సిబిల్ బాధలకు ఇక చెల్లు.. లోన్లు ఇక ఈజీ..కేంద్రం సరికొత్త వ్యవస్థ?

ఈ ప్రశ్నలకు సమాధానంగానే కేంద్రం చర్యలు తీసుకుంటోందని తెలుస్తోంది. ఇక సిబిల్ కు చెల్లు చెబుతూ కొత్త వ్యవస్థను ప్రవేశపెట్టనుందని సమాచారం.;

Update: 2025-07-19 08:45 GMT

ఆ మధ్య యువకుడి సిబిల్ స్కోరు తక్కువగా ఉందని పెళ్లి నిరాకరించింది అమ్మాయి తరఫు కుటుంబం...

మొన్నటికి మొన్న సిబిల్ స్కోరు లేదని ఓ పెద్ద బ్యాంకు ఉద్యోగం నుంచి తీసేస్తే దానిని సమర్థించింది కోర్టు..

ఆరునెలల కిందట ఓ ప్రయివేటు కంపెనీ అయిన సిబిల్ మన క్రెడిట్ స్కోరును నియంత్రించడంపై ప్రభుత్వాన్ని సాక్షాత్తు పార్లమెంటులోనే నిలదీశారు ఓ ఎంపీ...

అవును ఓ విధంగా ఆలోచిస్తే.. ఎవరీ సిబిల్..? మనపై దాని పెత్తనం ఏమిటి..? పదేళ్ల కిందటే దేశీయ డిజిటల్ చెల్లింపుల వ్యవస్థను తీసుకొచ్చిన మోదీ ప్రభుత్వం.. ఇప్పుడు అత్యంత ప్రధానమైన సిబిల్ పై ఏమీ చేయలేదా..?

ఈ ప్రశ్నలకు సమాధానంగానే కేంద్రం చర్యలు తీసుకుంటోందని తెలుస్తోంది. ఇక సిబిల్ కు చెల్లు చెబుతూ కొత్త వ్యవస్థను ప్రవేశపెట్టనుందని సమాచారం.

బ్యాంకులు, ఆర్థిక సంస్థలు రుణాలు ఇవాలంటే, క్రెడిట్ కార్డులు మంజూరు చేయాలంటే చూసేది క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఇండియా లిమిటెడ్ (సిబిల్) స్కోరునే. ఈక్విఫాక్స్ వంటివి మరో మూడు నాలుగు ఇలాంటి సంస్థలే ఉన్నా సిబిల్ ను ఎక్కువ ప్రామాణికంగా తీసుకుంటున్నాయి. ఈ స్కోరు సరిగా లేకుంటే రుణాలు, కార్డులు నిరాకరిస్తున్నాయి. వాస్తవానికి కొందరికి ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్త పడుతూ.. చెల్లింపులు సరిగా చేస్తున్నా సిబిల్ తక్కువగా ఉంటోందన్న ఆరోపణలున్నాయి. అందుకనే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పుడు కేంద్రం ఆలోచనల్లో ఉన్నదాని ప్రకారం.. కేంద్ర ఆర్థిక శాఖ పరిధిలోని ఆర్థిక సేవల విభాగం... సిబిల్ వంటి సంప్రదాయ క్రెడిట్ స్కోర్లపై ఆధారపడడాన్ని నివారించనుంది. దీనిస్థానంలో కొత్తగా డిజిటల్ లెండింగ్ వ్యవస్థ.. యూనిఫైడ్ లెండింగ్ ఇంటర్ ఫేస్ (యూఎల్ఐ)ని విస్తరించనున్నట్లు చెబుతున్నారు.

యూఎల్ఐతో మరింత క్రమబద్ధీకరించిన, సమగ్ర రుణ ప్రక్రియను రూపొందించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది కేంద్రం. ఈ మేరకు ఆర్థిక సేవల సంస్థ అన్ని ఆర్థిక సంస్థలను నెలవారీ ప్రాతిపదికన యూఎల్ఐ స్వీకరణను సమీక్షించాలని ఆదేశించింది. ఈ వ్యవస్థలో అందరూ తక్షణమే చేరాలని సూచించింది.

ఇప్పటికే కేంద్ర ఆర్థిక శాఖ.. ఆర్బీఐ, కేంద్ర, రాష్ట్ర మంత్రిత్వ శాఖలతో సమావేశమై యూఎల్ఐ అమలుపైన చర్చించింది.

రుణ మంజూరును వేగంగా, సమర్థంగా చేయడం, సిబిల్ పై తక్కువగా ఆధారపడడం తగ్గించడమే లక్ష్యంగా యూఎల్ఐని తీసుకురానున్నారు. టెక్నాలజీ, డేటా, పాలసీని ఒకదగ్గరకు చేర్చి రుణ ప్రక్రియను మరింత సులువు చేసే డిజిటల్ ప్లాట్ ఫామ్ యూఎల్ఐ. రుణదాతలు, ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, ఇతర విభాగాల నుంచి హైక్వాలిటీ, సర్టిఫైడ్ డేటాను యాక్సెస్ చేసేందుకు ఇది వీలు కల్పిస్తుంది. ఫాస్ట్, సమగ్ర క్రెడిట్ డెలివరీని సులభం చేస్తుంది.

రుణ మంజూరు రెగ్యులరైజేషన్, క్రెడిట్ అంచనాలకు సమయాన్నితగ్గించడం సహా అనేక ప్రయోజనాలు యూఎల్ఐతో ముడిపడి ఉన్నాయి. మరీ ముఖ్యంగా సిబిల్ వంటి సంస్థల బాధలను తప్పిస్తూ ప్రభుత్వం చేతిలోనే పౌరుల క్రెడిట్ స్కోరు ఉంటుందని చెప్పొచ్చు.

Tags:    

Similar News