పేరుకే జైలు శిక్ష.. బయట ఉండేదే ఎక్కువ? డేరాబాబాకు 16 సారి పెరోల్!
హరియాణాలోని డేరా సచ్చా సౌదా అధినేత గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ (డేరా బాబా) మరోసారి వార్తల్లో నిలిచారు.
హరియాణాలోని డేరా సచ్చా సౌదా అధినేత గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ (డేరా బాబా) మరోసారి వార్తల్లో నిలిచారు. తన శిష్యురాళ్లపై అత్యాచారానికి ఒడిగట్టి, 20 ఏళ్ల కఠిన జైలు శిక్ష అనుభవిస్తున్న ఈ ‘బాబా’కు హరియాణా ప్రభుత్వం తాజాగా 30 రోజుల పెరోల్ మంజూరు చేసింది. మంగళవారం ఉదయాన్నే ఆయన రోహ్‌తక్‌లోని సునారియా జైలు నుంచి బయటకు వచ్చారు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే, 2017లో ఆయనకు శిక్ష పడినప్పటి నుంచి జైలు వెలుపలికి రావడం ఇది 16వ సారి అంటున్నారు. ఈ నేపథ్యంలో డేరా బాబాకు పెరోల్ మంజూరుపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది.
జైలు కంటే బయటే ఎక్కువ కాలం
సాధారణ ఖైదీలకు పెరోల్ రావాలంటే ఎన్నో నిబంధనలు, నెలల తరబడి నిరీక్షణ తప్పదని చెబుతున్నారు. కానీ డేరా బాబా విషయంలో మాత్రం చట్టం చాలా ఉదారంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తున్నారు. జైలుకు వెళ్లిన నుంచి డేరా బాబు 16 సార్లు పెరోల్ పై బయటకు రావడంపై తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. తాజాగా 30 రోజుల పెరోల్‌తో కలిపితే, గత తొమ్మిదేళ్లలో ఆయన జైలు వెలుపల గడిపిన మొత్తం రోజులు 436 రోజులకు చేరుకున్నాయని లెక్కలు చెబుతున్నారు.
ఏడాదిలోనే రెండోసారి
ఇప్పటి వరకు మొత్తం 16 సార్లు పెరోల్ పై బయటకు వచ్చిన డేరాబాబాకు ఈ ఏడాది రెండోసారి పెరోల్ ఇచ్చినట్లు చెబుతున్నారు. గత జనవరిలో ఆయనకు 40 రోజుల పెరోల్ లభించింది. అది ముగిసిన కొన్ని నెలలు తిరక్కుండానే తాజాగా మళ్లీ 30 రోజుల పెరోల్ పై బయటకు పంపారు. దీంతో డేరా బాబా శిక్ష అనుభవిస్తున్నట్లు లేదని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. అప్పుడప్పుడు జైలుకు వెళ్లి.. వర్క్ ఫ్రం పద్ధతిలోనే జైలు శిక్ష పూర్తి చేస్తున్నారని వ్యాఖ్యానిస్తున్నారు.
కాగా, డేరా బాబాకు పెరోల్ లభించిన ప్రతిసారీ దేశవ్యాప్తంగా రాజకీయ దుమారం రేగుతోంది. హరియాణా, పంజాబ్, రాజస్థాన్, ఢిల్లీ రాష్ట్రాల్లో డేరా సచ్చా సౌదాకు లక్షలాది మంది భక్తులు ఉన్నారు. వీరి ఓట్ల కోసమే డేరా బాబాకు తరచుగా పెరోల్ పై బయటకు పంపుతున్నారని విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. గతంలో ఢిల్లి, హరియాణా, పంజాబ్ ఎన్నికలకు సరిగ్గా కొన్ని రోజుల ముందే డేరాబాబాకు పెరోల్ ఇచ్చారని ప్రతిపక్షాలు, సిక్కు సంఘాలు ఎత్తిచూపుతున్నాయి. ఓట్ల రాజకీయాల కోసమే హరియాణా ప్రభుత్వం డేరా బాబాకు పదే పదే ఇలాంటి వెసులుబాటు కల్పిస్తోందని సామాజిక సంస్థలు ఆరోపిస్తున్నాయి.
చట్టం ఏం చెబుతోంది?
హరియాణా ప్రభుత్వం రూపొందించిన ‘హరియాణా గుడ్ కండక్ట్ ప్రిజనర్స్ (టెంపరరీ రిలీజ్) యాక్ట్, 2022’ ప్రకారం జైల్లో సత్ప్రవర్తన కలిగిన ఖైదీలు ఒక క్యాలెండర్ ఇయర్ లో గరిష్టంగా 70 రోజుల పెరోల్, 21 రోజుల ఫర్లో పొందేందుకు చట్టబద్ధమైన హక్కు ఉంటుందని అంటున్నారు. డేరా బాబా తరఫు న్యాయవాదులు సరిగ్గా ఈ చట్టంలోని లొసుగులను, నిబంధనలను వాడుకుంటూ ఏడాదికి రెండు మూడు సార్లు ఆయన్ను బయటకు తీసుకువస్తున్నారని చెబుతున్నారు.