జైల్లో భారీ కేక్‌తో రౌడీషీటర్ బర్త్‌డే వేడుక.. భద్రతా వ్యవస్థపై ప్రశ్నలు
ఈ వీడియోలో అండర్ ట్రయల్ ఖైదీ, రౌడీషీటర్ అయిన శ్రీనివాస అలియాస్ గుబ్బాచ్చి సీనా తన పుట్టినరోజును జైలు లోపల అత్యంత ఘనంగా జరుపుకున్న దృశ్యాలు రికార్డయ్యాయి.;
అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు ఉండే బెంగళూరులోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైలు నుండి ఒక షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కర్ణాటక జైలు శాఖలో పెను కలకలం రేగింది. ఈ వీడియోలో అండర్ ట్రయల్ ఖైదీ, రౌడీషీటర్ అయిన శ్రీనివాస అలియాస్ గుబ్బాచ్చి సీనా తన పుట్టినరోజును జైలు లోపల అత్యంత ఘనంగా జరుపుకున్న దృశ్యాలు రికార్డయ్యాయి.
*అట్టహాసంగా ఖైదీ పండుగ
వైరల్ అయిన వీడియో ప్రకారం.. గుబ్బాచ్చి సీనా మెడలో యాపిల్ పండ్ల దండ ధరించి, తోటి ఖైదీల మధ్య నిలబడి ఉన్నాడు. అతను ఏకంగా ఐదు లేయర్లున్న భారీ కేక్‌ను కట్ చేస్తూ సంబరాలు చేసుకున్నాడు. తోటి ఖైదీలు ఉల్లాసంగా చప్పట్లు కొడుతూ, ఈలలు వేస్తూ అతడిని అభినందించారు. ఇంతటితో ఆగకుండా, ఖైదీల్లో ఒకరు మొబైల్ ఫోన్ ఉపయోగించి ఈ వేడుకను పూర్తిగా రికార్డు చేసి, ఆ వీడియోను బయటకు పంపినట్లు సమాచారం.
భద్రతా వ్యవస్థపై ప్రశ్నలు
జైలు నిబంధనల ప్రకారం ఖైదీలకు మొబైల్ ఫోన్ వాడకం పూర్తిగా నిషేధం. అలాగే కేకు వంటి బయటి వస్తువులను జైలు లోపలికి అనుమతించరు. అయినప్పటికీ మొబైల్‌తో వీడియో రికార్డు కావడం, భారీ కేక్ లోపలికి చేరడం జైలు భద్రతా వ్యవస్థలో ఉన్న తీవ్రమైన లోపాలను స్పష్టంగా ఎత్తి చూపుతోంది. అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే జైలులోనే ఇలాంటి విలాసవంతమైన వేడుక జరగడం, దాని వీడియో బయటకు రావడం కర్ణాటక జైలు భద్రతా ప్రమాణాలపై పెద్ద ప్రశ్నలు లేవనెత్తుతోంది. అధికారులు నిర్లక్ష్యం వహించారా? లేక జైలు లోపల ఉన్న కొందరు సిబ్బంది ఖైదీలకు సహకారం అందించారా? అనే దానిపై సర్వత్రా చర్చ జరుగుతోంది.
ఘటనపై దర్యాప్తు
ఈ షాకింగ్ ఘటనపై స్పందించిన కర్ణాటక జైలు శాఖ ఉన్నతాధికారులు తక్షణమే విచారణకు ఆదేశాలు జారీ చేశారు. ఎవరి సహకారంతో భారీ కేక్ జైలులోకి చేరింది.. మొబైల్ ఫోన్ ఎవరి నుంచి వచ్చింది, వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేసింది ఎవరు అనే అంశాలపై దర్యాప్తు కొనసాగుతోంది. భద్రతా వైఫల్యానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
*ఎవరీ గుబ్బాచ్చి సీనా?
గుబ్బాచ్చి సీనా ఒక రౌడీషీటర్. ఈ ఏడాది జనవరిలో బెంగళూరులోని దొడ్డబొమ్మాసంద్రకు చెందిన తన ప్రత్యర్థి వెంకటేశును హత్య చేసిన కేసులో అతను నిందితుడు. అరెస్టు సమయంలో కూడా పోలీసులపై దాడికి ప్రయత్నించిన చరిత్ర ఇతడిది. ప్రస్తుతం, అతను ఇదే హత్య కేసులో పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో రిమాండ్‌లో ఉన్నాడు. రిమాండ్‌లో ఉన్న ఖైదీ ఇంతటి అట్టహాసంగా పుట్టినరోజు చేసుకోవడం ప్రజల ఆగ్రహానికి కారణమైంది.