సాఫ్ట్ రోబోటిక్స్ సంచలనం.. ఇది కన్ను కాదు అంతకు మించి!
అవును... జార్జియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పరిశోధకులు హైడ్రోజెల్ తో తయారుచేసిన మెత్తటి లెన్స్ ను సృష్టించారు. దీనికి బయటి ఎలక్ట్రిక్ వనరులు పనిచేయాల్సిన అవసరం లేదు.;
రోబోటిక్స్ రంగమందు సాఫ్ట్ రోబోటిక్స్ రంగం వేరయా అంటారు! లోహంతో నిర్మించిన సాంప్రదాయ రోబోట్ లలోలా ప్రామాణికమైన ఎలక్ట్రానిక్ భాగాలను కలిగి ఉండని ఈ సాఫ్ట్ రోబోటిక్స్.. ఎలాస్టిక్, సిలికాన్ రబ్బర్ లేదా జెల్ వంటి పదార్ధాలతో చేసిన రోబోట్ లను సృష్టిస్తోంది. ఈ క్రమంలో తాజాగా ఓ కొత్త ఆవిష్కరణ తెరపైకి వచ్చింది. అదే రోబోటిక్ 'కన్ను'. ఇది కన్ను కాదు అంతకు మించి!
అవును... జార్జియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పరిశోధకులు హైడ్రోజెల్ తో తయారుచేసిన మెత్తటి లెన్స్ ను సృష్టించారు. దీనికి బయటి ఎలక్ట్రిక్ వనరులు పనిచేయాల్సిన అవసరం లేదు. ఈ రోబోటిక్స్ లెన్స్ చాలా మంచి దృష్టిని కలిగి ఉంది.. అది ఎంతలా అంటే.. చీమల కాలూ మీద ఉండే వెంట్రుకల వంటి సూక్ష్మాతి సూక్షమైన వివరాలను కూడా చూడగలిగేటంత అని చెబుతున్నారు.
ఈ కన్ను కోసం ఉపయోగించే లెన్స్ రకం సరికొత్తది కాగా.. దీనిని పరిశోధకులు ఫోటోరెస్పాన్సివ్ హైడ్రోజెల్ సాఫ్ట్ లెన్స్ (పీ.హెచ్.వై.ఎస్.ఎల్) అని పిలుస్తారు. ఈ ఏడాది అక్టోబర్ లో సైన్స్ రోబోటిక్స్ జర్నల్ లో "బయో ఇన్ స్పైర్డ్ ఫోటోరెస్పాన్సివ్ సాఫ్ట్ రోబోటిక్ లెన్స్" అనే శీర్షికతో దీని పరిశోధనలు ప్రచురించబడ్డాయి. దీంతో.. భవిష్యత్తుకు ఇది ఒక ఆశాజనకమైన ఆవిష్కరణ అని పరిశోధకులు విశ్వసిస్తున్నారు.
ఈ సందర్భంగా... వచ్చే కాంతి ఆధారంగా పీ.హెచ్.వై.ఎస్.ఎల్ దాని దృష్టిని మార్చుకోగలదని అంటున్నారు. ఈ ఆవిష్కరణను సృష్టించడానికి పరిశోధన బృందం.. సిలికాన్ పాలిమర్ లెన్స్ చుట్టూ ఒక హైడ్రోజెల్ వలయాన్ని సృష్టించింది. ఈ హైడ్రోజెల్ లోపల ఉన్న గ్రాఫేన్ ఆక్సైడ్, కాంతిని గ్రహిస్తుంది. ఇది లెన్స్ సంకోచించడానికి లేదా వ్యాకోచించడానికి అనుమతిస్తుంది. ఇలా చేయడం వల్ల చిన్న వివరాలను స్పష్టతతో చూడటానికి సహకరిస్తుంది.
ఈ నేపథ్యంలో ఇలాంటి శక్తివంతమైన లెన్స్ కోసం సాఫ్ట్ రోబోటిక్స్ ఫీల్ద్ బహుళ ప్రయోజనాలను కలిగి ఉండవచ్చని అంటున్నారు. వాస్తవానికి సాఫ్ట్ రోబోటిక్స్ ఇప్పటికే వైద్య రంగంలో ఫిజికల్ థెరపీ, సర్జరీలకు సహాయపడతాయి. లెన్స్ మెత్తటి స్వాభావం సర్జన్లకు ఉపయోగపడుతుందని.. దీని ఆల్ట్రా డిటైల్డ్ విజన్ అత్యంత సంక్లిష్టమైన విధానాలకు సహాయపడుతుందని చెబుతున్నారు.