బంగారం రూ.లక్ష ఎప్పుడు...ఈ రోజా...రేపా...లేక ఎల్లుండా ?
బంగారం ధరలు చూస్తుంటే ప్రస్తుతం సామాన్యుడికి కంటి మీద కునుకు కరువైంది. ఎప్పుడు లక్ష రూపాయల మార్కును దాటుతుందోనని భయం వారిలో పట్టుకుంది.;
బంగారం ధరలు చూస్తుంటే ప్రస్తుతం సామాన్యుడికి కంటి మీద కునుకు కరువైంది. ఎప్పుడు లక్ష రూపాయల మార్కును దాటుతుందోనని భయం వారిలో పట్టుకుంది. నిన్నటి వరకు వేలల్లో ఉన్న ధరలు ఇప్పుడు లక్షకు చేరువయ్యాయి. మరి ఈ రోజే ఆ ముహూర్తం వస్తుందా? రేపే షాక్ ఇస్తుందా? లేక ఇంకొన్ని రోజులు గుండెలు అరచేతిలో పెట్టుకోవాల్సి వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. ఒకప్పుడు పెట్టుబడికి భరోసాగా నిలిచిన బంగారం, ఇప్పుడు కొనాలంటేనే భయపడే పరిస్థితికి చేరుకుంది. గత కొద్ది రోజులుగా బంగారం ధరలను చూస్తుంటే, ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్నట్లు అనిపిస్తుంది. మధ్యతరగతి వారికి మాత్రం ఇది అందని ద్రాక్షగా మారుతోంది.
ఈ వారం మొదట్లో తగ్గుతున్నట్లు అనిపించినా.. చివరకు మళ్లీ పైపైకి ఎగబాకుతున్నాయి. ఈ వారం బంగారం ధరలు కాస్త ఒడిదుడుకులతో సాగాయి. ప్రారంభంలో రెండు రోజులు స్వల్పంగా తగ్గగా ఇక కొనుక్కుందాం అనుకున్న వారికి మళ్లీ నిరాశే ఎదురైంది.ఆ తర్వాత వరుసగా మూడు రోజులు మళ్లీ తన విశ్వరూపం చూపించింది. ఈ మూడు రోజుల్లోనే గ్రాముకు భారీగా పెరిగిపోయింది. ఈ వారంలోనే 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం గ్రాముకు ఏకంగా రూ.240 పెరగడం గమనార్హం. ఇక 22 క్యారెట్ల ఆభరణాల బంగారం కూడా గ్రాముకు రూ.225 మేరకు పెరిగింది. పెళ్లిళ్ల సీజన్ కావడంతో బంగారం కొనాలనుకునే వారికి ఇది నిజంగా చేదు వార్తే.
నిన్నటి ట్రేడింగ్‌లో కూడా ఇదే జోరు కొనసాగింది. 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర ఏకంగా రూ.270 పెరిగి రూ.97,310కి చేరుకుంది. ఈ దూకుడు చూస్తుంటే, కొద్ది రోజుల్లోనే లక్ష రూపాయల మార్కును తాకినా ఆశ్చర్యం లేదు. మార్కెట్ నిపుణులు కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితులు, డాలర్ విలువలో మార్పులు, కేంద్ర బ్యాంకుల కొనుగోళ్లు వంటి కారణాల వల్ల బంగారం ధరలు పెరుగుతూనే ఉంటాయని వారు అంచనా వేస్తున్నారు. పెళ్లిళ్ల సీజన్ కూడా డిమాండ్‌ను పెంచడంతో ధరలకు మరింత రెక్కలొచ్చాయి. నిపుణుల అంచనాల ప్రకారం, ఈ పెరుగుదల కొనసాగితే ఈ రోజుల లేదా రేపటిలోగానే బంగారం రూ.లక్ష మార్కును తాకినా ఆశ్చర్యం లేదు. ఇది ఇలా ఉంటే కాస్త ఊరట కలిగించే విషయం ఏమిటంటే.. వెండి ధరలు నేడు స్వల్పంగా తగ్గాయి. గ్రాము వెండి ధర రూ.99.90 ఉండగా, కేజీ వెండి ధర రూ.99,990కి చేరుకుంది.