ప్రపంచంలోనే అత్యంత పొడవైన రైల్వే టన్నెల్.. స్విట్జర్లాండ్‌కు స‌వాల్!

ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే నెట్‌వర్క్ ఉన్న దేశాల జాబితాలో అమెరికా, చైనా, రష్యా , భారత్ మొదటి నాలుగు స్థానాల్లో ఉన్నాయి.;

Update: 2026-04-30 09:11 GMT

ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే నెట్‌వర్క్ ఉన్న దేశాల జాబితాలో అమెరికా, చైనా, రష్యా , భారత్ మొదటి నాలుగు స్థానాల్లో ఉన్నాయి. అయితే ప్రపంచంలోనే అత్యంత పొడవైన రైల్వే టన్నెల్ విషయానికి వస్తే మాత్రం ఈ నాలుగు దేశాల్లో ఏదీ అగ్రస్థానంలో లేదు. స్విట్జర్లాండ్‌లోని ఆల్ప్స్ పర్వతాల గుండా నిర్మించిన 57.1 కిలోమీటర్ల పొడవైన `గోత్హార్డ్ బేస్ టన్నెల్` ప్రస్తుతం ప్రపంచ విజేతగా నిలుస్తోంది. 17 ఏళ్ల సుదీర్ఘ శ్రమ.. సుమారు 12 బిలియన్ డాలర్ల ఖర్చుతో నిర్మితమైన ఈ ఇంజనీరింగ్ అద్భుతం ఇప్పుడు ఒక కొత్త సవాల్‌ను ఎదుర్కోబోతోంది.

గోత్హార్డ్ బేస్ టన్నెల్ ప్రాముఖ్యత కేవలం దాని పొడవులోనే లేదు. ఇది ఉత్తర -దక్షిణ ఐరోపా మధ్య ప్రయాణ సమయాన్ని గొప్ప‌గా తగ్గించింది. గతంలో ఎత్తైన పర్వత కనుమల గుండా వెళ్లడానికి ఇబ్బంది పడే గూడ్స్ రైళ్లు, ఇప్పుడు ఈ ఫ్లాట్ కారిడార్ ద్వారా అత్యంత వేగంగా.. తక్కువ ఖర్చుతో ప్రయాణిస్తున్నాయి. రోడ్డు రవాణా నుండి సరుకు రవాణాను రైలు మార్గానికి మళ్లించడం ద్వారా కాలుష్య ఉద్గారాలను తగ్గించి.. స్విట్జర్లాండ్ సుస్థిరత లక్ష్యాలను చేరుకోవడంలో ఇది కీలక పాత్ర పోషిస్తోంది.

ఈ టన్నెల్ నిర్మాణం ఇంజనీర్లకు ఒక అగ్నిపరీక్షగా నిలిచింది. 1999 నుండి 2016 వరకు జరిగిన ఈ నిర్మాణంలో భూగర్భంలో విపరీతమైన ఒత్తిడి... పర్వతాల లోపల 46 డిగ్రీల సెల్సియస్ వరకు ఉండే ఉష్ణోగ్రతలను తట్టుకుని దీనిని పూర్తి చేశారు. గ్రానైట్ వంటి కఠినమైన రాళ్లతో పాటు..కుప్పకూలే ప్రమాదం ఉన్న మెత్తటి శిలల గుండా మార్గాన్ని మలచడానికి అత్యాధునిక `టన్నెల్ బోరింగ్ మెషీన్ల`ను వినియోగించారు. కొన్ని చోట్ల 400 మీటర్ల పొడవున్న భారీ యంత్రాలు పనిచేస్తే... మరికొన్ని చోట్ల సాంప్రదాయ డ్రిల్లింగ్ .. బ్లాస్టింగ్ పద్ధతులను వాడారు.

ఈ టన్నెల్ లోతు కూడా ఆశ్చర్యపరిచే విధంగా ఉంటుంది. పర్వత ఉపరితలం నుండి సుమారు 2.3 కిలోమీటర్ల లోతులో దీనిని నిర్మించారు. ఇది ప్రపంచంలోని లోతైన రైల్వే టన్నెళ్లలో ఒకటిగా నిలిచింది. 13వ శతాబ్దం నుండి వ్యాపారులు ఆల్ప్స్ దాటడానికి పడిన కష్టాలకు ఇది ఒక శాశ్వత పరిష్కారంగా మారింది. 1882లో నిర్మించిన మొదటి గోత్హార్డ్ రైల్వే టన్నెల్ వారసత్వాన్ని పునికిపుచ్చుకుని.. 21వ శతాబ్దపు అవసరాలకు అనుగుణంగా ఈ ఆధునిక బేస్ టన్నెల్‌ను రూపొందించారు.

అయితే ఈ ప్రపంచ రికార్డును త్వరలోనే ఫ్రాన్స్, ఇటలీ దేశాలు అధిగమించబోతున్నాయి. సుమారు 27 బిలియన్ డాలర్ల వ్యయంతో నిర్మితమవుతున్న `మాంట్ సెనిస్ బేస్ టన్నెల్` ఇప్పుడు గోత్హార్డ్ రికార్డుకు సవాల్ విసురుతోంది. లియోన్ నుండి టురిన్ నగరాలను కలిపే ఈ టన్నెల్ పొడవు 57.5 కిలోమీటర్లు ఉండబోతోంది. ఏటా పది లక్షల ట్రక్కులను రోడ్డు నుండి రైలు మార్గానికి మళ్లించడమే ఈ భారీ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యం. ఇటీవల దీని కోసం జర్మనీలో తయారైన భారీ టీబీఎం యంత్రాలను ఇటలీలోని నిర్మాణ ప్రాంతానికి తరలించారు.

ప్రపంచ దేశాల మధ్య టన్నెల్ నిర్మాణ పోటీ ఇప్పుడు తీవ్రతరమైంది. భారతదేశం కూడా 14 కిలోమీటర్ల పొడవైన `జోజిలా టన్నెల్` వంటి ప్రాజెక్టులతో ఆసియాలోనే అతి పొడవైన రోడ్డు టన్నెల్‌ను నిర్మిస్తోంది. మరోవైపు చైనా తన `బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్`లో భాగంగా 30 నుండి 40 కిలోమీటర్ల పొడవైన టన్నెళ్లను వేగంగా నిర్మిస్తోంది. రికార్డులు మారుతున్నా కానీ స్విట్జర్లాండ్‌లోని గోత్హార్డ్ బేస్ టన్నెల్ మాత్రం మానవ నిర్మిత ఇంజనీరింగ్ అద్భుతాలకు ఒక గొప్ప నిదర్శనంగా నిలిచిపోతుంది.

Tags:    

Similar News