పుతిన్ కు అతిథ్యమిస్తున్న హైదరాబాద్ హౌస్ ఎవరిది?

అప్పట్లో భారత్ ను పాలిస్తున్న బ్రిటిషర్లు దేశ రాజధానిని ఢిల్లీకి మార్చగా.. తన స్థాయికి తగ్గట్లు మిర్ ఉస్మాన్ అలీఖాన్ ఈ భవనాన్ని నిర్మించారు.;

Update: 2025-12-05 03:15 GMT

రష్యా అధ్యక్షుడు పుతిన్ మరోసారి భారత పర్యటనకు వచ్చారు. దాదాపు ఏడేళ్ల అనంతరం ఆయన తనకెంతో సన్నిహిత దేశమైన భారత్ కు వచ్చారు. తన రెండు రోజుల పర్యటనలో భాగంగా చారిత్రాత్మక హైదరాబాద్ హౌస్ లో బస చేయనున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో ఉన్న ఈ విశిష్ఠ భవనానికి హైదరాబాద్ హౌస్ అన్న పేరు ఎందుకు వచ్చింది? ఇంతకూ ఇదెవరిది? అన్న ప్రశ్నలకు సమాధానాలు మరింత ఆసక్తిని కలిగిస్తాయని చెప్పాలి.

దేశాధినేతలతో దౌత్య సంబంధాలకైనా.. విదేశీ ప్రముఖులతో చర్చలకైనా.. కీలక సమావేశాలకు వేదికగా నిలిచే హైదరాబాద్ హౌస్.. ఢిల్లీలోనే అత్యంత ప్రముఖమైనది. అశోకా రోడ్ నెంబరు వన్ లో ఉండే ఈ భారీ భవనం ఎనిమిది ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది. ఢిల్లీ మహానగరం నడిబొడ్డున ఉండే ఈ భవంతిలో ఇప్పటివరకు అమెరికా మాజీ అధ్యక్షులు ఒబామా.. ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్ తో పాటు చైనా అధ్యక్షుడు జిన్ పింగ్.. ఇజ్రాయెల్ అధినేత నెతన్యాహు తదితరులు ఇక్కడ అతిథ్యం పొందారు. గతంలో భారత పర్యటనకు వచ్చిన సందర్భంలోనూ పుతిన్ హైదరాబాద్ హౌస లోనే బస చేయటం గమనార్హం.

విదేశీ ప్రముఖుల మనసు దోచే ఈ భారీ భవంతి నిజాం కలల సౌధంగా చెప్పాలి. ఈ కారణంగానే ఢిల్లీలోని ఈ భవనానికి హైదరాబాద్ హౌస్ గా పేరొచ్చింది. హైదరాబాద్ దర్పానికి నిలువెత్తు ప్రతిబింబంగా ఇది నిలుస్తుంది. 1926లో ఈ భారీ భవన నిర్మాణాన్ని షురూ చేయగా.. రెండేళ్ల వ్యవధిలోనే దీన్ని నిర్మించారు. హైదరాబాద్ చివరి నిజాం మిర్ ఉస్మాన్ అలీఖాన్ దీన్ని ప్రారంభించారు. అప్పట్లో ఈ భవనాన్ని నిర్మించటానికి అయిన ఖర్చు రెండు లక్షల పౌండ్లు.

అప్పట్లో భారత్ ను పాలిస్తున్న బ్రిటిషర్లు దేశ రాజధానిని ఢిల్లీకి మార్చగా.. తన స్థాయికి తగ్గట్లు మిర్ ఉస్మాన్ అలీఖాన్ ఈ భవనాన్ని నిర్మించారు. దేశంలోనే అత్యంత ధనికుడిగా ఉన్న ఆయన.. ఈ భవనాన్ని తన స్థాయికి ఏ మాత్రం తగ్గని రీతిలో నిర్మించుకున్నారు. వైస్రాయి హౌస్ పక్కనే దీన్ని ఏర్పాటు చేయాలని భావించినా.. నాటి బ్రిటిష్ ప్రభుత్వం ససేమిరా అంది.

దీంతో నాటి వైస్రాయ్ హౌస్ కు మూడు కిలోమీటర్ల దూరంలో హైదరాబాద్ హౌస్ ను నిర్మించారు. ఇంతకూ ఢిల్లీలో నిజాం ఎందుకు భారీ భవంతిని నిర్మించాలని భావించారన్న విషయానికి వెళితే.. అప్పట్లో అధికారంలో ఉన్న బ్రిటిష్ ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపేందుకు.. చర్చల కోసం తనకో భవంతి ఉండాలన్న ఉద్దేశంతో దీన్ని నిర్మించారు. విదేశీ వాస్తు శిల్పి ఎడ్విన్ లుటియన్స్ కు దీని నిర్మాణ బాధ్యతల్ని అప్పగించారు. యూరోపియన్.. మొఘల్ శైలిని మిక్స్ చేసి ఈ భారీ భవంతిని నిర్మించారు.

ఈ భవనానికి ప్రత్యేక ఆకర్షణ.. దీని ఎత్తైన గుమ్మటం. చూసినంతనే సీతాకోకచిలుక ఆకారంలో.. రాజసం ఉట్టిపడేలా ఉండేలా దీన్ని నిర్మించారు. దీని డిజైన్ అప్పటి వైస్రాయ్ నుంచి తీసుకున్నట్లుగా చెబుతారు. మొత్తం 36 గదులతో ఉంటూ విశాలమైన ప్రాంగణం.. గంభీరంగా మెట్ల మార్గాలు.. ఫౌంటెయిన్లు ఎవరి మనసునైనా దోచుకుంటాయి. ఈ ప్యాలెస్ లో జెనానా ఏరియా ఉంది. ఇది మహిళలకు ఉద్దేశించింది. ఇక్కడ 12-15 గదులు ఉంటాయి. ఎందరి మనసుల్ని దోచుకున్న ఈ ప్యాలెస్ ను నిజాం కేవలం నాలుగుసార్లు మాత్రమే సందర్శించారు. సంప్రదాయ పద్దతికి భిన్నంగా.. యూరోపియన్ శైలిలో నిర్మించటంతో ఇందులో ఉండేందుకు నిజాం కొడుకులు ఇష్టపడలేదు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఇది హైదరాబాద్ హౌస్ గా మారింది. మారుతున్న దౌత్య అవసరాలకు అనుగుణంగా ఇది కేంద్రం నియంత్రణలోకి వెళ్లిపోయింది. అలా నిజాంతో మొదలైన ఈ భవనం.. ఇప్పుడు భారత ప్రభుత్వ అధీనంలో ఉంది.

Tags:    

Similar News