హైదరాబాద్‌లో ఆకాశ మార్గ రవాణా.. ట్రాఫిక్‌కు చెక్ పెట్టనున్న రోప్‌వే ప్రాజెక్ట్!

హైదరాబాద్ నగరంలో రోజురోజుకూ పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం ప్రభుత్వం కొత్త మార్గాలపై దృష్టి సారిస్తోంది.

Update: 2026-05-28 12:30 GMT

హైదరాబాద్ నగరంలో రోజురోజుకూ పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం ప్రభుత్వం కొత్త మార్గాలపై దృష్టి సారిస్తోంది. ఇప్పటికే మెట్రో విస్తరణ, ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌ల నిర్మాణంతో రద్దీ తగ్గించే ప్రయత్నాలు కొనసాగుతుండగా, ఇప్పుడు మరో వినూత్న ప్రణాళికను హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) సిద్ధం చేస్తోంది. దేశంలోనే ప్రజా రవాణా కోసం రోప్‌వే వ్యవస్థను ప్రవేశపెట్టిన తొలి నగరమైన వారణాసి మోడల్‌ను ఆదర్శంగా తీసుకుని హైదరాబాద్‌లో కూడా ఆకాశ మార్గ రవాణా వ్యవస్థను అమలు చేయాలని అధికారులు నిర్ణయించారు.

ఈ ప్రాజెక్ట్ అమలులోకి వస్తే నగర ప్రజలకు ట్రాఫిక్ రద్దీ, వర్షాకాల ఇబ్బందుల నుంచి ఉపశమనం లభించనుంది. ముఖ్యంగా పర్యాటక, చారిత్రక ప్రదేశాలను అనుసంధానం చేసేలా రోప్‌వే మార్గాలను ప్రతిపాదించారు. గోల్కొండ కోట నుంచి కుతుబ్ షాహీ టూంబ్స్ వరకు సుమారు 2 కిలోమీటర్ల మేర రోప్‌వే ఏర్పాటు చేయాలని, అనంతరం దానిని నెహ్రూ జూలాజికల్ పార్క్ వరకు సుమారు 6 కిలోమీటర్ల మేర విస్తరించాలని ప్రణాళిక సిద్ధమైంది. అలాగే ట్యాంక్‌బండ్ నుంచి సంజీవయ్య పార్క్ వరకు, రద్దీగా ఉండే ఐటీ కారిడార్ ప్రాంతాల్లో కూడా రోప్‌వే సేవలు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులు భావిస్తున్నారు.

ఈ రోప్‌వే వ్యవస్థ నగర రవాణాలో “లాస్ట్ మైల్ కనెక్టివిటీ”గా కీలక పాత్ర పోషించనుంది. మెట్రో స్టేషన్లు, రైల్వే స్టేషన్లు, వాణిజ్య కేంద్రాలు, పర్యాటక ప్రదేశాలను నేరుగా అనుసంధానం చేయడం ద్వారా ప్రయాణ సమయం గణనీయంగా తగ్గనుంది. ప్రస్తుతం ట్రాఫిక్ కారణంగా గంటసేపు పట్టే ప్రయాణాన్ని కొన్ని నిమిషాల్లో పూర్తి చేసే అవకాశం ఉంటుంది. వారణాసిలో రోప్‌వే సేవల ద్వారా ప్రయాణ సమయం భారీగా తగ్గిన నేపథ్యంలో హైదరాబాద్‌లో కూడా ఇదే తరహా ఫలితాలు వస్తాయని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

ఈ భారీ ప్రాజెక్టును పబ్లిక్-ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ (పీపీపీ) మోడల్‌లో అమలు చేయనున్నారు. దీంతో ప్రభుత్వంపై ఆర్థిక భారం తగ్గనుంది. అయితే ప్రైవేట్ ఆస్తుల మీదుగా రోప్‌వే మార్గాలు వెళ్లే సందర్భంలో భూస్వాములకు పరిహారం చెల్లించే విధానంలో మార్పులు అవసరమని అధికారులు సూచిస్తున్నారు. ఇప్పటికే ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా , రక్షణ శాఖ అనుమతుల కోసం చర్యలు కొనసాగుతున్నాయి.

రోప్‌వే ప్రాజెక్ట్ కేవలం ట్రాఫిక్ సమస్య పరిష్కారానికే కాకుండా పర్యాటక రంగానికి కూడా కొత్త ఊపునివ్వనుంది. గోల్కొండ కోట, కుతుబ్ షాహీ టూంబ్స్, జూ పార్క్ వంటి ప్రదేశాలను ఆకాశ మార్గంలో వీక్షించే అవకాశం పర్యాటకులకు ప్రత్యేక అనుభూతిని కలిగించనుంది. అంతర్జాతీయ భద్రతా ప్రమాణాలతో పాటు సామాన్యులకు అందుబాటు ధరల్లో టిక్కెట్లు అందించేందుకు ప్రభుత్వం యోచిస్తోంది.

యూనిఫైడ్ మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ ఆధ్వర్యంలో ఈ ప్రాజెక్టు అమలు కానుంది. త్వరలో డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ సిద్ధం చేసి అమలు దశకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టనుంది. ఈ ప్రాజెక్టు విజయవంతమైతే హైదరాబాద్ దేశంలోనే ఆధునిక ఆకాశ రవాణా సదుపాయాలు కలిగిన అగ్రగామి నగరంగా నిలిచే అవకాశముందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Tags:    

Similar News