ట్యూన్ కాపీ కొట్టాలంటే దడ పుట్టడం ఖాయం
నువ్వు తప్పు చేసావు? అని ప్రశ్నించకపోతే ఆ తప్పు ఎప్పటికీ మరిన్ని తప్పులు చేయడానికి దారి చూపుతుంది.;
నువ్వు తప్పు చేసావు? అని ప్రశ్నించకపోతే ఆ తప్పు ఎప్పటికీ మరిన్ని తప్పులు చేయడానికి దారి చూపుతుంది. ఒక అబద్ధం నుంచి ఇంకో అబద్ధం పుట్టుకొచ్చినట్టు, ఒక తప్పు నుంచి ఇంకో తప్పు పుట్టుకొస్తూనే ఉంటుంది. అవినీతికి అలవాటు పడిన అధికారి దానికి వదులుకోవడం ఎలా సాధ్యం కాదో, కాపీ క్యాట్ సంగీతంతో ఇండస్ట్రీలో తోపులం అని చెప్పుకునేవాళ్లు తమ ప్రవృత్తిని వదులుకోవడం కూడా అంతే కష్టం.
ఈ సంగీతం ఎక్కడో విన్నట్టుందే! అని ఆడియెన్ మైండ్ లో సందేహం అలానే ఉంటుంది. కాపీ క్యాట్ సంగీత దర్శకులు వంట సరుకుల్ని ఇతరుల నుంచి ఎలా ఏరుకుంటారో ఓసారి సంగీత దర్శకుడు ఇళయరాజా హైదరాబాద్ ప్రసాద్ లాబ్స్ లో జరిగిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. ముడి పదార్థాలన్నీ ఎక్కడి నుంచో ఏరుకుంటారు! అని సూటిగా ఆయన ఇతర సంగీత దర్శకుల అలవాటును విమర్శించారు.
అంత పెద్ద సంగీత దిగ్గజం ఆ మాటను ఎందుకు అన్నారో ఆరోజు హైదరాబాద్ ఫిలింజర్నలిస్టులకు అంతగా అర్థం కాకపోయి ఉండొచ్చు కానీ, ఇప్పుడు దీనిపై అందరికీ చాలా క్లారిటీ వస్తోంది. ప్రతి రోజూ ప్రతి సినిమాలో ఏదో ఒక చోట ఎక్కడో వినేసినట్టుందే అనిపించే సంగీతం వినాల్సిన దౌర్భాగ్యం ప్రజలకు పట్టుకుంది.
అందుకే ఇప్పుడు ఇళయరాజా తన ట్యూన్లను కాపీ కొట్టిన వారిని వెంటాడి కోర్టు కేసులతో ముకుతాడు వేస్తుంటే, తనకు దక్కాల్సిన రాయల్టీలను దర్జాగా పిండుకుంటుంటే, అది ఇతరులకు పెద్ద కనువిప్పుగా మారుతోంది. చాలా మంది దిగ్గజ సంగీత దర్శకులు ఉన్నా, వారంతా చేయలేనిది ఒక్క రాజా మాత్రమే చేయగలుగుతున్నారు. మునుముందు ఎవరైనా కాపీ ట్యూన్లు ఉపయోగించాలంటే భయపడేలా, ఇటీవల ఇళయరాజా కోర్టు విజయాలు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. ఒక కేసులో కాపీ క్యాట్ ట్యూన్ ఉపయోగించినందుకు 60లక్షలు వసూలు చేసారు ఇళయరాజా. మరో రెండు కేసులలో 50లక్షలు చొప్పన కోటి పరిహారం అందుకున్నారు. కాపీ చేసారు అని నిరూపిస్తూ, కోర్టులో ఇళయరాజా ఫైట్ చేస్తున్న తీరుకు ప్రత్యర్థులు తలొంచారు. ఆయనకు రాయల్టీలు చెల్లించి సారీ చెప్పి మరీ తమ ఓటమిని అంగీకరిస్తున్నారు.
ఇళయరాజా ట్యూన్లు ఎవరు కాపీ కొట్టారు? అనే దానికంటే, ఆయన ట్యూన్లను కాపీ కొడితే ఏం జరుగుతుందో ఇప్పుడు ప్రపంచానికి బాగా అవగాహన వచ్చింది. ఆయన తన హక్కులను కాపాడుకోవడానికి, తనకు దక్కాల్సిన రాయల్టీలను రాబట్టుకోవడానికి ఎంత నిర్మొహమాటంగా ఉంటారో గడిచిన ఉదంతాలు నిరూపించాయి. ఇకపై ఇళయరాజా క్లాసిక్స్ నుంచి ఏ ఒక్కరూ కాపీ చేసి ట్యూన్ ని ఉపయోగించలేరు. ఒకవేళ ఇదంతా తెలిసి కూడా కాపీ చేస్తే, కచ్ఛితంగా ఆ వ్యక్తి కూడా కేసులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఇళయరాజాకు రాయల్టీలు చెల్లించుకోవాల్సిందే.
దాదాపు 1000 పైగా సినిమాలకు ఇళయరాజా సంగీతం అందించారు అంటే ఆయన బుర్ర ఎంత గొప్పగా పని చేస్తోందో ఇప్పటికైనా అర్థం చేసుకోవాలి. మంజుమ్మల్ బోయ్స్, గుడ్ బ్యాడ్ అగ్లీ, డూడ్ చిత్ర నిర్మాతల నుంచి ఇళయరాజా భారీగానే వసూలు చేసాడు. అతడు తన పంతాన్ని నెగ్గించుకోవడం చూస్తుంటే, కాపీ కొట్టే సంగీత దర్శకులను ఇప్పట్లో బొమ్మాళీ వదలదని అర్థం చేసుకోవాలి.