ప్రతి బ్యారెల్‌కు ఒక డాలర్.. హార్ముజ్ జలసంధిపై ఇరాన్ 'టోల్' బాంబ్
ప్రపంచ ఇంధన భద్రతకు గుండెకాయ వంటి హార్ముజ్ జలసంధి వేదికగా ఇరాన్ ప్రభుత్వం తీసుకోబోయే ఒక సంచలన నిర్ణయం ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశమవుతోంది.;
ప్రపంచ ఇంధన భద్రతకు గుండెకాయ వంటి హార్ముజ్ జలసంధి వేదికగా ఇరాన్ ప్రభుత్వం తీసుకోబోయే ఒక సంచలన నిర్ణయం ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశమవుతోంది. పర్షియన్ గల్ఫ్‌కు కీలక ద్వారంగా ఉన్న ఈ జలసంధి గుండా ప్రయాణించే చమురు ట్యాంకర్లపై భారీగా 'టోల్ ఫీజు' విధించాలని ఇరాన్ యోచిస్తున్నట్లు ప్రముఖ అంతర్జాతీయ ఆర్థిక పత్రిక ఫైనాన్సియల్ టైమ్స్ ఒక ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. ఈ ప్రతిపాదన గనుక అమలులోకి వస్తే ఇప్పటికే అస్థిరంగా ఉన్న ప్రపంచ చమురు మార్కెట్ మరింత సంక్షోభంలోకి వెళ్లే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
బ్యారెల్‌కు ఒక డాలర్.. బిలియన్ల ఆదాయం!
ఇరాన్ ప్రతిపాదించిన కొత్త వ్యూహం ప్రకారం హార్ముజ్ జలసంధి గుండా ప్రయాణించే ప్రతి బ్యారెల్ చమురుపై ఒక డాలర్ మేర ఫీజు వసూలు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. గణాంకాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి అయ్యే చమురులో దాదాపు 20% ఈ సన్నని జలసంధి ద్వారానే రవాణా అవుతుంది. సగటున రోజుకు 20 మిలియన్ బ్యారెళ్ల చమురు ఈ మార్గం గుండా వెళ్తుంది. ఈ లెక్కన ఇరాన్ ప్రతిపాదన కార్యరూపం దాల్చితే ఆ దేశానికి రోజుకు మిలియన్ల కొద్దీ ఆదాయం చేకూరడమే కాకుండా అంతర్జాతీయంగా చమురు ధరలు అమాంతం పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా భారత్, చైనా వంటి ఆసియా దేశాలతో పాటు యూరప్ మార్కెట్లపై ఈ భారం తీవ్రంగా పడనుంది. దిగుమతి ఖర్చులు పెరగడం వల్ల సామాన్య ప్రజలపై ద్రవ్యోల్బణ ప్రభావం పడే ప్రమాదం ఉంది.
ఆంక్షలకు విరుగుడుగా 'క్రిప్టో' వ్యూహం
ఈ టోల్ ఫీజును డాలర్లు లేదా యూరోల వంటి సంప్రదాయ కరెన్సీల్లో కాకుండా క్రిప్టోకరెన్సీల రూపంలో స్వీకరించాలని ఇరాన్ భావిస్తోంది. అమెరికా, పాశ్చాత్య దేశాలు విధిస్తున్న ఆర్థిక ఆంక్షల నుండి తప్పించుకోవడానికి ఇదొక మాస్టర్ ప్లాన్ అని విశ్లేషకులు భావిస్తున్నారు. అంతర్జాతీయ బ్యాంకింగ్ వ్యవస్థ (స్విఫ్ట్) పై ఆంక్షలు ఉండటంతో డిజిటల్ కరెన్సీలను వాడటం ద్వారా ఇరాన్ తన ఆదాయ మార్గాలను సులభతరం చేసుకోవాలని చూస్తోంది. ఇది కేవలం డబ్బు కోసం మాత్రమే కాకుండా అంతర్జాతీయ వాణిజ్య మార్గాలపై తన పట్టును నిరూపించుకోవడానికి ఇరాన్ వేస్తున్న అడుగుగా కనిపిస్తోంది.
తనిఖీల పేరుతో నిఘా పెంపు
చమురుపై పన్ను విధించడమే కాకుండా నౌకల రాకపోకలపై మరింత కఠినమైన నిబంధనలను తీసుకురావాలని ఇరాన్ యోచిస్తోంది. ప్రతి ట్యాంకర్‌లోని సరుకు వివరాలను, గమ్యస్థానాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే అనుమతులు ఇవ్వాలని అధికారులు భావిస్తున్నారు. భద్రతా కారణాలను సాకుగా చూపుతున్నప్పటికీ ఇది వాస్తవానికి ఈ కీలక సముద్ర మార్గంపై ఇరాన్ తన వ్యూహాత్మక ఆధిపత్యాన్ని ప్రదర్శించే ప్రయత్నంగా విశ్లేషకులు భావిస్తున్నారు.
పెరగనున్న భౌగోళిక ఉద్రిక్తతలు
ఇరాన్ తీసుకోబోయే ఈ నిర్ణయం చమురు సరఫరా గొలుసులో తీవ్ర అంతరాయం కలిగించే అవకాశం ఉంది. కఠిన తనిఖీల వల్ల నౌకల ప్రయాణ సమయం పెరిగి సరఫరాలో జాప్యం జరగవచ్చు.
అమెరికా, దాని మిత్రదేశాలు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించే అవకాశం ఉన్నందున పశ్చిమాసియా ప్రాంతంలో మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకొనే ప్రమాదం ఉంది. రవాణా ఖర్చులు, ఇన్సూరెన్స్ ప్రీమియంలు పెరగడం వల్ల ప్రపంచ వాణిజ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుంది.
ప్రస్తుతానికి ఇది ఒక ప్రతిపాదనగానే ఉన్నప్పటికీ అంతర్జాతీయ చమురు మార్కెట్లలో ఇప్పటికే కలకలం మొదలైంది. ఒకవేళ ఇరాన్ ఈ దిశగా ముందడుగు వేస్తే అమెరికా , ఐక్యరాజ్యసమితి ఎలాంటి చర్యలు చేపడతాయో వేచి చూడాలి. ఈ పరిణామాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ఎటువైపు నడిపిస్తాయనేది రాబోయే కొద్ది రోజుల్లో తేలనుంది.