గణేష్ నిమజ్జనంలో మృత్యుశకటమైన లారీ.. భక్తులపైకి.. మరణమృదంగం

ఈ భయానక ప్రమాదంలో తొలుత 8 మంది మృతిచెందినట్లు సమాచారం అందగా.. అనంతరం సంఖ్య 9కి పెరిగింది.;

Update: 2025-09-13 04:30 GMT

కర్ణాటక రాష్ట్రం హసన్ జిల్లాలో గణేష్ నిమజ్జనం సందర్భంగా ఘోర ప్రమాదం సంభవించింది. మోసలే హోసహళ్ళి ప్రాంతంలో గ్రామస్తులు ఆనందోత్సాహాలతో వినాయక విసర్జన శోభాయాత్రలో పాల్గొంటున్న సమయంలో ఒక లారీ అదుపుతప్పి ఊరేగింపులోకి దూసుకెళ్లింది. ఈ భయానక ప్రమాదంలో తొలుత 8 మంది మృతిచెందినట్లు సమాచారం అందగా.. అనంతరం సంఖ్య 9కి పెరిగింది. మృతుల్లో ముగ్గురు ఇంజనీరింగ్ విద్యార్థులు, ఆరుగురు గ్రామస్తులు ఉన్నారని అధికారులు ధృవీకరించారు.

*ప్రమాదం ఇలా జరిగింది

శుక్రవారం రాత్రి 8 గంటల సమయంలో జాతీయ రహదారి (NH-373)పై ఈ ఘటన జరిగింది. ఎదురుగా వస్తున్న ఒక బైక్‌ను తప్పించేందుకు డ్రైవర్ ప్రయత్నించగా లారీ అదుపుతప్పి డివైడర్‌ను ఎక్కి తప్పు దిశలో దూసుకెళ్లింది. భారీ వేగంతో దూసుకొచ్చిన లారీ క్షణాల్లోనే ఊరేగింపులోకి దూసుకెళ్లి దారుణానికి కారణమైంది. ప్రమాద తీవ్రత అంతలా ఉండటంతో భక్తులు గాల్లో ఎగిరిపడిపోగా, అక్కడి వాతావరణం ఒక్కసారిగా కల్లోలమైంది.

*గాయపడిన వారి పరిస్థితి

ఈ ఘటనలో దాదాపు 25–30 మంది వరకు గాయపడ్డారు. వారిని సమీపంలోని కిమ్స్ ఆసుపత్రి సహా వివిధ ఆసుపత్రులకు తరలించారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం పోలీసులు, రెస్క్యూ బృందాలు సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి.

*అధికారుల స్పందన

హసన్ జిల్లా ఎస్పీ మహమ్మద్ సుజీత్ ఎంఎస్ మాట్లాడుతూ... “ప్రమాదానికి కారణమైన ట్రక్కు డ్రైవర్ గాయపడినప్పటికీ అతడిని అదుపులోకి తీసుకున్నాం. సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం” అని తెలిపారు. హసన్ డిప్యూటీ కమిషనర్ కెఎస్ లతా కుమారి మాట్లాడుతూ... “22 మంది కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మరో ఏడుగురు ప్రైవేట్ ఆసుపత్రిలో ఉన్నారు. మృతులలో ఇంజనీరింగ్ విద్యార్థులు కూడా ఉన్నారని సమాచారం” అని చెప్పారు.

*ప్రభుత్వం ప్రకటించిన సాయం

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించడంతో పాటు గాయపడిన వారి వైద్య ఖర్చులను రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని తెలిపారు. “ఉత్సవంగా ప్రారంభమైన వినాయక విసర్జన క్షణాల్లో విషాదంగా మారడం అత్యంత బాధాకరం. బాధితుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుంది” అని సీఎం పేర్కొన్నారు.

ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కూడా హృదయపూర్వక సంతాపం వ్యక్తం చేస్తూ... “మృతుల ఆత్మలకు శాంతి చేకూరాలని, వారి కుటుంబాలకు ఈ తీవ్ర దుఃఖాన్ని భరించే ధైర్యం కలగాలని దేవుని ప్రార్థిస్తున్నాను. గాయపడినవారు త్వరగా కోలుకోవాలి” అని అన్నారు.

స్థానికుల దిగ్భ్రాంతి

అనుకోకుండా జరిగిన ఈ దారుణ ఘటనతో మోసలే హోసహళ్ళి ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఉత్సవంగా సాగిన గణేష్ విసర్జన ఊరేగింపు క్షణాల్లో శోకసంద్రంగా మారిపోవడంతో గ్రామం మొత్తం కన్నీటి వాతావరణంలో మునిగిపోయింది.

Tags:    

Similar News