అమెరికా ప్రవేశ ఫీజుపై గందరగోళం: గ్రీన్ కార్డ్ హోల్డర్లలో తీవ్ర ఆందోళన!

తాజాగా USCIS కొన్ని వేల మందికి “ఇమిగ్రేషన్ పారోల్ ఫీజు నోటీసులు” పంపింది. ఈ నోటీసుల్లో ప్రతి ఒక్కరూ $1,000 (సుమారు ₹84,000) చెల్లించాల్సి ఉంటుందని పేర్కొనబడింది.;

Update: 2025-11-02 15:30 GMT

అమెరికా ప్రవేశానికి సంబంధించిన కొత్త ఫీజు నిబంధనల అమలుపై అమెరికా పౌరసత్వం, ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (USCIS) పంపిన నోటీసులతో వేలాది మంది గ్రీన్ కార్డ్ హోల్డర్లు.. ఇమ్మిగ్రెంట్లలో పెద్ద ఎత్తున గందరగోళం నెలకొంది. తాజాగా USCIS కొన్ని వేల మందికి “ఇమిగ్రేషన్ పారోల్ ఫీజు నోటీసులు” పంపింది. ఈ నోటీసుల్లో ప్రతి ఒక్కరూ $1,000 (సుమారు ₹84,000) చెల్లించాల్సి ఉంటుందని పేర్కొనబడింది.

* DHS కొత్త నిబంధన, పారోల్ ఫీజు అమలు

డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ (DHS) 2025 అక్టోబర్ 16న ఫెడరల్ రిజిస్టర్‌లో ప్రకటించిన కొత్త నిబంధన కారణంగా ఈ ఫీజు అమలులోకి వచ్చింది. ఈ ఫీజును అమెరికా ప్రవేశ ద్వారాల వద్ద లేదా పోస్టు ద్వారా చెల్లించే విధానం అమలు చేస్తారు.

అయితే ఈ నోటీసులు లీగల్ పర్మనెంట్ రెసిడెంట్స్ (LPRs) అంటే గ్రీన్ కార్డ్ హోల్డర్లకు కూడా పంపబడటంతో పెద్ద దుమారం చెలరేగింది. ఈ ఏడాది ప్రారంభంలో గ్రీన్ కార్డ్ పొందిన అనేక మంది కూడా ఈ నోటీసులు అందుకుని, తమ ప్రవేశం సమయంలో $1,000 ఫీజు చెల్లించాల్సి వస్తుందేమోనని భయపడుతున్నారు.

* గ్రీన్ కార్డ్ హోల్డర్లకు మినహాయింపు: నిపుణుల స్పష్టీకరణ

గందరగోళంపై ఇమ్మిగ్రేషన్ నిపుణులు స్పష్టతనిచ్చారు. గ్రీన్ కార్డ్ హోల్డర్లు (LPRలు) లేదా శాశ్వత నివాస హోదా ఉన్నవారికి ఈ కొత్త $1,000 పారోల్ ఫీజు వర్తించదు. వారు అమెరికా ప్రవేశానికి ఈ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.

* ఈ ఫీజు ఎవరికి వర్తిస్తుంది?

నిపుణుల ప్రకారం, ఈ కొత్త $1,000 ఫీజు కేవలం ఈ క్రింది వర్గాల వారికి మాత్రమే వర్తిస్తుంది. ఆశ్రయం దరఖాస్తుదారులు, టెంపరరీ ప్రొటెక్టెడ్ స్టేటస్ (TPS) కింద ఉన్నవారు.. డాకా (DACA) ప్రోగ్రాంలో ఉన్నవారికి ఈ ఫీజు వర్తిస్తుంది.

* తప్పుగా నోటీసులు ఎందుకు పంపబడ్డాయి?

USCIS నుండి వచ్చిన ఈ తప్పుడు మెయిలింగ్ వెనుక గల కారణాన్ని నిపుణులు విశ్లేషించారు. మెయిలింగ్ లిస్ట్‌లో కొంతమంది గ్రీన్ కార్డ్ హోల్డర్లను కూడా పొరపాటున చేర్చి ఉండవచ్చు. "చాలామంది గ్రీన్ కార్డ్ హోల్డర్లు గతంలో 'అడ్వాన్స్ ట్రావెల్ పారోల్' ద్వారా ప్రయాణ అనుమతి పొందినవారుగా ఉన్నారు. ఈ కారణంగానే ఈ 'బల్క్ మెయిలింగ్'లో వారు కూడా చేరి అనవసర భయాన్ని రేకెత్తించింది" అని నిపుణులు పేర్కొన్నారు.

* గ్రీన్ కార్డ్ హోల్డర్లు చేయవలసినవి

మీరు ఇప్పటికే గ్రీన్ కార్డ్ హోల్డర్ అయితే ఈ నోటీసును పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మీ Form I-485 ఇంకా పెండింగ్‌లో ఉంటే, గందరగోళాన్ని నివారించడానికి ఒక ఇమ్మిగ్రేషన్ లాయర్‌ను సంప్రదించడం ఉత్తమం. సమాచారం నిర్ధారణ కోసం USCIS అధికారిక వెబ్‌సైట్‌ను లేదా మీ ఆన్‌లైన్ అకౌంట్‌ను తనిఖీ చేయండి.

నిపుణుల అభిప్రాయం ప్రకారం, భవిష్యత్తులో ప్రభావితం కాని వ్యక్తులకు గందరగోళం సృష్టించకుండా, USCIS మరింత ఖచ్చితమైన సమాచారం పంపే విధానాన్ని అమలు చేయాల్సిన అవసరం ఉంది.

Tags:    

Similar News