‘ఏక్ నిరంజన్’ అంటూ పోలీసులకు సర్ ప్రైజ్ చేసిన ఐబొమ్మ రవి

ఐదు రోజుల పోలీసుల కస్టడీలో భాగంగా తొలిరోజున అతడ్ని విచారించిన పోలీసులకు తాను ఒంటరినని.. ‘మీ ఇష్టం వచ్చింది చేసుకోండి.;

Update: 2025-11-21 03:56 GMT

నేరారోపణలు ఎదుర్కొంటున్న నిందితులు పోలీసు విచారణను ఎదుర్కొనే వేళలో ఏం చేస్తారు? తాము చేసిన నేరాల్ని ఇట్టే ఒప్పేసుకుంటారా? పోలసీులు అడిగిన ప్రశ్నలకు స్పందించే తీరు ఎలా ఉంటుంది? అన్న ప్రశ్నలకు వచ్చే సాధారణ సమాధానాలకు భిన్నంగా వ్యవహరించిన పోలీసులను సర్ ప్రైజ్ చేశాడు ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి. సాధారణంగా సంచలన కేసుల్లో.. అందునా సాంకేతికత ఎక్కువగా ఉన్న అంశాలకు సంబంధించిన కేసుల్లో పోలీసులకు అర్థంకానట్లు చిత్రవిచిత్రంగా వ్యవహరిస్తుంటారు. కానీ.. ఐ బొమ్మనిర్వాహకుడు మాత్రం చాలా క్లారిటీగా.. క్లియర్ గా తాను చెప్పాల్సిన విషయాన్ని చెప్పటంతో పాటు.. తనది ఒంటరిజీవితమని.. తాను ఏక్ నిరంజన్ అంటూ చెప్పేసినట్లుగా తెలుస్తోంది.

ఐదు రోజుల పోలీసుల కస్టడీలో భాగంగా తొలిరోజున అతడ్ని విచారించిన పోలీసులకు తాను ఒంటరినని.. ‘మీ ఇష్టం వచ్చింది చేసుకోండి. నన్ను పట్టించుకునే వారు ఎవరూ లేరు. నేనెవరినీ మోసం చేయలేదు. సినిమాల్ని పైరసీ చేయలేదు. అక్రమంగా ప్రజల సొమ్మును దోచుకోలేదు’’ అని చెప్పినట్లుగా తెలుస్తోంది. అంతేకాదు.. పోలీసులు అడిగిన ప్రశ్నలకు చాలావరకు స్పష్టమైన సమాధానాలు చెప్పిన రవి.. కొన్ని ప్రశ్నలకు మాత్రం స్పందించలేదని చెబుతున్నారు.

టెక్నాలజీకి సంబంధించిన అంశాల్నిపోలీసులు అడిగినప్పుడు.. వారికి వివరంగా వివరించటమేకాదు.. విడుదలైన సినిమాను ఎలా డౌన్ లోడ్ చేసేది.. ఎలా హ్యాక్ చేసేది.. అనంతరం ఎలా అప్ లోడ్ చేసేది లాంటి వివరాల్ని వెల్లడించినట్లు తెలుస్తోంది. పోలీసు అధికారులకు పూర్తిగా సహకరించిన రవి.. నాకు తెలీదు.. చెప్పను లాంటి రోటీన్ డైలాగులకు దూరంగా ఉన్నట్లు సమాచారం.

ఐబొమ్మను ఎలా నిర్వాహిస్తారు? అందుకు వినియోగించే సాంకేతికత.. పిక్చర్ క్వాలిటీ పెంచేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? టెక్నికల్ సమస్యలు ఎదురైతే ఎలా అధిగమిస్తారు? లాంటిప్రశ్నలకు సమాధానాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు రవి 20 వేలకు పైగా సినిమాల్ని పైరసీ చేసినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. విదేశాల్లోని సర్వర్లు.. వాటి నిర్వహణ ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు అదరకుండా.. బెదరకుండా సమాధానాలు ఇచ్చినట్లుగా సమాచారం.

ఇదిలా ఉంటే.. అతడి తరఫు వాదనలు వినిపించేందుకు పలువురు న్యాయవాదులు ప్రయత్నించినా.. వారికి అందుబాటులోకి రవి రావట్లేదని తెలుస్తోంది. తన స్నేహితుడి సలహా ప్రకారం నిర్ణయం తీసుకుంటారని చెబుతున్నారు. సినిమా విడుదలకు ముందు క్యూబ్ ను ఎలా హ్యాక్ చేయొచ్చు? లాంటి అంశాలకు సైతం రవి సమాధానాలు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. మొదటి రోజు కస్టడీకి తీసుకొని విచారణ చేపట్టినప్పటికీ.. ఎక్కువ భాగం టెక్నికల్ అంశాలే వచ్చాయని తెలుస్తోంది. మిగిలిన నాలుగు రోజుల విచారణలో మరిన్ని విషయాలు తెలిసే వీలుందని చెబుతున్నారు.

Tags:    

Similar News