తెరపైకి గోకర్ణ మహిళ భర్త వచ్చేశాడు.. ఏం చెప్పాడంటే?
ఇద్దరు పిల్లల్ని తీసుకొని గోకర్ణ అడవుల్లోని గుహలో ఉంటున్న రష్యా మహిళ ఉదంతం గురించి తెలిసిందే.;
ఇద్దరు పిల్లల్ని తీసుకొని గోకర్ణ అడవుల్లోని గుహలో ఉంటున్న రష్యా మహిళ ఉదంతం గురించి తెలిసిందే. ఇటీవల కొండ చరియలు విరిగి పడటంతో పెట్రోలింగ్ కు వెళ్లిన పోలీసులకు.. బట్టలు కనిపించటం.. ఆ వెంటనే గుహ వద్దకు వెళ్లిన వారికి రష్యన్ మహిళ.. ఆమె ఇద్దరు పిల్లలు కనిపించటంలో అవాక్కు అయ్యారు. వీసా గడువు ముగిసిన తర్వాత కూడా భారత్ లో ఉంటున్న విషయాన్ని గుర్తించి.. ఆమెకు నచ్చ చెప్పి వారిని ఒక ఆశ్రమంలో ఉంచటం తెలిసిందే.
ఆమెను ప్రశ్నించిన పోలీసులకు.. తన భర్త గురించి కానీ ఇతర విషయాలు పెద్దగా చెప్పింది లేదు. దీంతో.. ఆమె పిల్లలకు తండ్రి ఎవరు? అన్నది ప్రశ్నగా మారింది. దీనికి సమాధానం తాజాగా దొరికింది. వీసా గడువు ముగిసిన నేపథ్యంలో ఆమెను రష్యాకు తిరిగి పంపే కార్యక్రమాన్ని అధికారులు చేస్తున్న క్రమంలో.. ఆమె భర్త ఇజ్రాయెల్ నివాసి అయిన గోల్డ్ స్టయిన్ తెర మీదకు వచ్చాడు.
తనకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే నైనా కుటినా(రష్యన్ మహిళ) గోవా విడిచి వెళ్లినట్లుగా పేర్కొన్నారు. అంతేకాదు.. తామిద్దరం ఎలా కలిశామన్న విషయాన్ని చెప్పుకొచ్చారు. ఎనిమిదేళ్ల క్రితం తనను గోవాలో కలిశాను. ఆమెతో ప్రేమలో పడ్డానని చెప్పిన అతను.. ‘ఇండియాలో మేం ఏడు నెలలు కలిసి ఉన్నాం. ఆ తర్వాత ఉక్రెయిన్ లో ఎక్కువ సమయం గడిపాం. పిల్లల్లి కలిసేందుకు గడిచిన నాలుగేళ్లుగా ఇండియాకు తరచూ వస్తున్నానన్న అతను.. ‘‘కొద్ది నెలల క్రితం గోవా నుంచి చెప్పకుండానే ఆమె వెళ్లిపోయింది. ఇప్పటివరకు వారెక్కడ ఉన్నారో తెలీదు. దీంతో వారు కనిపించటం లేదని పోలీసులకు కంప్లైంట్ కూడా చేశాను. తాజాగా వారు గోకర్ణలో ఉన్నట్లు తెలుసుకున్నా’’ అని చెప్పకొచ్చాడు.
వారి ఆచూకీ గురించి తెలిసిన తర్వాత తాను నైనాను.. పిల్లల్ని కలిసేందుకు గోకర్ణకు వెళ్లానని.. అయితే పిల్లలతో ఎక్కువ సమయాన్ని గడిపే అవకాశాన్ని తనకు ఇవ్వలేదన్నారు. వారికి అవసరమైన డబ్బుల్ని తాను ప్రతి నెలా సమకూరుస్తున్నట్లు చెప్పారు. పిల్లల అవసరాలకు తగినంత డబ్బుఆమె వద్ద ఉందన్న అతను.. వారిని రష్యాకు తిరిగి పంపే అంశంపై స్పందించారు. వారిని రష్యాకు పంపితే తనకు కష్టమవుతుందని.. అందుకే వారిని అక్కడకు పంపకుండా ఉండేందుకు తన ప్రయత్నాలు తాను చేస్తున్నట్లు చెప్పారు. మొత్తంగా మిస్టరీగా మారిన గోకర్ణ గుహలో కనిపించిన రష్యన్ మహిళకు సంబంధించిన వివరాలు ఆమె భర్త కారణంగా బయటకు వచ్చాయని చెప్పక తప్పదు.