2012 సీన్ రిపీట్ అవుతుందా.. పరుగులు పెడుతున్న బంగారం ఆగేదెప్పుడు?

అయితే ఇలా ప్రతిరోజు బంగారం ధరలు ఆకాశాన్ని అంటుతూ పరుగులు పెడుతుంటే అసలు ఈ బంగారం ధరలకు నిలకడ లేదా.. ? బంగారం తన పరుగును ఆపేదెప్పుడు? అంటూ అందరూ కామెంట్లు చేస్తున్నారు.;

Update: 2025-10-15 06:52 GMT

బంగారం.. బంగారం.. బంగారం.. అసలు ఈ పేరు పలకడానికి కూడా సామాన్యులే కాదు ధనవంతులు కూడా ఇష్టపడడం లేదు..కారణం పెరుగుతున్న అకాల ధరలు. చరిత్రలో కనీ వినీ ఎరుగని రీతిలో బంగారం ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. సాధారణంగా 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ఎప్పుడూ కూడా లక్ష దాటలేదు. కానీ ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే త్వరలో 1,20,000 కు చేరుకునే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. అయితే ఇలా ప్రతిరోజు బంగారం ధరలు ఆకాశాన్ని అంటుతూ పరుగులు పెడుతుంటే అసలు ఈ బంగారం ధరలకు నిలకడ లేదా.. ? బంగారం తన పరుగును ఆపేదెప్పుడు? అంటూ అందరూ కామెంట్లు చేస్తున్నారు.

ఇలాంటి సమయంలో గత పరిస్థితులను మనం ఒకసారి పరిశీలిస్తే 2012 సీన్ రిపీట్ అయితే చాలా బాగుంటుంది. ఎందుకంటే.. ఒకప్పుడు కాస్తో కూస్తో డబ్బులు ఉంటే బంగారం కొనుగోలు చేసి దాచుకునేవారు. పైగా ఇంట్లో బంగారం ఉంటే ఎక్కడలేని భరోసా.. అత్యవసరానికి ఉపయోగపడుతుందనే నమ్మకం. బంగారం చేతిలో ఉంటే ఆర్థికంగా ఎలాంటి నష్టాలు ఎదురవవు అనే నమ్మకంతో మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా బంగారం కొనుగోలు చేసేవారు. కానీ ఇప్పుడున్న పరిస్థితులను బట్టి చూస్తే ఎప్పుడు పడితే అప్పుడు బంగారం కొనుగోలు చేసే పరిస్థితులు కనిపించడం లేదు.

దీనికి కారణం సుంకాలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు.. వీటికి తోడు డాలర్ పై ఫెడ్ రేట్ల ప్రభావం.. ప్రత్యేకించి కొన్ని దేశాల మధ్య ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితులు లాంటి ప్రతికూల అంశాల వల్లే సెంట్రల్ బ్యాంకులన్నీ ఇప్పుడు బంగారంపై దృష్టి పెట్టాయి. ప్రపంచ దేశాలలోని కొన్ని ముఖ్యమైన బ్యాంకులతోపాటు చైనా, జపాన్ వంటి దేశాలు కూడా బంగారు నిలువలు పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాయి. క్రమంగా బంగారం ధరలు పెరుగుతున్నాయి.

ఇకపోతే బంగారం ధరలు ఇలా రోజు రోజుకు పెరిగిపోతున్న నేపథ్యంలో పెట్టుబడులు దారులు కూడా ఇదే మంచి సమయమని బంగారంపై పెట్టుబడులు పెడుతున్నారు. పైగా గోల్డ్ ఈటీఎఫ్ లో పెట్టుబడులు పెట్టిన వారికి రెండు కు నాలుగు రెట్లు పెరిగింది. అంటే బంగారంపై ఇప్పుడు ఎంతమంది భరోసా పెట్టుకున్నారో అర్థం చేసుకోవచ్చు. మరోవైపు బంగారం ధరలపై హెచ్చరికలు చేసే నిపుణుల సంఖ్య కూడా పెరుగుతోంది.

ఎందుకంటే 2012 -13 సంవత్సర మధ్యకాలంలో ఘననీయంగా ఇలాగే ధరలు పెరిగిపోయాయి. ఆ టైంలో స్టాక్ మార్కెట్ కూడా ఊపు అందుకుంది. బంగారం కంటే మార్కెట్లలో లాభాలు ఎక్కువగా కనిపించడంతో అందరూ అదే వైపు పరుగులు పెట్టారు. ఫలితంగా ఒకేసారి 25 శాతం వరకు బంగారం ధరలు పడిపోవడంతో చాలామంది నష్టాలు ఎదుర్కోక తప్పలేదు. ఇప్పుడు కూడా స్టాక్స్ కంటే బంగారమే బెటర్ అనే సెంటిమెంట్ బలంగా నడుస్తోంది..ఒకవేళ ఇదే సెంటిమెంట్ కొనసాగితే మరికొన్ని రోజుల్లో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం 1,50,000 కు చేరడం పక్కా..

ఒకవేళ అలా కాకుండా 2012లో జరిగిన సీన్ రిపీట్ అయితే మాత్రం మళ్లీ బంగారం ధరలు పడిపోయే అవకాశం ఉందని ఇటీవల కొంతమంది నిపుణులు కూడా హెచ్చరిస్తున్నారు. కాబట్టి ఒకేసారి బంగారాన్ని నమ్ముకొని పెట్టుబడులు పెట్టుకోకుండా కాస్త ఆలోచించి అడుగులు వేస్తే మంచిదని సలహాలిస్తున్నారు. ఏది ఏమైనా బంగారం ధరలు పరుగెడుతున్న నేపథ్యంలో ఆ పరుగులకు బ్రేక్ పడితే తప్ప బంగారం ధర తగ్గదు అని చెప్పడంలో సందేహం లేదు. మరి ఈ పరుగు ఎక్కడి వరకు వెళ్తుంది? అసలు ఎక్కడ ఆగుతుంది? అసలు ఆగుతుందా? ఒకవేళ ఆగితే తిరిగి మళ్ళీ వెనక్కి వస్తుందా? ఇలా పలు అనుమానాలు ప్రతి ఒక్కరిలో తలెత్తుతున్నాయి. మరి ఏం జరుగుతుందో తెలియాలి అంటే ఇంకొన్ని రోజులు ఎదురు చూడక తప్పదు.

Tags:    

Similar News