక్తులూ ఒడ్డుతోంది.

Update: 2026-06-19 06:24 GMT

కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే ప్రభుత్వాన్ని ధీటుగా ఎదుర్కొనేందుకు ఇండియా కూటమి సర్వ శక్తులూ ఒడ్డుతోంది. సరికొత్త వ్యూహ రచన కూడా చేస్తోంది. ఈ క్రమంలో ఇండియా కూటమి తనకు ఉన్న బలాలను బలగాలను కూడా సరి చూసుకుంటూ ఎన్డీయే మీద సమరానికి తెర తీస్తోంది. ఇపుడు చూస్తే కనుక భారతీయ రాజకీయ ముఖ చిత్రంలో ఒక విచిత్రమైన సన్నివేశం కనిపిస్తుంది. ఉత్తర భారతం, దక్షిణ భారతంగా కచ్చితంగా ఒక రాజకీయ విభజన అయితే జరిగిపోయింది.

ఇండీకి బలం ఎక్కువ :

ఈ పరిణామాల నేపధ్యం చూస్తే కనుక ఇండియా కూటమికి దక్షిణాదిన బలం ఇపుడు అత్యధికంగా కనిపిస్తోంది. దక్షిణ భారత దేశంలో మొత్తం 129 ఎంపీ సీట్లు ఉన్నాయి. ఇందులో 104 ఎంపీ సీట్లు ఇండీ కూటమి ప్రభావిత రాష్ట్రాలలోనే ఉండడం విశేషం. తెలంగాణాలో 17, కర్ణాటకలో 28, తమిళనాడులో 39, కేరళలో 20 సీట్లు ఉన్న చోట ఇండియా కూటమి అధికారంలో ఉంది. 25 సీట్లు ఉన్న ఏపీలోనే ఎన్డీయే పవర్ చలాయిస్తోంది. దీంతో దక్షిణాదిన తమ బలాన్ని పూర్తిగా పెంచుకునే పనిలో ఇండియా కూటమి పడింది.

హైదరాబాద్ వేదికగా :

ఇక ఇండియా కూటమిని మరింతగా బలోపేతం చేయాలని కాంగ్రెస్ భావిస్తోంది. కొత్త మిత్రులను కలుపుకోవాలని కూడా చూస్తోంది. దీని కోసం తమ ముఖ్యమంత్రులను సీనియర్ నేతలను రంగంలోకి దించుతోంది. 2029 నాటికి కేంద్రంలో అధికారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ చేపట్టాలన్నది కాంగ్రెస్ పంతంగా ఉంది. అలాగే ఇండియా కూటమి పార్టీలు సైతం దీనిని ఒక పట్టుదలగా తీసుకున్నాయి. ఈ క్రమంలో తమకు బలమున్న దక్షిణాదిన కీలక రాజకీయ కేంద్రంగా ఉన్న తెలంగాణాలో హైదరాబాద్ నడిబొడ్డున ఇండియా కూటమి సమావేశాన్ని నిర్వహించాలని చూస్తున్నారు.

ప్రతీ రెండు నెలలకూ :

ఇక జూన్ 8న ఢిల్లీ వేదికగా ఇండియా కూటమి సమావేశం జరిగింది. చాలా కాలం తరువాత ఈ మీటింగ్ నిర్వహించారు. దీంతో కాంగ్రెస్ సహా మిత్ర పార్టీలు ఒక నిర్ణయం తీసుకున్నాయి. ఇక మీదట ఇంత లాంగ్ గ్యాప్ లేకుండా క్రమం తప్పకుండా ప్రతీ రెండు నెలలకు ఒకసారి ఇండియా కూటమి పార్టీలతో సమావేశం నిర్వహించాలని తీర్మానించారు. ఈ లెక్కన ఆగస్టు 8న హైదరాబాద్ లో ఇండియా కూటమి సమావేశం అవుతోంది. ఈ సమావేశంలో అనేక అంశాలను చర్చిస్తారు అని అంటున్నారు.

ఉత్తరాదిన సైతం :

ఇక ఉత్తరప్రదేశ్, పంజాబ్, గుజరాత్ లతో పాటు మరి కొన్ని ఇతర రాష్ట్రాలకు 2027లో ఎన్నికలు జరగబోతున్నాయి. దాంతో ఈ రాష్ట్రాలలో గెలుపు పరమావధిగా కలసికట్టుగా పనిచేయాలని కూడా కాంగ్రెస్ మిత్ర పక్షాలు ఆలోచన చేస్తున్నాయి. యూపీలో రెండు సార్లు బీజేపీ గెలిచింది. తొలిసారి కంటే మలి సారి ఒక యాభైకి పైగా సీట్లు తగ్గిపోయాయి. ఈసారి మరింతగా యాంటీ ఇంకెంబెన్సీ ఉండొచ్చు అని ఇండియా కూటమి భావిస్తోంది. ఈ ప్రభావం 2024 ఎంపీ ఎన్నికల్లో స్పష్టంగా కనిపించింది అని కూడా అంటున్నారు. పంజాబ్ లో కూడా కాంగ్రెస్ బలంగా ఉంది. ఆప్ అధికారంలో ఉంది, బీజేపీ మిత్ర పక్షం అకాళీదళ్ బలహీనం కావడం కమలానికి కలిసిరావడంలేదు, ఇక ఉత్తరాఖండ్ వంటి రాష్ట్రాలలో సైతం యూపీ రాజకీయ ప్రభావం ఉంటుందని చెబుతున్నారు. మొత్తం మీద చూస్తే ఉత్తరాదిన యూపీ నుంచే పట్టు సాధించడం మొదలుపెడితే 2029 ఎన్నికల నాటికి అది ఫలించి కేంద్రంలో అధికారం అందచేస్తుంది అన్న లెక్కలు కూడా ఇండియా కూటమికి ఉన్నాయి. దాంతో సౌత్ ఫోకస్ ని కూడా మరింతగా ఇండియా కూటమి పెంచుతోంది.

Tags:    

Similar News