బికేర్ ఫుల్.. మీకు తెలిసినోళ్లకూ ఇలానే జరగొచ్చు
ఇప్పుడు చెప్పే ఉదంతం కూడా ఇలాంటిదే. ఈ ఉదంతాన్ని ఒక ఉదాహరణగా తీసుకోవాల్సిన అవసరం అందరికి ఉంది. తెలిసి తెలియని వయసులో స్నేహాన్ని నమ్మే కల్మషం లేని వారు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.;
అనుక్షణం అప్రమత్తంగా ఉండే పాడు రోజులు వచ్చేశాయి. ఆపద ఏ రూపంలో అయినా విరుచుకుపడే దుర్మార్గపు రోజులు. స్నేహం పేరుతో వల విసిరే విష నాగులను గమనిస్తూ.. ఆచితూచి అడుగులు వేయకుంటే మొదటికే మోసానికి గురి కావటమే కాదు.. జీవితాంతం వేదనకు గురి చేసే ఉదంతాలు ఇటీవల కాలంలో ఎక్కువ అవుతున్నాయి. ఇప్పుడు చెప్పే ఉదంతం కూడా ఇలాంటిదే. ఈ ఉదంతాన్ని ఒక ఉదాహరణగా తీసుకోవాల్సిన అవసరం అందరికి ఉంది. తెలిసి తెలియని వయసులో స్నేహాన్ని నమ్మే కల్మషం లేని వారు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.
మీకుతెలిసినోళ్లు కావొచ్చు. మీ కుటుంబ సభ్యులు కావొచ్చు. ఇలాంటి దుర్మార్గ ఉదంతాల గురించి అవగాహన పెంచాల్సిన అవసరం ఉంది. గుంటూరులో వెలుగు చూసిన దుర్మార్గ ఉదంతంలోకి వెళితే.. మనసు చేదు కావటం ఖాయం. ఇంటర్ చదువుతున్న పదిహేడేళ్ల బాలికకు.. ఆమె చదివే కాలేజీకి చెందిన సీనియర్ ఒకరు ఇన్ స్టా ద్వారా పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా నమ్మించిన ఆ దుర్మార్గుడు ఆమెకు డ్రగ్స్ ను అలవాటు చేశాడు.
తన రూంకు రప్పించి.. మత్తుపదార్థాలు ఇస్తూ అసభ్యకరంగా ప్రవర్తించేవాడు. అక్కడితో ఆగని అతడి విపరీత చేష్టలు.. తాను చేసే దారుణాలను తన స్నేహితుడి చేత వీడియోలు.. ఫోటోలు తీయించేవాడు. రెండు రోజుల క్రితం ఆమె ఫోన్ ను చూసిన బాధితురాలి తల్లికి గుండె ఆగినంత పనైంది. యువకుడితో తన కుమార్తె సన్నిహితంగా ఉన్న ఫోటోలు కనిపించాయి. దీంతో తీవ్ర వేదనకు గురైన ఆమె.. భర్తతో కలిసి కూతుర్ని నిలదీసింది.
తనను ప్రశ్నిస్తారా? అంటూ తల్లిదండ్రులపై దాడి చేసిన బాలిక తీరుతో తీవ్ర మనస్తాపానికి గురైన తల్లి నిద్ర మాత్రలు మింగి సూసైడ్ అటెంప్టు చేశారు. దీంతో చికిత్స నిమిత్తం బాధితురాలిని జీజీహెచ్ లో చేర్చారు. ఈ ఉదంతం గురించి సమాచారం అందుకున్న ఈగల్ విభాగ ఐటీ ఆకే రవిక్రిష్ణ.. గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ తో కలిసి ఆసుపత్రిలో ఉన్న ఆమెను పరామర్శించారు. ఈ కేసును సమగ్రంగా దర్యాప్తు జరిపి తగిన చర్యలు తీసుకుంటామని ఐజీ స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా.. బాలికకు డ్రగ్స్ అలవాటు చేసిన కుర్రాడు ఒక రాజకీయ పార్టీ విద్యార్థి సంఘ నాయకుడిగా ఉన్నట్లుగా పోలీసుల దర్యాప్తులో గుర్తించారు. ఈ ఉదంతం ఇప్పుడు కలకలాన్ని రేపుతోంది. పిల్లల విషయంలో తల్లిదండ్రులు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని తెలియజేస్తుందని చెప్పాలి.