'ఆహ నా పెళ్లంట' సినిమా చూడలేదా.. హైదరాబాద్ లో ఇవేం పనులు!
వివరాళ్లోకి వెళ్తే... హైదరాబాద్ లోని బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 12లో ఓ వ్యక్తి ప్రభుత్వం సరఫరా చేసే తాగునీటితో తన కారును కడిగిన విషయం జలమండలి అధికారుల దృష్టికి వచ్చింది.;
రైల్వే స్టేషన్ మాస్టర్స్ లో తప్పు చేసినవారిని పనిష్మెంట్ గా ఏ కొండల్లోనో, అడవుల్లోనో ఉండే స్టేషన్ కు ట్రాన్స్ ఫర్ చేస్తారు చూడండి.. అలాగే క్రితం జన్మలో నీళ్లు విచ్చలవిడిగా వృథా చేసిన వాళ్లను ఆ దేవుడు హైదరాబాద్ లో పుట్టిస్తాడని నా నమ్మకం... ఓ తెలుగు సినిమాలోని డైలాగ్ ఇది. రచయిత స్వానుభవంతో రాశారో ఏమో కానీ.. హైదరాబాద్ లో మంచి నీరు చాలా విలువైంది!
భాగ్యనగరం రోజు రోజుకీ విస్తరించుకుంటూ పోతున్న వేళ, ప్రతీ ఏటా హైదరాబాద్ బస్సు, ట్రైన్ దిగేవారు పెరిగిపోతోన్న నేపథ్యంలో.. త్రాగు నీరు మరింత విలువైనదిగా మారిపోతోన్న పరిస్థితి. ఇక వేసవి కాలం వచ్చిందంటే చెప్పే పనేలేదు! బస్తీల్లో కష్టాలు అన్నీ ఇన్నీ కాదయా అంటారు! అలాంటి హైదరాబాద్ లో ఓ వ్యక్తి తాగు నీటితో కార్ వాష్ చేసిన వ్యవహరం సీరియస్ గా ముగిసింది.
అవును... హైదరాబాద్ మహానగరంలో తాగునీటిని వృథా చేయవద్దని.. అత్యంత బాధ్యతాయుతంగా ఉపయోగించుకోవాలని జలమండలి పదే పదే హెచ్చరిస్తున్నప్పటికీ.. కొంతమంది నగరజీవులు మాత్రం పూర్తి నిర్లక్ష్యంగా, బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా తాగునీటిని కారు కడగాడానికి ఉపయోగించిన వ్యక్తికి అధికారులు జరిమానా విధించారు.
వివరాళ్లోకి వెళ్తే... హైదరాబాద్ లోని బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 12లో ఓ వ్యక్తి ప్రభుత్వం సరఫరా చేసే తాగునీటితో తన కారును కడిగిన విషయం జలమండలి అధికారుల దృష్టికి వచ్చింది. జలమండలి ఎండీ అశోక్ రెడ్డి ఆ ప్రాంతంలో పర్యటిస్తున్నప్పుడు ఈ ఘటనను ఆయన స్వయంగా గమనించారు. ఈ ఘటనపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
అనంతరం ఆ వ్యక్తిపై రూ.10,000 జరిమానా విధించారు. ఈ సందర్భంగా స్పందించిన ఎండీ అశోక్ రెడ్డి.. హైదరాబాద్ నగరంలోని కొన్ని ప్రాంతాల్లో ఇంకా తాగునీటి సమస్యలు ఉన్నాయని.. అలాంటి పరిస్థితుల్లో మంచి నీటిని ఇలా దుర్వినియోగం చేయడం ఏమాత్రం సరికాదని స్పష్టం చేశారు.
కాగా... ఈ ఏడాది సెప్టెంబర్ 4న ఇదే బంజారాహిల్స్, రోడ్ నంబర్ 12లో నిసించే ఓ వ్యక్తి తన వాహనాలను తాగునీటితో కడుగుతున్నట్లు అధికారులు గమనించడంతో.. అతనికి రూ.10,000 జరిమానా విధించారు. సెప్టెంబర్ 18న అదే ప్రాంతంలో నివసించే మరో వ్యక్తి తన ఇంటి ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ పొంగిపొర్లుతున్నందుకు రూ.5,000 జరిమానా విధించబడింది!