పట్టించింది భార్య కాదు.. ఐబొమ్మ రవి ఎలా దొరికాడంటే?

పోలీసుల దర్యాప్తులో ఈ పైరసీ సామ్రాజ్యం పనిచేసే విధానం బయటపడింది. ఐబొమ్మ డొమైన్‌ను Njila అనే కంపెనీలో రిజిస్టర్ చేసి, మరో దేశంలోని సర్వర్ ద్వారా హోస్ట్ చేస్తున్నాడు.;

Update: 2025-11-25 18:16 GMT

సైబర్ క్రైమ్ ప్రపంచంలో సంచలనం సృష్టించిన ఐబొమ్మ రవి అరెస్టుపై హైదరాబాద్ సీసీఎస్ (సీసీఎస్) పోలీసులు కీలక విషయాలను వెల్లడించారు. సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిన ప్రచారం “రవిని అతని భార్యే పట్టించింది” అన్నది పూర్తిగా అవాస్తవమని పోలీసులు ఖండించారు. అయితే ఇంత భారీ పైరసీ సామ్రాజ్యాన్ని నడిపిన రవిని పోలీసులు ఎలా పట్టుకోగలిగారు? అతని దర్యాప్తులో బయటపడిన సత్యాలు, ఆయన నడిపిన అక్రమ కార్యకలాపాల వివరాలు ఇక్కడ ఉన్నాయి.

* ఓవర్ కాన్ఫిడెన్స్‌ వల్లే దొరికాడు: అసలు ట్రాప్ ఇక్కడే!

అడిషనల్ సీపీ శ్రీనివాసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. రవి తన టెక్నాలజీ పరిజ్ఞానాన్ని దుర్వినియోగం చేసి 'ఈజీ మనీ' కోసం పైరసీని ఎంచుకున్నాడు. అయితే అతని అతి విశ్వాసం , ఆపరేషన్‌లో ఉన్న లూప్‌హోల్స్‌ వల్లే పోలీసులు అతనిని ట్రాక్ చేయగలిగారు.

* పోలీసులు అసలు క్లూను పట్టుకున్న విధానం:

భార్య సమాచారం ఇచ్చిందనేది అబద్ధం. స్నేహితుడు నిఖిల్ ద్వారానే రవిని ట్రాప్ చేశాం" అని అడిషనల్ సీపీ స్పష్టం చేశారు. ఐబొమ్మ, బప్పం సైట్ల కోసం సినిమా పోస్టర్లను రవి స్నేహితుడు నిఖిల్ తయారు చేసేవాడు. ఈ పోస్టర్ల తయారీ లింక్‌ను పట్టుకుని పోలీసులు నిఖిల్ వరకూ అక్కడి నుంచి నేరుగా రవి వరకూ దర్యాప్తును విస్తరించారు. సైట్‌ల అప్డేట్, పోస్టింగ్ విధానం నేరుగా రవితో ముడిపడి ఉంది.

* ₹100 కోట్ల పైరసీ ఆదాయం: డబ్బు మార్పిడి ఇలా

గత ఐదేళ్లలో పైరసీ, యాడ్స్ ద్వారా రవికి సుమారు ₹100 కోట్ల వరకు ఆదాయం వచ్చినట్లు పోలీసులు అంచనా వేశారు. ప్రధాన ఆదాయ వనరులు చూస్తే.. బెట్టింగ్ & గేమింగ్ యాప్‌ల ప్రమోషన్... యాడ్ రీడైరెక్ట్‌లు, యాడ్ నెట్‌వర్క్‌ల ద్వారా వచ్చేది. రవికి వచ్చిన డబ్బు క్రిప్టో రూపంలో యాడ్ క్యాష్, యాడ్ స్టార్ వంటి వివిధ నెట్‌వర్క్‌ల ద్వారా చేరేది. ఈ క్రిప్టో మొత్తాన్ని AdBull అనే తన సొంత కంపెనీకి మళ్లించేవాడు. రవి, అతని కుటుంబ సభ్యులు, స్నేహితుల ఖాతాల్లో ₹30 కోట్లకు పైగా లావాదేవీలు జరిగినట్లు పోలీసులు గుర్తించారు.

* ఐబొమ్మ ఆపరేషన్: దేశ, విదేశాల నెట్‌వర్క్

పోలీసుల దర్యాప్తులో ఈ పైరసీ సామ్రాజ్యం పనిచేసే విధానం బయటపడింది. ఐబొమ్మ డొమైన్‌ను Njila అనే కంపెనీలో రిజిస్టర్ చేసి, మరో దేశంలోని సర్వర్ ద్వారా హోస్ట్ చేస్తున్నాడు. కంటెంట్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (సీఎంఎస్) ద్వారా సినిమాలు అప్లోడ్ చేసి, వినియోగదారుడు సినిమా క్లిక్ చేయగానే అది మ్యాట్రిమోని, గేమింగ్, బెట్టింగ్ యాప్‌లకు రీడైరెక్ట్ అయ్యేలా కోడ్ చేశాడు. సుమారు 15కి పైగా యాడ్ నెట్‌వర్క్‌లు ఈ సైట్లకు కనెక్ట్ అయ్యాయి. రవి టెలిగ్రామ్ చానళ్ల ద్వారా సినిమాలకు సంబంధించిన హై రిజల్యూషన్ కాపీలు కొనుగోలు చేసి ఐబొమ్మ, బప్పం సైట్లలో విడుదల చేసేవాడు.

*దర్యాప్తు విస్తరణ: ఇంకా ఎవరెవరు?

ఐబొమ్మ రవి అరెస్టుతో ఈ పైరసీ నెట్‌వర్క్ అంతం కాలేదని పోలీసులు తెలిపారు. మూవీ రూల్జ్ , తమిల్ఎంవీ లాంటి మరిన్ని పైరసీ సైట్ల నిర్వాహకులపై దర్యాప్తు కొనసాగుతోంది. రవికి సహకరించిన టెక్నికల్ టీంలు, ఫైనాన్స్ నెట్‌వర్క్, యాడ్ నెట్‌వర్క్ మేనేజర్లపై కూడా విచారణ విస్తరించే అవకాశం ఉంది.

ఈ కేసు పైరసీ, బెట్టింగ్, క్రిప్టో మనీలాండరింగ్ వ్యవస్థల కలయికగా ఉందని పోలీసులు పేర్కొన్నారు. ఈ భారీ నెట్‌వర్క్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

Tags:    

Similar News