మారిన హైదరాబాద్ మెట్రో టైమింగ్స్ తో ప్రయాణికులకు నష్టమా?

హైదరాబాద్ మెట్రో రైలు కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ఇప్పటివరకు ఉన్న టైమింగ్స్ కు భిన్నంగా వారమంతా ఒకేలా.. ఒకే టైమింగ్స్ నడిపేందుకు వీలుగా కీలక నిర్ణయాన్ని ప్రకటించారు.;

Update: 2025-11-02 04:09 GMT

హైదరాబాద్ మెట్రో రైలు కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ఇప్పటివరకు ఉన్న టైమింగ్స్ కు భిన్నంగా వారమంతా ఒకేలా.. ఒకే టైమింగ్స్ నడిపేందుకు వీలుగా కీలక నిర్ణయాన్ని ప్రకటించారు. దీంతో.. రోజుతో సంబంధం లేకుండా అన్ని రోజులు ఒకేలా హైదరాబాద్ మెట్రో నడవనుంది. కొత్త షెడ్యూల్ ప్రకారం ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు మెట్రో రైలు అందుబాటులోకి ఉండనుంది.

కొత్తగా తీసుకొచ్చిన షెడ్యూల్ నవంబరు 3 నుంచి అమల్లోకి రానుంది. కొత్త షెడ్యూల్ ప్రకారం ప్రతి రోజు ఉదయం 6 గంటలకు మొదలయ్యే మెట్రో రైలు సర్వీసు.. రాత్రి పదకొండు గంటల వరకు కొనసాగనుంది. ఇది అన్ని టెర్మినల్స్ కు వర్తిస్తుందని పేర్కొన్నారు. ప్రయాణికుల సౌకర్యం కోసమే ఈ మార్పులు చేసినట్లుగా పేర్కొన్నారు.

ఇప్పటివరకు అనుసరించిన విధానాన్ని చూస్తే.. సోమవారం నుంచి శుక్రవారం వరకు ఉదయం 6 గంటలకు మొదలయ్యే మెట్రో రైలు రాత్రి 11.45 గంటలవరకు నడిచేది. అదే సమయంలో శనివారం ఉదయం 6 గంటలకు మొదలై.. 11 గంటల వరకు నడిచేది. ఇక.. ఆదివారం విషయానికి వస్తే ఉదయం 7 గంటలకు సర్వీసులు మొదలై.. రాత్రి 11 గంటల వరకు అందుబాటులో ఉండేది.

ఇప్పుడు అదంతా తీసేసి.. వారం మొత్తం రోజు ఏదైనా సరే.. ఉదయం 6 గంటలకు మొదలై రాత్రి 11 గంటల వరకు నడవనుంది. ఇదంతా చూస్తే.. ప్రయాణికులకు ఒకవిధంగా నష్టమనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో హైదరాబాద్ మహానగరం రాత్రి వేళలోనూ సందడిగా ఉంటోంది.

ఐటీ ఉద్యోగులు హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్న నేపథ్యంలో రాత్రి 11.45 గంటల వరకు మెట్రో నడిస్తే.. నగర ప్రజలకు ఉపయోగంగా ఉంటుందని చెప్పక తప్పదు. ఒక విధంగా చూస్తే.. వారంలో ఐదు రోజుల పాటు 45 నిమిషాలు అదనంగా నడిచే సౌకర్యాన్ని తీసేసి.. ఆదివారం గంట ముందు నడిచేలా చేశారని చెప్పాలి. తాజాగా మార్చిన టైమింగ్స్ మెట్రో ప్రయాణికులకు పెద్దగా ప్రయోజనం ఉండదని చెబుతున్నారు దీనికంటే.. రాత్రి 11 గంటల వరకు కాకుండా 12 గంటల వరకు నడిస్తే.. ఎంతోమందికి ప్రయోజనం కలుగుతుందని చెబుతున్నారు.

Tags:    

Similar News