బంగారం కొంటున్నారా.. ఈ విషయాలు తప్పనిసరి!
అయితే గత కొద్ది కాలంగా బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతున్న వేళ.. సామాన్య ప్రజలు బంగారం కొనుగోలు చేయాలంటేనే కాస్త భయపడిపోతున్నారు;
బంగారం.. అలంకరణ ఆభరణమే కాకుండా పెట్టుబడికి ఆదాయ వనరుగా కూడా నిలుస్తోంది. అయితే గత కొద్ది కాలంగా బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతున్న వేళ.. సామాన్య ప్రజలు బంగారం కొనుగోలు చేయాలంటేనే కాస్త భయపడిపోతున్నారు. అయితే బంగారం ధరల సంగతి అటు ఉంచితే.. ముఖ్యంగా బంగారం కొనుగోలు చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అనే విషయం మాత్రం తప్పనిసరిగా తెలుసుకోవాలి. లేకపోతే పెద్ద మొత్తంలో నష్టపోయే అవకాశం కూడా లేకపోలేదు. మరి బంగారం కొనుగోలు చేసేటప్పుడు ఎలాంటి విషయాలు తెలుసుకోవాలి? ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి.. ?అనే విషయాలు ఇప్పుడు చూద్దాం
తప్పనిసరిగా హాల్ మార్క్ ఉండాల్సిందే..
ఇకపోతే కేంద్ర ప్రభుత్వం ఈ మధ్య కఠినమైన ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. ముఖ్యంగా బంగారం కొనుగోలు చేసేటప్పుడు లేదా అమ్మేటప్పుడు ఖచ్చితంగా ఆ బంగారు ఆభరణాలపై హాల్ మార్క్ ఉండాలి అనే నిబంధన పెట్టింది. దీనివల్ల బంగారం నాణ్యతను తెలుసుకోవడానికి మరింత సులభం అవుతుంది.
బంగారం నాణ్యతలో తేడా తెలిసి ఉండాలి..
ప్రస్తుతం మార్కెట్లో 24K, 23K, 22k, 18K,14K అందుబాటులోకి రాగా.. ఇప్పుడు ధరలు పెరుగుతున్న నేపథ్యంలో 9K గోల్డ్ కూడా అందుబాటులోకి వచ్చింది. ముందుగా 24 క్యారెట్ బంగారంతో గోల్డ్ కాయిన్స్, గోల్డ్ బార్స్ , గోల్డ్ బిస్కెట్స్ మాత్రమే తయారు చేస్తూ ఉంటారు. ఇందులో 99.99% ప్యూర్ బంగారం ఉంటుంది. పైగా ఎటువంటి జింక్, కాపర్, సిల్వర్ వంటి లోహాలు కలపరు. అందుకే ఎవరైనా సరే ఆభరణాలు చూపించి...ఇది 24 క్యారెట్స్ అని చెబితే నమ్మి మోసపోకండి. 24 క్యారెట్ల బంగారం కేవలం కడ్డీల రూపంలో మాత్రమే మనకు లభ్యమవుతుంది.
22 క్యారెట్ల బంగారం విషయానికొస్తే.. మన దేశంలో ఎక్కువగా ఆభరణాల తయారీకి ఉపయోగిస్తున్నారు. 91.67 స్వచ్ఛమైన బంగారం ఉండడం వల్ల దీనిని 916 గోల్డ్ అని కూడా పిలుస్తారు. ఇందులో 8.33% జింక్, కాపర్, సిల్వర్, ఐరన్ వంటి లోహాలను మిక్స్ చేయడం వల్ల ఆభరణాలు మరింత స్ట్రాంగ్ గా తయారవుతాయి.
ఇక 18 K,14K గోల్డ్ కూడా మనకు మార్కెట్లో అందుబాటులో ఉంది. అయితే క్యారెట్ వ్యాల్యూ తగ్గే కొద్దీ స్వచ్ఛత తగ్గి ఇతర లోహాల వ్యాల్యూ పెరుగుతుంది. తాజాగా మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చిన 9K గోల్డ్ లో కేవలం 36% మాత్రమే గోల్డ్ ఉంటుంది. అయితే దీనికి కూడా కేంద్ర ప్రభుత్వం బిఐఎస్ హాల్ మార్కును కేటాయించడం గమనార్హం.
బంగారం కొనేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
బంగారం కొనేటప్పుడు ఏ షాపులో బంగారు కొనుగోలు చేస్తున్నామో.. అందులో కచ్చితంగా బిల్లు తీసుకోవాలి. తూకం విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. రాళ్లనగలు కొనేటప్పుడు రాళ్లు తీసి తూకం వేయమని వ్యాపారితో డిమాండ్ చేయాలి. అలాగే బిఐఎస్ హాల్ మార్క్ ఉన్న నగలను మాత్రమే కొనుగోలు చేయాలి. షాప్ వాళ్ళు ఇచ్చే ఆఫర్ల మోజులో పడి ఈ జాగ్రత్తలు మరిచిపోయారంటే కచ్చితంగా భవిష్యత్తులో నష్టం తప్పదు.
నేటి బంగారం ధరలు..
ఇకపోతే ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయి అనే విషయానికి వస్తే.. నిన్నటితో వంద రూపాయలు తగ్గి కాస్త తగ్గుముఖం పట్టిన బంగారం.. మళ్లీ ఈరోజు ఆకాశాన్ని చూస్తోంది. ఇక తాజాగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఏకంగా రూ.1,07,620 వద్ద కొనసాగుతూ ఉండగా.. 22 క్యారెట్ల పసిడిపై ఏకంగా రూ.700 పెరిగి ఇప్పుడు తులం రూ.98, 650 కి చేరుకుంది.
వెండి ధరలలో అనూహ్య మార్పులు..
ఇక వెండి ధరలలో అనూహ్య మార్పులు చోటుచేసుకున్నాయి. ఏకంగా ఒక్క రోజులోనే వెయ్యి రూపాయలు పతనం కావడంతో కేజీ వెండి విలువ రూ. 1.36లక్షలకు చేరింది.