100 మెట్రిక్ టన్నుల బంగారం ఇండియాకు విమానంలో తరలించి ఎక్కడ దాచారో తెలుసా?
కరోనా మహమ్మారి సృష్టించిన అల్లకల్లోలం నుంచి ప్రపంచం కోలుకోకముందే.. వరుస యుద్ధాలు .. కృత్రిమ మేధస్సు (AI) రాకతో తలెత్తుతున్న ఉద్యోగ సంక్షోభం మానవాళిని గందరగోళంలోకి నెట్టేస్తున్నాయి.;
కరోనా మహమ్మారి సృష్టించిన అల్లకల్లోలం నుంచి ప్రపంచం కోలుకోకముందే.. వరుస యుద్ధాలు .. కృత్రిమ మేధస్సు (AI) రాకతో తలెత్తుతున్న ఉద్యోగ సంక్షోభం మానవాళిని గందరగోళంలోకి నెట్టేస్తున్నాయి. పొరుగు దేశాల్లో ఆకలి కేకలు, యుద్ధ కల్లోలంతో సర్వం కోల్పోయిన జనం బీద అరుపులు అరుస్తుంటే.. రానున్న రోజుల్లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మరింత దిగజారిపోతుందనే ఆర్థిక నిపుణుల అంచనాలు సగటు మనిషిని నిశ్చేష్టుడిని చేస్తున్నాయి. 2026 నాటికి ప్రపంచం ఒక పెను ఆర్థిక మాంద్యం దిశగా అడుగులు వేస్తోందని.. స్టాక్ మార్కెట్లు కుప్పకూలే ప్రమాదం ఉందని `రిచ్ డాడ్ పూర్ డాడ్` రచయిత రాబర్ట్ కియోసాకి వంటి విశ్లేషకులు చేస్తున్న హెచ్చరికలు ఇన్వెస్టర్లలో వణుకు పుట్టిస్తున్నాయి.
ప్రపంచ కుబేరుడు వారెన్ బఫెట్ వంటి వారు ఇప్పటికే ఈ ముప్పును పసిగట్టి.. బ్యాంకుల నుంచి భారీగా నగదును వెనక్కి తీసుకుని స్థిరాస్తుల్లో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమవుతున్నారనే వార్తలు ఈ ఆందోళనను నిజం చేస్తున్నాయి. ఒకవైపు ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధ మేఘాలు.. హార్ముజ్ జలసంధి దిగ్బంధనం వంటి భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు చమురు ధరలను ఆకాశానికి చేర్చుతూ `ఆయిల్ క్రైసిస్`కు దారితీస్తున్నాయి. దీనికి తోడు భగభగ మండే ఎల్ నినో ప్రభావంతో వ్యవసాయ ఉత్పాదకత పడిపోయి.. 150 ఏళ్ల నాటి కరువు కాటకాలు మళ్లీ పునరావృతమవుతాయనే భయం ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది.
ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో భారతదేశం తన ఆర్థిక భద్రతను కాపాడుకునేందుకు అత్యంత వ్యూహాత్మకమైన అడుగులు వేస్తోంది. అందులో భాగంగానే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తాజాగా బ్రిటన్‌లోని బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ ..ఇతర విదేశీ బ్యాంకుల భద్రతలో ఉన్న సుమారు 102.23 మెట్రిక్ టన్నుల బంగారాన్ని అత్యంత రహస్యంగా భారత్‌కు తరలించింది. 1991లో దేశం ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పుడు గత్యంతరం లేక బంగారాన్ని విదేశాల్లో తాకట్టు పెట్టిన చేదు జ్ఞాపకాన్ని తుడిచేస్తూ.. నేడు అదే బంగారాన్ని గర్వంగా స్వదేశానికి తీసుకురావడం మన ఆర్థిక వ్యవస్థ శక్తికి నిదర్శనంగా నిలుస్తోంది.
ఈ భారీ ఆపరేషన్‌ను కేంద్ర ప్రభుత్వం - ఆర్బీఐ జాయింట్ గా అత్యంత రహస్యంగా, కట్టుదిట్టమైన భద్రత మధ్య నిర్వహించాయి. ప్రత్యేక విమానాల ద్వారా తరలించిన ఈ నిల్వలను ముంబైలోని ఆర్బీఐ ప్రధాన కార్యాలయం .. నాగ్‌పూర్‌లోని భారీ గోదాముల్లో భద్రపరిచారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం తర్వాత ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న అస్థిరత దృష్ట్యా.. మన సంపద మన గడ్డపైనే ఉండటం వల్ల అత్యవసర సమయాల్లో వేగంగా నిర్ణయాలు తీసుకోవచ్చని.. అలాగే విదేశీ బ్యాంకులకు చెల్లించే భారీ నిల్వ రుసుములను ఆదా చేయవచ్చని ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకుంది.
ప్రస్తుతం ఆర్బీఐ వద్ద మొత్తం 822 మెట్రిక్ టన్నుల బంగారం ఉండగా.. అందులో దాదాపు సగం నిల్వలు ఇప్పుడు భారతదేశంలోనే ఉన్నాయి. రానున్న రోజుల్లో మిగిలిన బంగారాన్ని కూడా దశలవారీగా వెనక్కి తెచ్చే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. స్టాక్ మార్కెట్లు ఒడిదుడుకులకు లోనైనప్పుడు బంగారం- స్థిరాస్తులే అత్యంత సురక్షితమైన పెట్టుబడులని రాబర్ట్ కియోసాకి వంటి వారు పదేపదే చెబుతున్నారు. ఆర్బీఐ చర్యలు కూడా ఇదే దిశగా సాగుతూ దేశ ఆర్థిక సార్వభౌమత్వాన్ని కాపాడుతున్నాయి.
మొత్తంగా చూస్తే.. 2026 ఒక గండంలా ముంచుకొస్తున్న వేళ.. అటు ప్రకృతి వైపరీత్యాలు.. ఇటు యుద్ధాలు.. ఆర్థిక ఒడిదుడుకులను తట్టుకోవడానికి ప్రతి దేశం తనదైన రక్షణ కవచాన్ని నిర్మించుకుంటోంది. ప్రపంచవ్యాప్తంగా పంటలు పండని పరిస్థితులు ఏర్పడితే తలెత్తే ఆహార సంక్షోభం నుంచి తప్పించుకోవడానికి.. ఆర్థిక మాంద్యాన్ని తట్టుకోవడానికి భారత ప్రభుత్వం తీసుకుంటున్న ముందస్తు చర్యలు సామాన్య ప్రజలకు ఊరటనిస్తాయనే భరోసా ఉంది. ఈ కల్లోల కాలంలో స్థిరమైన ఆస్తులను కలిగి ఉండటమే అత్యుత్తమ మార్గమని నిపుణులు సూచిస్తున్నారు.