మూడు గంటల వాన హైదరాబాద్ ను ముంచేసింది

సాయంత్రం వేళ. ఆఫీసుల నుంచి బయటకు వచ్చే వేళలో వర్ష తీవ్రత పెరగటంతో నగర జీవులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.;

Update: 2025-08-05 05:03 GMT

అసలే సోమవారం. ఆ పై సాయంత్రం. అప్పటివరకు ఎండ మంటతో ఠారెత్తిన నగర జీవులకు ఉపశమనం కలిపిస్తూ వాతావరణంలో మార్పులు చోటు చేసుకోవటం.. వేడి తగ్గి.. చల్లదనమే కాదు మేఘాలు కమ్ముకోవటంతో వాన పడుతుందన్న విషయం అర్థమైనా.. రానున్నకొద్ది గంటల్లో ఎదురయ్యే అనూహ్య పరిస్థితులను అంచనా వేయలేకపోయారు హైదరాబాద్ ప్రజలు. సాయంత్రం మూడున్నర గంటలకు చిన్నచినుకులతో మొదలైన వర్షం చూస్తుండగానే తన విశ్వరూపాన్ని చూపటమే కాదు.. నాన్ స్టాప్ గా కురిసిన మూడు గంటల వానతో హైదరాబాద్ ప్రజలు ఆగమాగమైన పరిస్థితి.

చూస్తుండగానే రోడ్ల మీద భారీగా వర్షపునీరు నిలిచిపోవటం.. కాలనీల్లో పార్కు చేసిన కార్లు మునిగిపోవటమే కాదు.. అమీర్ పేటలోని మైత్రీవనం రోడ్డు మీద నడుము లోతులో నీళ్లు నిలిచిపోవటం చూస్తే.. వాన తీవ్రత ఎంత ఎక్కువన్న విషయాన్ని స్పష్టం చేస్తుంది. మొదటి గంటలోనే హైదరాబాద్ మహానగరంలోని పలు ప్రాంతాల్లో కురిసిన వర్షం ఆరేడు సెంటీమీటర్లు కాగా.. గంటన్నర వ్యవధిలోనే డబుల్ డిజిట్ దాటిపోయింది. క్యుములోనింబస్ దెబ్బకు విరిగిన మేఘాలు భారీ వర్షంగా మారి హైదరాబాద్ మహానగరంలోని పలు ప్రాంతాలు మునిగిపోయేలా చేశాయని చెప్పాలి.

సాయంత్రం వేళ. ఆఫీసుల నుంచి బయటకు వచ్చే వేళలో వర్ష తీవ్రత పెరగటంతో నగర జీవులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఈ సీజన్ మొత్తంలోనే అత్యధిక వర్షపాతం నమోదైంది. అది కూడా మూడు గంటల వర్షానికే. దీంతో రోడ్లు చెరువులుగా మారితే.. పలు ప్రాంతాల్లో నడుంలోతు నీళ్లతోవాహనాలు ముందుకు వెళ్లలేని పరిస్థితి. ఈ పరిస్థితుల్లో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జాం కావటంతో టూవీలర్ వాహనదారులు ప్రత్యక్ష నరకాన్ని చవిచూశారు.

హైదరాబాద్ మహానగరంలో అత్యధికంగా కుత్భుల్లాపూర్ లో 15.15 సెంటీమీటర్ల వర్షం నమోదు కాగా.. బంజారాహిల్స్ లో 12.45 సెంటీమీటర్లు.. అమీర్ పేట.. ఎస్ ఆర్ నగర్.. శ్రీనగర్.. కూకట్ పల్లి. బాలానగర్.. బహదూర్ పురా.. షేక్ పేట ఇలా చెప్పుకుంటూ పోతే ఆ ప్రాంతం.. ఈ ప్రాంతం అన్న తేడా లేకుండా వర్షం కుమ్మేసింది. దీంతో.. హైదరాబాద్ నగర వ్యాప్తంగా భారీ వర్షపాతం నమోదైంది. మూడు గంటల తర్వాత వర్షం తగ్గటంతో.. ఒక గంటకు రోడ్ల మీద నిలిచిన నీళ్లు డ్రైనేజీ ద్వారా వెళ్లిపోవటంతో రహదారులు క్లియర్ అయ్యాయి. దీంతో.. వాహనదారుల అనుభవించిన నరకానికి బ్రేకులు పడి.. వారి గమ్యస్థానాలకు చేరుకోవటానికి మార్గం సుగమం అయిన పరిస్థితి.

మూడు గంటల వ్యవధిలో హైదరాబాద్ లోని టాప్ 5 ప్రాంతాల్లో నమోదైన వర్షపాతం లెక్క చూస్తే.. సోమవారం సాయంత్రం కురిసిన వర్ష తీవ్రత ఇట్టే అర్థమవుతుంది.

ప్రాంతం వర్షపాతం (సెంటీమీటర్లలో)

కుత్భుల్లాపూర్ 15.15

బంజారాహిల్స్ 12.45

ఖైరతాబాద్ 11.70

శ్రీనగర్ కాలనీ 10.63

కూకట్ పల్లి 10.23

Tags:    

Similar News