వాడేసిన నూనె లీటరు రూ.65 కొంటారు.. ఎవరు? ఏం చేస్తారు?

చాలామంది పెద్దగా పట్టించుకోని అంశం.. ఆరోగ్యానికి చేటు కలిగించేది బాగా మరిగించిన వంట నూనెను అస్సలు వాడకూడదు.;

Update: 2025-10-27 07:19 GMT

చాలామంది పెద్దగా పట్టించుకోని అంశం.. ఆరోగ్యానికి చేటు కలిగించేది బాగా మరిగించిన వంట నూనెను అస్సలు వాడకూడదు. కానీ.. పొదుపు చర్యల్లో భాగంగా ఇలాంటివి పట్టించుకోకుండా ఆ నూనెల్ని వంటలకు వాడేస్తుంటారు. ఇంటి వరకు ఒకలాంటి పరిస్థితి అయితే.. హోటళ్లు.. రెస్టారెంట్లలో మాత్రం నిత్యం భారీగా ఈ వంట నూనె ఉంటుంది. కొందరు హోటళ్ల వ్యాపారులు తమ కస్టమర్లకు జరిగే హాని గురించి పట్టించుకోకుండా వాడిన నూనెల్ని వాడేస్తుంటారు. అందుకు భిన్నంగా కొందరు మాత్రం.. ఒకసారి మరిగించిన నూనెల్ని తిరిగి వాడకుండా వాటిని పక్కన పెట్టేస్తుంటారు. నాణ్యతకు.. ఆరోగ్యానికి పెద్దపీట వేస్తుంటారు.

అయితే.. ఇలా వేడి చేసిన వంట నూనెల్ని వేస్టుగా డ్రైనేజీలో కలపాల్సిన అవసరం లేదు. ఎందుకంటే.. ఇలా వాడేసిన వంట నూనెల్ని కొనేటోళ్లు ఉంటారు. వాటిని వాహనాలకు వాడే బయోడీజిల్ గా మార్చే వెసులుబాటు ఉంది. భారత ఆహార భద్రత.. ప్రమాణాల సంస్థ అదేనండి ఎఫ్ఎస్ఎస్ఏఐ సంస్థ ఇలా వాడేసిన వంటనూనెల్ని కొనుగోలు చేసి బయోడీజిల్ గా మార్చేస్తారు. ఒకసారి బాగా మరిగించిన నూనెను వంటకు వినియోగిస్తే క్యాన్సర్ తో పాటు బీపీ.. లివర్ సమస్యలు ఎదురవుతాయి.

అందుకే.. ఇలాంటి వాటిని నియంత్రించేందుకు రెస్టారెంట్లలో వాడిన నూనెల్ని సేకరించి బయోడీజిల్ గా మార్చే పనిని ఎఫ్ఎస్ఎస్ఏఐ చేపట్టింది. ప్రస్తుతం పదహారు రాష్ట్రాల్లో దీన్ని అమలు చేస్తున్నారు. వైద్య ఆరోగ్య శాఖ పరిధిలో ఆహార భద్రత తనిఖీ విభాగం.. జీహెచ్ఎంసీలు కలిసి హైదరాబాద్ నగర వ్యాప్తంగా 500 రెస్టారెంట్ల నుంచి వేలాది లీటర్ల వాడిన నూనెల్ని సేకరించి బయోడీజిల్ ప్లాంట్లకు తరలిస్తారు.

ఆసక్తికరమైన విషయం ఏమంటే వాడేసిన నూనెల్ని లీటరు రూ.65 చొప్పున చెల్లిస్తారు. కాకుంటే.. కనీసం 50లీటర్లు ఉంటే ఏజెన్సీలు తమ వ్యక్తుల్ని పంపి డబ్బులిచ్చి తీసుకెళుతుంటారు. ఈ కార్యక్రమంలో ఎవరైనా పాలు పంచుకోవాలంటే అందుకు జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులను సంప్రదించాల్సి ఉంటుంది. వాడేసిన వంటనూనెల్ని బయోడీజిల్ కు ఇచ్చేందుకు 8328378502లో సంప్రదిస్తే సరిపోతుందని చెబుతున్నారు.

Tags:    

Similar News